Share News

అమరావతే రాజధాని అంటూ లోక్ సభ ఆమోదం.. మంత్రి లోకేశ్ స్పందనిదే..

ABN , Publish Date - Apr 01 , 2026 | 03:15 PM

రాజధాని అమరావతి ప్రాంతంలో సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. అమరావతే ఆంధ్రప్రదేశ్ రాజధాని అంటూ లోక్ సభ ఆమోదం తెలపడంతో సందడి మెుదలైంది. ఈ సందర్భంగా మంత్రి లోకేశ్ స్పందించారు.

అమరావతే రాజధాని అంటూ లోక్ సభ ఆమోదం.. మంత్రి లోకేశ్ స్పందనిదే..
Minister Nara Lokesh

అమరావతి: రాజధాని అమరావతి ప్రాంతంలో సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. అమరావతే ఆంధ్రప్రదేశ్ రాజధాని అంటూ లోక్ సభ ఆమోదం తెలపడంతో సందడి మెుదలైంది. వైసీపీ మినహా సభలోని అన్ని పార్టీలు రాజధానిగా అమరావతికే ఓటేశాయి. ఈ సందర్భంగా ఎక్స్ వేదికగా ఏపీ మంత్రి నారా లోకేశ్ స్పందించారు. ఐదు కోట్ల ఆంధ్రులు గర్వించే చరిత్రాత్మక రోజు ఇదంటూ సంతోషం వ్యక్తం చేశారు.


మంత్రి లోకేశ్ ట్వీట్ ఇదే..

'నా రాష్ట్రం ఆంధ్రప్రదేశ్- నా రాజ‌ధాని అమ‌రావ‌తి అని ఐదు కోట్ల ఆంధ్రులు గ‌ర్వంగా నిన‌దించే చరిత్రాత్మకమైన రోజుకు దేశ పార్లమెంట్ వేదిక కావ‌డం చాలా సంతోషంగా ఉంది. ఒకే రాష్ట్రం- ఒకే రాజ‌ధాని నినాదంతో అభివృద్ధి వికేంద్రీక‌ర‌ణ విధానంతో రాజ‌ధానిగా అమ‌రావ‌తిని నిర్ణయిస్తూ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ చేసిన ఏక‌గ్రీవ తీర్మానానికి చట్టబద్ధత క‌ల్పించే అమ‌రావ‌తి బిల్లు పార్లమెంట్‌లో ప్రవేశపెట్టి, ఆమోదించడం కోట్లాది ప్రజలు గ‌ర్వించ‌ద‌గ్గ సంద‌ర్భం.


అమరావతి, కేంద్ర ప్రభుత్వానికి మద్దతుగా నిలిచిన పార్టీల‌కు కృతజ్ఞతలు. ఇది ఐదు కోట్ల ఆంధ్రుల ఆకాంక్ష. అమ‌రావ‌తి విజ‌యం.. ఆంధ్రప్రదేశ్ ప్రజల విజ‌యం. ఇది రైతుల త్యాగాలకు ద‌క్కిన దైవ ఆశీస్సులు. శాంతియుత పోరాటానికి ద‌క్కిన ఫ‌లితం. కోట్లాది ప్రజల కోరిక‌ను గౌర‌వించిన కేంద్రం ఆంధ్రుల ఆత్మగౌరవ రాజ‌ధానిగా చరిత్ర-సంస్కృతికి ఆల‌వాల‌మైన అమ‌రావ‌తిని నిలిపింది. జై ఆంధ్రప్రదేశ్.. జ‌య‌హో అమ‌రావ‌తి..' అంటూ మంత్రి లోకేశ్ ట్వీట్ చేశారు.


ఏపీ రాజధాని అమరావతికి లోక్ సభ ఆమోదం తెలపడంతో ఢిల్లీకి మంత్రి లోకేశ్ వెళ్లనున్నారు. ఇవాళ రాత్రికి ఆయన దేశ రాజధానికి బయలుదేరనున్నారు. బిల్లుకు సహకరించిన ఎంపీలు, కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలపనున్నారు. గురువారం నాడు రాజ్యసభలో బిల్లుపై చర్చ సమయంలో ఢిల్లీలోనే ఉండనున్నారు. ఈ సందర్భంగా మంత్రి లోకేశ్ పర్యటనకు ప్రాధాన్యం సంతరించుకుంది.


ఈ వార్తలు కూడా చదవండి

రాజధాని అమరావతిపై జగన్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు..

సీఎం చంద్రబాబు కృషి వల్లే.. లోక్‌‌సభలో బిల్లు ఆమోదం: మంత్రి నారాయణ

Updated Date - Apr 01 , 2026 | 03:29 PM