Share News

క్షేమంగా ఉన్న ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మొజ్తాబా

ABN , Publish Date - Mar 11 , 2026 | 03:27 PM

ఇరాన్ కొత్త సుప్రీం నేత మొజ్తాబా ఖమేనీ మధ్యప్రాచ్యంలో జరుగుతున్న ఘర్షణల్లో గాయపడినట్టు వచ్చిన వార్తలను ఆ దేశ అధ్యక్షుడు మసూద్ పెజిష్కియాన్ కుమారుడు యూసఫ్ పెజిష్కియాన్ బుధవారంనాడు ఒక ప్రకటనలో ఖండించారు. మొజ్తాబా ఆరోగ్యంతో, సురక్షితంగా ఉన్నారని తెలిపారు.

క్షేమంగా ఉన్న ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మొజ్తాబా
Mojtaba Khamenei

టెహ్రాన్: ఇరాన్ కొత్త సుప్రీం నేత మొజ్తాబా ఖమేనీ (Mojtaba Khamenei) మధ్యప్రాచ్యంలో జరుగుతున్న ఘర్షణల్లో గాయపడినట్టు వచ్చిన వార్తలను ఆ దేశ అధ్యక్షుడు మసూద్ పెజిష్కియాన్ కుమారుడు యూసఫ్ పెజిష్కియాన్ బుధవారంనాడు ఒక ప్రకటనలో ఖండించారు. మొజ్తాబా ఆరోగ్యంతో, సురక్షితంగా ఉన్నారని తెలిపారు. ఖమేనీ ఆరోగ్యం, ఆచూకీ విషయంపై ఊహాగానాల నేపథ్యంలో యూసఫ్ తాజా ప్రకటన చేశారు.


మొజ్తాబా గాయపడినట్టు వస్తున్న వార్తలు తన దృష్టికి వచ్చాయని, ఆయనతో టచ్‌లో ఉన్న స్నేహితులతో ఈ విషయమై ఆరా తీసానని యూసఫ్ తెలిపారు. ఆయన సురక్షితంగా, ఆరోగ్యంగా ఉన్నట్టు వారు తెలిపారని చెప్పారు. యూసఫ్ పెజిష్కియాన్ ప్రభుత్వ సలహాదారుగా కూడా ఉన్నారు.


యుద్ధం ప్రారంభమైనప్పుడు మొజ్తాబా కాళ్లకు పలుచోట్ల గాయాలైనట్టు పేరు చెప్పడానికి నిరాకరించిన ఇరాన్ అధికారులను ఉటంకిస్తూ 'న్యూయార్క్ టైమ్స్' ఇటీవల ఒక కథనం ప్రచురించింది. అత్యంత భద్రత కలిగి, కొద్దిమందికి మాత్రమే తెలిసిన సురక్షిత ప్రదేశంలో ఆయన ఉన్నట్టు తెలిపింది. సుదీర్ఘ కాలం సుప్రీం నేతగా ఉన్న అయతొల్లా అలీ ఖమేనీ ఇజ్రాయెల్ దాడుల్లో మృతి చెందడంతో ఆయన కుమారుడైన మొజ్తాబాను గత ఆదివారంనాడు కొత్త సుప్రీం నేతగా ఇరాన్ ప్రకటించింది. అయితే అప్పటి నుంచి ఆయన బహిరంగంగా కనిపించడం కానీ, దేశాన్ని ఉద్దేశించి లిఖిత పూర్వక ప్రకటన చేయడం కానీ జరగలేదు. దీంతో ఆయన ఆచూకీ, ఆరోగ్యంపై ఊహాగానాలు వెలువడ్డాయి.


ఇవి కూడా చదవండి..

ఇరాన్‌లో నల్లటి వర్షం.. ఇది ఎంత ప్రమాదకరమంటే..

మొజ్తాబాను తన వారసుడిగా ఖమేనీ వ్యతిరేకించారా..

Updated Date - Mar 11 , 2026 | 03:38 PM