Share News

చిన్న ఆయుధంతో..అమెరికాకు పెద్ద దెబ్బ!

ABN , Publish Date - Mar 05 , 2026 | 03:29 AM

ఒక బాక్సింగ్‌ పోటీ జరుగుతోంది.. అందులో ఒకరు బలమైన బాక్సర్‌.. ప్రత్యర్థి కాస్త బలహీనుడు.. కానీ బలహీనమైన ప్రత్యర్థి కవ్విస్తూ, రెచ్చగొడుతున్న కొద్దీ బలమైన బాక్సర్‌ వేగంగా పరుగెడుతూ....

చిన్న ఆయుధంతో..అమెరికాకు పెద్ద దెబ్బ!

  • అమెరికా, మిత్రదేశాల ఆయుధ నిల్వలు తరిగిపోయేలా ఇరాన్‌ వ్యూహాత్మక యుద్ధం

  • తక్కువ ఖర్చయ్యే షహీద్‌ డ్రోన్‌లతో దాడులు

దుబాయ్‌/ వాషింగ్టన్‌, మార్చి 4: ఒక బాక్సింగ్‌ పోటీ జరుగుతోంది.. అందులో ఒకరు బలమైన బాక్సర్‌.. ప్రత్యర్థి కాస్త బలహీనుడు.. కానీ బలహీనమైన ప్రత్యర్థి కవ్విస్తూ, రెచ్చగొడుతున్న కొద్దీ బలమైన బాక్సర్‌ వేగంగా పరుగెడుతూ, పంచ్‌లు విసరడానికి ప్రయత్నిస్తూ అలసిపోయాడు.. చివరికి బలహీనమైన ప్రత్యర్థి తన వద్ద మిగిలిన బలమంతా ప్రయోగించి.. బలమైన బాక్సర్‌ను నేల కూల్చాడు.. ఇక్కడ బలమైన బాక్సర్‌ అమెరికా, ఇజ్రాయెల్‌ అయితే.. బలహీన ప్రత్యర్థి ఇరాన్‌! చివరికి అలా ఇరాన్‌ గెలుస్తుందో లేదోగానీ.. ఇలాంటి వ్యూహంతోనే అమెరికా, ఇజ్రాయెల్‌, వాటి మిత్రదేశాలకు మాత్రం కొరకరాని కొయ్యగా మారుతోంది. తక్కువ ఖర్చయ్యే వందలాది షహీద్‌ ఆత్మాహుతి డ్రోన్లతో గల్ఫ్‌ దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాలపై దాడులు చేస్తోంది. వాటిని అడ్డుకునేందుకు అమెరికా, మిత్రదేశాలు ఖరీదైన ఇంటర్‌సెప్టర్‌ క్షిపణులను వినియోగించాల్సి వస్తోంది. ఇదే సమయంలో అమెరికాకు ఆర్థికంగా ఎక్కువ నష్టం కలిగేలా.. రూ.వేల కోట్ల విలువైన కీలక రాడార్లు, కమాండ్‌ సెంటర్లను ధ్వంసం చేయడంపై ఇరాన్‌ దృష్టిపెట్టింది. గల్ఫ్‌ దేశాల్లోని అమెరికా టెక్‌ సంస్థల డేటా సెంటర్లను ధ్వంసం చేసేందుకు ప్రయత్నిస్తోంది. యుద్ధం తొలిదశలో వాడకూడదన్న ఉద్దేశంతో తామింకా అసలైన ఆయుధాలను బయటికి తీయలేదని ఇరాన్‌ సెక్యూరిటీ కౌన్సిల్‌ చీఫ్‌ అలీ లరిజని ఇటీవల ప్రకటించడం గమనార్హం. తమ వద్ద ఉన్న ఆయుధాల్లో ఇప్పుడు ప్రయోగిస్తున్నవన్నీ తుప్పుపట్టినవేనని, అసలైన ఆయుధాలను కీలక దశలో ప్రయోగిస్తామని ఆయన పేర్కొన్నారు. ఐఆర్‌జీసీ కమాండర్‌ జబ్బారీ కూడా దాదాపు ఇదే తరహా ప్రకటన చేశారు. అమెరికా వద్ద ఉన్న క్షిపణుల నిల్వలు తరిగిపోయేదాకా డ్రోన్లతో దాడులు కొనసాగించి.. ఆ తర్వాత భారీ స్థాయిలో క్షిపణుల ప్రయోగానికి దిగాలని ఇరాన్‌ భావిస్తోందన్న దానికి ఈ ప్రకటనలు సంకేతమని విశ్లేషకులు చెబుతున్నారు.

5.jpg

‘అత్యంత విలువైన’ ఆస్తులపై ఫోకస్‌..

అమెరికాను ఆర్థికంగా దెబ్బతీయడం, తమపై యుద్ధం ఆపేదిశగా ఒత్తిడి తేవడం లక్ష్యంగా.. పశ్చిమాసియాలో అత్యంత విలువైన ఆస్తులపై ఇరాన్‌ ఫోకస్‌ చేసింది. సౌదీలోని ఆరామ్‌కో చమురు రిఫైనరీపై దాడి చేయడం, దుబాయ్‌, బహ్రెయిన్‌ విమానాశ్రయాలపై డ్రోన్‌ దాడులు, హోర్ముజ్‌ జలసంధి మూసివేత, చమురు ట్యాంకర్‌ నౌకలపై దాడులు వంటివన్నీ ఆ వ్యూహంలో భాగంగానే చేపట్టింది. ముఖ్యంగా గల్ఫ్‌లోని అమెరికా సైనిక బేస్‌లలో కీలకమైన ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుంది. ఈ క్రమంలో తాజాగా ఖతార్‌లోని అద్‌ ఉదేద్‌ అమెరికా సైనిక స్థావరంలోని ‘ఏఎన్‌/ఎఫ్‌పీఎస్-132 ఫేజ్డ్‌ అర్రే రాడార్‌’పై ఇరాన్‌ క్షిపణులతో దాడి చేసి ధ్వంసం చేసింది. అమెరికా నిఘా వ్యవస్థలకు అత్యంత కీలకమైన ఈ రాడార్‌ విలువ సుమారు రూ.10,130 కోట్లు కావడం గమనార్హం. ఇక బహ్రెయిన్‌లోని అమెరికా నావల్‌ సపోర్ట్‌ యాక్టివిటీ (ఎన్‌ఎస్ఏ) బేస్‌లోని కమాండ్‌ సెంటర్‌ ఇరాన్‌ డ్రోన్‌ దాడుల్లో ధ్వంసమైంది.

3.jpg


ఆయుధాలు తగ్గితే.. అమెరికాపై ఒత్తిడే!

ఐదు రోజుల యుద్ధంలో వేలకొద్దీ వాడేయడంతో అమెరికా, మిత్రదేశాల వద్ద ఇంటర్‌సెప్టర్‌ క్షిపణుల నిల్వ గణనీయంగా తగ్గిపోయినట్టు అంచనా. బ్లూమ్‌బర్గ్‌ నివేదిక ప్రకారం.. ఇప్పుడున్న స్థాయిలోనే వినియోగిస్తే ఖతార్‌ వద్ద ఉన్న పేట్రియాట్‌ క్షిపణులు నాలుగైదు రోజుల్లో అయిపోతాయి. ఈ క్రమంలోనే యుద్ధం ఆపాలంటూ ఖతార్‌ ఒత్తిడి చేస్తోందని బ్లూమ్‌బర్గ్‌ పేర్కొంది. యూఎస్‌, ఇజ్రాయెల్‌ దాడులు ప్రారంభం కావడానికి ముందు ఇరాన్‌ వద్ద 2 వేల బాలిస్టిక్‌ క్షిపణులు, అంతకు పదింతలు షహీద్‌ డ్రోన్లు ఉన్నాయని.. ఇరాన్‌ ఇప్పటివరకు వెయ్యివరకు క్షిపణులను ప్రయోగించినట్టు అంచనాలు ఉన్నాయని వెల్లడించింది. మిగతా అంతా షహీద్‌ డ్రోన్లనే వినియోగిస్తోందని స్పష్టం చేసింది. రష్యా, ఇతర ఉత్పత్తిదారులు కలిపి.. రోజుకు వందల కొద్దీ షహీద్‌ డ్రోన్లను తయారు చేయగలవని.. దీనితో ఇరాన్‌కు కొరత తలెత్తకపోవచ్చని అంచనా వేసింది. ఇక ప్రత్యర్థుల వనరులను ఖర్చుచేసేలా ఇరాన్‌ అనుసరిస్తున్న వ్యూహం ఆ దేశం కోణంలో ప్రస్తుతానికి సరైనదేనని స్టిమ్సన్‌ సెంటర్‌ ప్రతినిధి కెల్లీ గ్రీకో పేర్కొన్నారు.

ఆయుధాల ఉత్పత్తి పెంపుపై ట్రంప్‌ దృష్టి

ఇరాన్‌పై యుద్ధం నేపథ్యంలో కీలక ఆయుధాలు, క్షిపణులకు కొరత ఏర్పడిందని రెండు రోజుల క్రితం అమెరికా వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ కథనం ప్రచురించింది. రష్యాతో యుద్ధం కోసం ఉక్రెయిన్‌కు భారీగా ఆయుధ సాయం, గాజాలో ఇజ్రాయెల్‌ దాడులకు సాయంతో ఈ పరిస్థితి తలెత్తిందని పేర్కొంది. దాన్ని ఖండించిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌.. అపరిమిత స్థాయిలో ఆయుధ నిల్వలు ఉన్నాయని మంగళవారం ప్రకటించారు. అయితే ఇరాన్‌పై దాడులు మరో పది రోజుల పాటు ఇలాగే కొనసాగితే.. కీలకమైన ఆయుధాల నిల్వ ప్రమాదకర స్థాయికి పడిపోతుందని పేర్కొంటూ అధ్యక్షుడికి అమెరికా రక్షణ శాఖ ప్రధాన కార్యాలయం పెంటగాన్‌ ఇచ్చిన నివేదిక బుధవారం లీకైంది. ఆ వివరాలతో అల్‌జజీరా కథనం ప్రచురించింది. యుద్ధ నౌకల రక్షణకు ఉద్దేశించిన ఇంటర్‌సెప్టర్‌ క్షిపణులు చాలా తక్కువగా ఉన్నాయని.. పేట్రియాట్‌, థాడ్‌ వ్యవస్థల్లో ఉపయోగించే క్షిపణులకూ కొరత తలెత్తే అవకాశం ఉందని అధ్యక్షుడికి పెంటగాన్‌ స్పష్టం చేసింది. ఈ క్రమంలో ఆయుధాల సమీకరణపై ట్రంప్‌ దృష్టిసారించినట్టు తెలిసింది. ఈ మేరకు వైట్‌హౌజ్‌లో లాక్‌హీడ్‌ మార్టిన్‌, రేథియాన్‌ సహా కీలక ఆయుధ తయారీ సంస్థలతో ట్రంప్‌ శుక్రవారం భేటీకానున్నట్టు రాయిటర్స్‌ వెల్లడించింది.

2.jpg


ఏమిటీ షహీద్‌ ఆత్మాహుతి డ్రోన్లు?

తక్కువ ఖర్చుతో శత్రువులపై దాడి చేయడానికి ఇరాన్‌ షహీద్‌-136 ఆత్మాహుతి డ్రోన్లను అభివృద్ధి చేసింది. ఇవి 50 కిలోల నుంచి 90 కిలోల పేలుడు పదార్థాలతో 1,300 కిలోమీటర్ల దూరం వరకు ప్రయాణించి లక్ష్యాలను ఛేదించగలవు. తర్వాత మరింత ఎక్కువ పేలుడు పదార్థాలతో, ఎక్కువ దూరం ప్రయాణించే వెర్షన్లనూ అభివృద్ధి చేసింది. వీటితో ఉన్న ప్రయోజనాన్ని, సామర్థ్యాన్ని గుర్తించిన రష్యా.. 2022లో ఇరాన్‌ నుంచి ఈ టెక్నాలజీని, 6 వేల షహీద్‌ డ్రోన్లను కొనుగోలు చేసింది. మరింత అభివృద్ధి చేసి, ఉక్రెయిన్‌పై దాడుల కోసం వినియోగిస్తోంది. రష్యా ఉక్రెయిన్‌పై ఇప్పటివరకు 57 వేలకుపైగా ఇలాంటి డ్రోన్లను ప్రయోగించినట్టు అంచనా.

రూ.18 లక్షల డ్రోన్‌ను అడ్డుకునేందుకు రూ.37 కోట్ల క్షిపణి!

గల్ఫ్‌ దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాలు, ఎంబసీలు, ఇతర కీలక లక్ష్యాలపైకి ఇరాన్‌ పెద్ద సంఖ్యలో షహీద్‌ ఆత్మాహుతి డ్రోన్లను ప్రయోగిస్తోంది. ఒక్కో డ్రోన్‌ తయారీ వ్యయం రూ.18 లక్షలు (20 వేల డాలర్లు) మాత్రమే. అయితే ఈ డ్రోన్లను అడ్డుకునేందుకు అమెరికా, మిత్రదేశాల గగనతల రక్షణ వ్యవస్థలు పేట్రియాట్‌ ఇంటర్‌సెప్టర్‌ క్షిపణులను ప్రయోగిస్తున్నాయి. వాటి విలువ ఒక్కోటీ సుమారు రూ.37 కోట్లకు (4 మిలియన్‌ డాలర్లు)పైనే. కొన్ని స్థావరాల్లో ఇరాన్‌ డ్రోన్లు, క్షిపణులను అడ్డుకోవడం కోసం థాడ్‌ బాలిస్టిక్‌ క్షిపణి రక్షణ వ్యవస్థలను అమెరికా వినియోగిస్తోంది. వాటి నుంచి ప్రయోగించే ఒక్కో క్షిపణికి అయ్యే వ్యయం సుమారు రూ.110 కోట్లు కావడం గమనార్హం.

1.jpg


వందల సంఖ్యలో మరణాలు..

యుద్ధం మొదలైన ఈ ఐదు రోజుల నుంచి ఇరాన్‌పై ఇజ్రాయెల్‌, అమెరికా జరిపిన దాడుల్లో సుమారు 1,045 మంది ప్రాణాలు కోల్పోయారని ఆ దేశానికి చెందిన అమరవీరులు, వెటరన్ల వ్యవహారాల ఫౌండేషన్‌ తెలిపింది. ఆయా మృతదేహాలను గుర్తించి సమాధి చేస్తున్న నేపథ్యంలో ఈ సంఖ్య తేలిందన్నారు. అయితే ఈ సంఖ్య 787 అని రెడ్‌ క్రెసెంట్‌ సొసైటీ పేర్కొంది. ఇజ్రాయెల్‌లో 11 మంది చనిపోయినట్లు తెలిపింది. మరోవైపు కువైట్‌లో ఇరాన్‌ క్షిపణులను కూల్చే క్రమంలో శకలం తగిలి 11 ఏళ్ల బాలిక మృతి చెందినట్లు అక్కడి ప్రభుత్వం ప్రకటించింది. ఇక యూఏఈలో ముగ్గురు, బహ్రెయిన్‌ ఒకరు చొప్పున ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు తాము తొలి రెండు రోజులు జరిపిన దాడుల్లోనే అమెరికా మిలిటరీకి చెందిన 650 మంది ప్రాణాలు కోల్పోవడమో, గాయపడటమో జరిగిందని ఇరాన్‌కు చెందిన ఐఆర్‌జీసీ పేర్కొంది. ఇరాన్‌ దళాలు అమెరికాకు భారీగా నష్టం చేకూర్చాయన్నారు. ’

6.jpg

టర్కీపై క్షిపణి.. కూల్చివేసిన నాటో

ఇజ్రాయెల్‌, అమెరికా చేస్తున్న దాడులకు ప్రతిగా వివిధ దేశాల్లోని అమెరికా ఎయిర్‌బేస్‌లు లక్ష్యంగా దాడులు చేస్తున్న ఇరాన్‌.. బుధవారం టర్కీపై బాలిస్టిక్‌ క్షిపణిని ప్రయోగించింది. అయితే అది టర్కీ గగనతలంలోకి ప్రవేశించగానే నాటోకు చెందిన క్షిపణి రక్షణ వ్యవస్థ దానిని తూర్పు మధ్యధరా సముద్రంలో కూల్చివేసిందని టర్కీ రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. మరోవైపు ఇరాన్‌ తమపై రెండు బాలిస్టిక్‌ క్షిపణులను ప్రయోగించిందని ఖతార్‌ రక్షణ మంత్రిత్వశాఖ తెలిపింది. వాటిలో ఒకటి అల్‌ ఉదీద్‌ ఖతారీ బేస్‌ను ఢీ కొట్టిందని, అయితే ఈ దాడిలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని పేర్కొంది. ఇక హెజ్బొల్లా ఉగ్రవాదులు లక్ష్యంగా లెబనాన్‌లో ఇజ్రాయెల్‌ పలు చోట్ల దాడులు చేసింది. ఇందులో భాగంగా బాల్‌బెక్‌ నగరంలోని ఓ రెసిడెన్షియల్‌ కాంప్లెక్స్‌ దాడి చేయడంతో కనీసం ఐదుగురు చనిపోయారని లెబనాన్‌ అధికార మీడియా పేర్కొంది. అయితే లెబనాన్‌ ఆరోగ్య మంత్రిత్వశాఖ మాత్రం 50 మందికి పైగా మృతి చెందారని, 300 మందికి పైగా గాయపడ్డారని తెలిపింది. ఇదిలా ఉండగా.. ఇరాన్‌తో సంబంధం ఉన్న ఇరాక్‌లోని ఉగ్రవాద గ్రూపులు కూడా దాడులు మొదలుపెట్టాయి. బుధవారం జోర్డాన్‌పై డ్రోన్‌ దాడి చేసింది తామేనని సరయా అల్వయా అల్‌ దామ్‌ ప్రకటించింది.

7.jpg

Updated Date - Mar 05 , 2026 | 03:29 AM