నాటో ఓ కాగితం పులి... విరుచుకుపడిన ట్రంప్
ABN , Publish Date - Mar 20 , 2026 | 08:48 PM
ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ జరుపుతున్న యుద్ధంలో తమకు సహకరించడం లేదంటూ నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్‌పై ట్రంప్ విమర్శలు గుప్పించారు. అమెరికా లేకపోతే నాటో ఒక 'కాగితం పులి' అని సంచలన వ్యాఖ్యలు చేశారు.
వాషింగ్టన్: ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ జరుపుతున్న యుద్ధంలో తమకు సహకరించడం లేదంటూ నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ (NATO)పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విమర్శలు గుప్పించారు. అమెరికా లేకపోతే నాటో ఒక 'కాగితం పులి' అని సంచలన వ్యాఖ్యలు చేశారు. నాటో భాగస్వాములను 'పిరికివాళ్లు'గా సంబోధించారు. ట్రూత్ సోషల్ పోస్టులో ట్రంప్ నాటో భాగస్వాములపై ఈ విమర్శల దాడి చేశారు. ఇరాన్‌పై పోరాటాన్ని మిలటరీ విజయంగా అభివర్ణించారు.
'ఇరాన్‌ను అణుశక్తి కలిగిన దేశంగా మారకుండా అడ్డుకునే విషయంలో అమెరికాకు నాటో భాగస్వామ్య దేశాలు సహకరించడం లేదు. హోర్మూజ్ జలసంధి తెరుచుకునేందుకు సహకరించాలని నాటో భాగస్వాములు ఏమాత్రం అనుకోవడం లేదు. నిజానికి కొద్దిపాటి రిస్క్‌తో ఆ పని చేయడం వాళ్లకు చాలా తేలిక. పిరికివాళ్లు, మేము వాళ్లను గుర్తుపెట్టుకుంటాం' అని ఆ పోస్టులో ట్రంప్ మండిపడ్డారు.
హోర్మూజ్ జలసంధి మీదుగా వాణిజ్య నౌకలు సురక్షితంగా ముందుకు వెళ్లేందుకు యుద్ధ నౌకలను మోహరించాల్సిందిగా పలు దేశాలను ట్రంప్ ఇప్పటికే కోరారు. అయితే పలు దేశాలు అందుకు నిరాకరించడమో, ఆచితూచి స్పందించడమో చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ట్రంప్ తాజా వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
ఇవి కూడా చదవండి..
మొజ్తాబా ఖమేనీ వీడియో విడుదల చేసిన ఇరాన్ ప్రభుత్వ మీడియా
ఐఆర్‌జీసీ అధికార ప్రతినిధి అలీ మహమ్మద్ నయీని మృతి