ఇంటర్ కాలేజీలకు ఫైర్ NOC తప్పనిసరి: ఇంటర్ బోర్డు సెక్రటరీ అభిలాష అభినవ్
ABN , Publish Date - Aug 05 , 2026 | 06:31 PM
ఇంటర్మీడియట్ కాలేజీల ఫైర్ సేఫ్టీ నిబంధనల అమలులో భాగంగా సమర్పించిన కొన్ని ఫైర్ NOCలు నకిలీవిగా తేలినట్లు ఇంటర్మీడియట్ బోర్డు వెల్లడించింది. కాలేజీల నుంచి వచ్చిన సర్టిఫికెట్లను హైడ్రాతో పరిశీలించగా ఈ విషయం వెలుగులోకి వచ్చిందని ఇంటర్మీడియట్ బోర్డు సెక్రటరీ అభిలాష అభినవ్ తెలిపారు.
హైదరాబాద్: ఇంటర్మీడియట్ కాలేజీలకు ఫైర్ NOC కంపల్సరీ చేశామని ఇంటర్మీడియట్ బోర్డు సెక్రటరీ అభిలాష అభినవ్ తెలిపారు. ఇంటర్మీడియట్ బోర్డుకు వచ్చిన కొన్ని ఫైర్ NOCలను హైడ్రాతో సంప్రదించి పరిశీలించగా, కొన్ని సర్టిఫికెట్లు బోగస్‌గా ఉన్నట్లు గుర్తించామన్నారు. హైడ్రాకు వచ్చిన దరఖాస్తుల వివరాలు ఇంటర్మీడియట్ బోర్డుకు అందడంతో నకిలీ సర్టిఫికెట్ల వ్యవహారం వెలుగులోకి వచ్చిందని ఆమె చెప్పారు. ప్రస్తుతం ఫేక్ NOCల వ్యవహారంపై విచారణ కొనసాగుతోందని, విచారణ పూర్తయిన తర్వాత ఎన్ని నకిలీ సర్టిఫికెట్లు సమర్పించారనే విషయం స్పష్టమవుతుందని తెలిపారు.
ఫేక్ NOCలపై కఠిన చర్యలు
నకిలీ ఫైర్ NOCల విషయంలో హైడ్రా, ఇంటర్మీడియట్ బోర్డు సీరియస్‌గా ఉన్నాయని అభిలాష అభినవ్ వెల్లడించారు. ఈ వ్యవహారంపై ఇంటర్మీడియట్ బోర్డు స్థాయిలో అంతర్గత విచారణ కూడా చేపడుతున్నట్లు తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించిన కాలేజీలపై తగిన చర్యలు తీసుకునే అవకాశం ఉందని పేర్కొన్నారు.
విద్యార్థులు ఆందోళన చెందొద్దు
ఫేక్ NOCల వ్యవహారంపై విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఇంటర్మీడియట్ బోర్డు స్పష్టం చేసింది. విద్యార్థులకు ఎలాంటి నష్టం కలగకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని అభిలాష అభినవ్ తెలిపారు. కాలేజీల అనుమతులకు సంబంధించిన పూర్తి వివరాలు అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయని, తల్లిదండ్రులు ఏవైనా సందేహాలు ఉంటే వెబ్‌సైట్ ద్వారా తనిఖీ చేసుకోవచ్చని సూచించారు. ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి 3 వేలకుపైగా ఇంటర్మీడియట్ కాలేజీలు అనుమతులు పొందినట్లు ఇంటర్మీడియట్ బోర్డు సెక్రటరీ అభిలాష అభినవ్ తెలిపారు.
Also Read:
నీటి విషయంలో అన్యాయం జరిగితే తెలంగాణ ఊరుకోదు: హరీశ్ రావు
ఆర్‌ఎస్ ప్రవీణ్.. కల్వకుంట్ల కుటుంబానికి ఊడిగం చేస్తున్నారు: సంపత్ కుమార్