Share News

నాటో నుంచి తప్పుకునే అంశాన్ని పరిశీలిస్తున్నాం: ట్రంప్‌

ABN , Publish Date - Apr 01 , 2026 | 03:54 PM

నాటో నుంచి తప్పుకునే అంశాన్ని తమ దేశం పరిశీలిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. ఇరాన్‌పై యుద్ధంలో నాటో దేశాలు తమకు సహకరించడం లేదని ట్రంప్ తెలిపారు.

నాటో నుంచి తప్పుకునే అంశాన్ని పరిశీలిస్తున్నాం: ట్రంప్‌
America President Donald Trump

ఇంటర్నెట్ డెస్క్: నాటో (North Atlantic Treaty Organization) నుంచి తప్పుకునే అంశాన్ని తమ దేశం పరిశీలిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) సంచలన ప్రకటన చేశారు. ఇరాన్‌పై యుద్ధంలో నాటో దేశాలు తమకు సహకరించడం లేదని ట్రంప్ ఆరోపించారు. ఈ మేరకు నాటో నుంచి అమెరికా వైదొలిగే ఆలోచనలో ఉన్నట్లు బ్రిటన్‌కు చెందిన ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఇరాన్‌పై అమెరికా- ఇజ్రాయెల్ చేపట్టిన సైనిక చర్యకు మిత్రదేశాలు మద్దతు ఇవ్వడం లేదని.. వాళ్లు విఫలమైనందు వల్లే ఆ అంశాన్ని పరిశీలిస్తున్నట్లు ట్రంప్ పేర్కొన్నారు.


నాటో కూటమిని కాగితపు పులిగా అభివర్ణించారు ట్రంప్. నాటో విశ్వసనీయతపై తనకు ఎప్పటి నుంచో చాలా సందేహాలు ఉన్నాయని చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా బ్రిటన్ యుద్ధనౌకల దుస్థితిపై ట్రంప్ నేరుగా విమర్శలు గుప్పించారు. 'మీకు నావికాదళమే లేదు. మీరు చాలా పాతబడిపోయారు. పైగా మీ వద్ద పనిచేయని విమాన వాహక నౌకలు ఉండేవి' అని ఎద్దేవా చేశారు. యూకే ప్రధానమంత్రి కీర్ స్టార్మర్ రక్షణ వ్యయాన్ని పెంచాలా? అని సదరు రిపోర్టర్ ప్రశ్నించగా.. తానేమీ సలహా ఇవ్వనని, ఆయనకు నచ్చింది చేసుకోవచ్చన్నారు.


ట్రంప్ వ్యాఖ్యలపై యూకే ప్రధాని..

ట్రంప్ వ్యాఖ్యలపై బ్రిటన్ ప్రధాని స్టార్మర్‌ను సదరు పత్రిక ప్రశ్నించగా.. నాటోకు తమ దేశం పూర్తిగా కట్టుబడి ఉందన్నారు. నాటో కూటమిని ఇప్పటివరకూ ప్రపంచం చూసిన అత్యంత సమర్థవంతమైన ఏకైక సైనిక కూటమిగా ఆయన అభివర్ణించారు. కొన్ని రోజులుగా తనపై, నాటో దేశాలపై ఎంతో ఒత్తిడి ఉందన్నారు. తాను తీసుకునే ఏ నిర్ణయమైనా బ్రిటిష్ జాతీయ ప్రయోజనాల కోసమే అని స్టార్మర్ స్పష్టం చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి

అమరావతికి అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు: హోం మంత్రి అనిత

కాంగ్రెస్ ప్రిన్స్‌కు వందోసారి కూడా ఓటమి ఖాయం: మోదీ

Updated Date - Apr 01 , 2026 | 04:23 PM