ఇరాన్ యుద్ధం.. అమెరికా ఇప్పటివరకు ఎంత ఖర్చు పెట్టిందో తెలుసా..
ABN , Publish Date - Jul 22 , 2026 | 12:33 PM
ఫిబ్రవరి చివర్లో మొదలైన ఇరాన్ యుద్ధం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. దాదాపు నాలుగు నెలల నుంచి కొనసాగుతున్న ఈ యుద్ధం అమెరికాపై తీవ్ర ఆర్థిక ప్రభావం చూపుతోంది.
ఫిబ్రవరి చివర్లో మొదలైన ఇరాన్ యుద్ధం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. దాదాపు నాలుగు నెలల నుంచి కొనసాగుతున్న ఈ యుద్ధం అమెరికాపై తీవ్ర ఆర్థిక ప్రభావం చూపుతోంది. ఇరాన్‌తో కొనసాగుతున్న యుద్ధానికి ఇప్పటివరకు 37.5 బిలియన్ డాలర్లు (సుమారు రూ.3.6 లక్షల కోట్లు) ఖర్చు చేసినట్లు అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ వెల్లడించారు (Iran war cost).
అమెరికా సెనెట్ అప్రోప్రియేషన్స్ కమిటీ సమావేశంలో ఈ విషయాన్ని హెగ్సెత్ (Pete Hegseth) వెల్లడించారు. అలాగే ప్రస్తుతం కొనసాగుతున్న సైనిక చర్యలకు అదనపు నిధులు అత్యవసరమని పేర్కొన్నారు. రిపబ్లికన్ పార్టీ మద్దతుతో అమెరికా ప్రభుత్వం 67 బిలియన్ డాలర్ల అదనపు నిధుల ప్యాకేజీకి ఆమోదం కోరుతోంది. ఇందులో రక్షణ శాఖకు భారీగా నిధులు కేటాయించారు. అలాగే ఇతర జాతీయ ప్రాధాన్యతా అంశాలకు కూడా నిధులు ప్రతిపాదించారు. ఈ నిధులు యుద్ధ సామర్థ్యాన్ని కొనసాగించేందుకు అవసరమని హెగ్సెత్ వివరించారు (US military spending).
ఈ సమావేశం సందర్భంగా డెమోక్రటిక్ పార్టీ సభ్యులు యుద్ధ వ్యూహం, పెరుగుతున్న ఖర్చులు, స్పష్టమైన ముగింపు ప్రణాళిక లేకపోవడంపై ప్రభుత్వాన్ని నిలదీశారు. మరోవైపు హెగ్సెత్ మాత్రం ఇరాన్ నుంచి అమెరికా, దాని మిత్రదేశాలకు ముప్పు కొనసాగుతోందని, అందుకే సైనిక చర్యలు కొనసాగించడం తప్పనిసరి అని సమర్థించుకున్నారు.
ఇవి కూడా చదవండి..
2028 నుంచి 100% సుంకాలు, ఆ తర్వాత 200%.. జనరిక్ మందులపై ట్రంప్ కీలక నిర్ణయం..
పసిడి ధరలు మరింత పెరిగాయ్.. ఈ రోజు మీ నగరంలో ఎలా ఉన్నాయంటే..