అమెరికాకు ఇరాన్ 7 షరతులు.. అంగీకరిస్తేనే చర్చలు, హార్ముజ్ జలసంధి పునఃప్రారంభం..
ABN , Publish Date - Nov 12 , 2026 | 11:33 AM
అమెరికా, ఇరాన్ మధ్య యుద్ధానికి ముగింపు పలికేందుకు దౌత్య ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ ఇంకా ప్రతిష్ఠంభన కొనసాగుతోంది.
ఇంటర్నెట్ డెస్క్: అమెరికా, ఇరాన్ మధ్య యుద్ధానికి ముగింపు పలికేందుకు దౌత్య ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ ఇంకా ప్రతిష్ఠంభన కొనసాగుతోంది. తమతో చర్చలు జరపాలన్నా, ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హార్ముజ్ జలసంధిని తిరిగి తెరవాలన్నా అమెరికా ఏడు షరతులను అంగీకరించాలని ఇరాన్ స్పష్టం చేసింది. అమెరికా నుంచి స్పష్టమైన సమాధానం కోసం ఎదురుచూస్తున్నామని ఇరాన్ నాయకత్వం చెబుతోంది (Iran US War).
ఇరాన్ పార్లమెంట్ స్పీకర్, ప్రధాన చర్చల ప్రతినిధి మహమ్మద్ బాఘర్ గాలిబాఫ్ 'అల్ జజీరా'కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కీలక వ్యాఖ్యలు చేశారు. తమ డిమాండ్లతో కూడిన స్పష్టమైన సమాధానాన్ని ఇప్పటికే అమెరికాకు పంపించామని, అయితే వాషింగ్టన్ నుంచి ఇప్పటివరకు అధికారికంగా నిర్దిష్టమైన స్పందన రాలేదని తెలిపారు. ఇప్పుడు నిర్ణయం తీసుకోవాల్సింది అమెరికానేనని, తమ ప్రతిపాదనలపై ఆ దేశం స్పందించి ప్రకటించాలని అన్నారు. అమెరికా తమ షరతులను అంగీకరిస్తే శాంతికి ప్రాధాన్యం ఇస్తామని స్పష్టం చేశారు. అయితే మరోసారి సైనిక చర్యలకు దిగితే అమెరికా మరో ఓటమిని ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు (US Iran Talks).
అమెరికాకు ఇరాన్ విధించిన ఏడు షరతులు ఇవే (Iran Seven Conditions)..
1) వాణిజ్య నౌకలు, చమురు ట్యాంకర్లు హార్ముజ్ జలసంధి గుండా సురక్షితంగా ప్రయాణించేలా హామీ ఇవ్వాలి.
2) ఇరాన్‌పై అమెరికా విధించిన ఏకపక్ష ఆర్థిక ఆంక్షలను ఎత్తివేయాలి.
3) ఇరాన్ చమురు ఎగుమతులపై ఉన్న ఆంక్షలను తొలగించాలి.
4) ఇరాన్ నౌకాశ్రయాలపై అమెరికా విధించిన నౌకాదళ ఆంక్షలు, దిగ్బంధాన్ని తొలగించాలి.
5) విదేశాల్లో నిలిపివేసిన ఇరాన్ ఆస్తులు, నిధులను విడుదల చేయాలి.
6) ఇరాన్ అణు పదార్థాలు ఆ దేశంలోనే ఉండేందుకు అనుమతించాలి.
7) ఇరాన్‌తో పాటు ప్రాంతీయంగా కొనసాగుతున్న యుద్ధానికి ముగింపు పలకాలి.
ఇవి కూడా చదవండి..
ఇరాన్‌తో యుద్ధాన్ని అమెరికా మొదలుపెట్టలేదు: డొనాల్డ్ ట్రంప్
ఎన్విడియా సీఈవో జెన్సెన్ హువాంగ్‌కు పదవీ గండం.. తెరపైకి మరో అఫైర్..