చంద్రుడిని ఢీకొన్న 4 టన్నుల బరువు ఉన్న స్పేస్‌ఎక్స్ రాకెట్ శకలం!
ABN , Publish Date - Aug 05 , 2026 | 06:49 PM
అంతరిక్షంలో ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. సుమారు 4 టన్నుల బరువున్న 'స్పేస్‌ఎక్స్'కు చెందిన ఫాల్కన్-9 రాకెట్ శకలం చంద్రుడిని ఢీకొన్నట్లు శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: అంతరిక్షంలో ఓ కీలక ఘటన చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. సుమారు 4 టన్నుల బరువున్న 'స్పేస్‌ఎక్స్' (SpaceX) ఫాల్కన్-9 రాకెట్‌కు చెందిన పైభాగపు శకలం చంద్రుడిని ఢీకొన్నట్లు శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. దీనివల్ల భూమికి ఎటువంటి ప్రమాదం లేనప్పటికీ, చంద్రుడి ఉపరితలంపై మాత్రం భారీ గుంత(Crater) ఏర్పడి ఉంటుందని నిపుణులు తెలిపారు. అమెరికా కాలమానం ప్రకారం గత ఏడాది జనవరిలో చంద్రుడిపైకి ల్యాండర్లను మోసుకెళ్లిన ఫాల్కన్-9 రాకెట్‌కు సంబంధించిన సెకండ్ స్టేజ్ శకలం నిర్దేశిత కక్ష్య నుంచి పక్కకు తప్పుకుంది.
సూర్య కిరణాలు (Solar activity), గురుత్వాకర్షణ శక్తి ప్రభావాల కారణంగా ఈ శకలం క్రమంగా తన మార్గాన్ని మార్చుకుని చంద్రుడిని సమీణించిందని స్పేస్‌ఎక్స్ వర్గాలు వెల్లడించాయి. ఇది గంటకు సుమారు 8,690 కిలోమీటర్ల (5,400 మైళ్ళు) వేగంతో చంద్రుడి ఉత్తర గోళార్ధంలోని ఐన్‌స్టీన్ క్రెటర్ సమీపంలో జాబిల్లిని ఢీకొన్నట్లు అంచనా వేశారు. ఈ అనూహ్య పరిణామంపై నాసా (NASA)తో పాటు పలు అంతరిక్ష పరిశోధనా సంస్థలు ప్రత్యేక దృష్టి సారించాయి. నాసాకు చెందిన 'ల్యూనార్ రికాన్సజెన్స్ ఆర్బిటర్' (LRO) ప్రోబ్, సౌత్ కొరియాకు చెందిన 'పాత్‌ఫైండర్' ఆర్బిటర్లు.. శకలం పడిన ప్రాంతాన్ని ఫొటోలు తీసేందుకు సన్నద్ధమయ్యాయి.
రాకెట్ శకలం చంద్రుడిని ఢీకొట్టిన కారణంగా ఏర్పడే ధూళి మేఘాలు, శిథిలాలను అధ్యయనం చేయడం ద్వారా భవిష్యత్తులో జాబిల్లిపై మానవ నివాసాలు ఏర్పాటు చేసే ప్రణాళికలకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. మరోవైపు ప్రస్తుతం భూమి చుట్టూ సుమారు 17,000 టన్నుల బరువున్న 46,000లకు పైగా అంతరిక్ష వ్యర్థాలు తిరుగుతున్నట్లు యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ (ESA) ఆందోళన వ్యక్తం చేసింది. ఈ వ్యర్థాలు రోజురోజుకూ పెరిగిపోతే భవిష్యత్తులో పెను ప్రమాదాలు సంభవించే అవకాశం ఉందని కొందరు నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఏదేమైనప్పటికీ, ఈ ఘటన అంతరిక్ష ప్రయోగాల్లో వ్యర్థాల తొలగింపు, పర్యవేక్షణపై మరోసారి ఆలోచన రేకెత్తిస్తోంది.
ఇవి కూడా చదవండి..
యూపీఐ చార్జీలపై ఆర్‌బీఐ గవర్నర్ కీలక వ్యాఖ్యలు..
షేక్ హసీనా ప్రసంగంతో భారత ప్రభుత్వానికి సంబంధం లేదు: విదేశాంగ శాఖ