రాజధాని అమరావతిపై జగన్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు..
ABN , Publish Date - Apr 01 , 2026 | 02:41 PM
రాజధాని అమరావతిపై ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మరోసారి అక్కసు వెళ్లగక్కారు. పార్లమెంట్‌లో రాజధాని అమరావతిపై కీలక చర్చ జరిగే సమయంలో తాడేపల్లి ప్యాలెస్‌లో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి అడ్డంకులు తొలగిపోయాయి. లోక్ సభలో ఇవాళ(బుధవారం) రాజధాని అమరావతి బిల్లుకు ఆమోదం లభించింది. ఈ వార్తతో తెలుగు రాష్ట్రాల ప్రజలు, రాజధాని ప్రాంత ప్రజలు, కూటమి నేతలు సంబరాలు చేసుకుంటున్నారు. అయితే, ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మాత్రం రాజధాని అమరావతిపై మరోసారి అక్కసు వెళ్లగక్కారు. పార్లమెంట్‌లో రాజధాని అమరావతిపై కీలక చర్చ జరిగే సమయంలో తాడేపల్లి ప్యాలెస్‌లో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
మావిగన్ ప్లాన్-బి అంటూ ఏపీ రాజధానిపై మరోసారి జగన్ గందరగోళ ప్రకటన చేశారు. ఏపీ కోసం ప్రాక్టికల్‌గా ఆలోచించే వారికి మాత్రమే తాను చెప్పేది అర్థమవుతుందని అన్నారు. ప్లాన్-బి ప్రకారం విజయవాడ, మచిలీపట్నం, గుంటూరు ప్రాంతాలను కలిపి రాజధాని చేయాలని జగన్ అన్నారు. దీనికి మావిగన్ అని పేరు పెట్టాలన్నారు. అమరావతికి పెట్టే రూ.2 లక్షల కోట్లలో 10 శాతం పెడితే మావిగన్ భవిష్యత్తులో మంచి నగరం అవుతుందని అన్నారు.
కేంద్ర ప్రభుత్వ తీరును తప్పుపట్టారు వైసీపీ అధినేత. రాష్ట్రాలకు రాజధానులను కేంద్రం నిర్ణయించదని ఆరోపించారు. దేశానికి రాజధాని ఉంటుందని.. కానీ రాష్ట్రాలకు రాజధాని ఉండదంటూ అర్థంపర్థం లేని వ్యాఖ్యలు చేశారు. రాజ్యాంగంలో రాష్ట్రానికి రాజధాని అనే పదమే లేదని చెప్పుకొచ్చారు. రాష్ట్ర రాజధాని అనేది పూర్తిగా ఆయా రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలోని అంశమని చెప్పుకొచ్చారు జగన్. మరోవైపు, ప్రజా రాజధాని అమరావతికి లోక్ సభలోని అన్ని పార్టీలు మద్దతు తెలుపగా.. వైసీపీ మాత్రం వాకౌట్ చేసింది. దీంతో ఆ పార్టీ ఎంపీల తీరుపై కూటమి నేతలు మండిపడుతున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
ఏపీకి శాశ్వత రాజధానిగా అమరావతి: ఎంపీ పురందేశ్వరి
అమరావతి చట్టబద్ధత బిల్లుకు లోక్‌సభ ఆమోదం