Share News

విదేశీ మీడియాపై పాకిస్థాన్ ఆంక్షలు.. వార్తల కవరేజీకి ఇక ఎన్‌ఓసీ తప్పనిసరి..

ABN , Publish Date - Aug 05 , 2026 | 06:29 PM

పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్‌లో కొనసాగుతున్న నిరసనల నేపథ్యంలో విదేశీ మీడియాపై పాకిస్థాన్ ప్రభుత్వం కొత్త ఆంక్షలు విధించింది.

విదేశీ మీడియాపై పాకిస్థాన్ ఆంక్షలు.. వార్తల కవరేజీకి ఇక ఎన్‌ఓసీ తప్పనిసరి..
PoK Protests

ఇంటర్నెట్ డెస్క్: పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ (POK)లో కొనసాగుతున్న నిరసనల నేపథ్యంలో విదేశీ మీడియాపై పాకిస్థాన్ ప్రభుత్వం కొత్త ఆంక్షలు విధించింది. ఇకపై విదేశీ వార్తా సంస్థలకు చెందిన పాత్రికేయులు ఇస్లామాబాద్, లాహోర్, కరాచీ వంటి ప్రధాన నగరాల వెలుపల వార్తల సేకరణకు వెళ్లాలంటే 'నో అబ్జెక్షన్ సర్టిఫికేట్' (NOC) తప్పనిసరిగా తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది (Pakistan Foreign Journalists).


కొత్త మార్గదర్శకాల ప్రకారం, విదేశీ పాత్రికేయులు ఇకపై ప్రయాణించే ప్రాంతం, సందర్శన ఉద్దేశం, బృందం వివరాలను ముందుగానే ప్రభుత్వానికి తెలియజేసి అనుమతి పొందాల్సి ఉంటుంది. అనుమతి లేకుండా సున్నిత ప్రాంతాల్లో వార్తల సేకరణ లేదా చిత్రీకరణ చేయడానికి వీల్లేదు. పీఓకేలో కొనసాగుతున్న ఆందోళనల సమయంలో ఈ నిబంధనలు అమల్లోకి రావడం చర్చనీయాంశంగా మారింది (PoK Protests).


ఇటీవల పీఓకేలో నిరసనలు, భద్రతా బలగాల చర్యలు, ఎన్నికల నిర్వహణపై అంతర్జాతీయ మీడియాలో విస్తృత కథనాలు వెలువడ్డాయి (Press Freedom Pakistan). ఈ పరిణామాల తర్వాతే విదేశీ మీడియాపై పాకిస్థాన్ ప్రభుత్వం నియంత్రణలను మరింత కఠినతరం చేసింది. ఈ చర్య పత్రికా స్వేచ్ఛకు విరుద్ధమని మీడియా సంఘాలు విమర్శిస్తున్నాయి. జాతీయ భద్రత, సున్నిత ప్రాంతాల పరిరక్షణ కోసమే ఈ నిర్ణయం తీసుకున్నామని పాకిస్థాన్ ప్రభుత్వం పేర్కొంది.


ఇవి కూడా చదవండి..

ఖర్చు ఎవరో ఒకరు భరించాల్సిందే.. యూపీఐ చార్జీలపై ఆర్‌బీఐ గవర్నర్ కీలక వ్యాఖ్యలు..


షేక్ హసీనా ప్రసంగంతో భారత ప్రభుత్వానికి సంబంధం లేదు: విదేశాంగ శాఖ

Updated Date - Aug 05 , 2026 | 06:34 PM