యుద్ధం ఆపేద్దాం!
ABN , Publish Date - Mar 11 , 2026 | 03:57 AM
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలతో చమురు ధరలకు రెక్కలు రావడంతో అమెరికాలో ఒత్తిడి పెరుగుతోంది. దీర్ఘకాలం యుద్ధ చేస్తే తీవ్ర నష్టమనే భావన వ్యక్తమవుతోంది....
ట్రంప్‌కు సలహాదారుల ప్రతిపాదన
చమురు ధరల మంటలు, అమెరికాలో చట్టసభల ఎన్నికల నేపథ్యంలో అధ్యక్షుడిపై ఒత్తిడి
బయటపడే వ్యూహాన్ని అమలు చేయాలని సూచన
సలహాదారులను ఉటంకిస్తూ వాల్‌స్ట్రీట్ జర్నల్ కథనం
పుతిన్‌కు ట్రంప్ ఫోన్.. యుద్ధాన్ని త్వరగా ముగించే దిశగా పలు ప్రతిపాదనలు చేసిన రష్యా అధినేత
ఇరాన్ నౌకలను ముంచేయడం సైనికాధికారులకు సరదాగా ఉందట: మీడియా సమావేశంలో ట్రంప్
ఇకపై టన్ను వార్‌హెడ్ ఉన్న క్షిపణులు ప్రయోగిస్తాం
ఇరాన్ రివెల్యూషనరీ గార్డ్స్ హెచ్చరిక
కాల్పుల విరమణకు అంగీకరించం.. మళ్లీ దాడి చేసే ఆలోచనా చేయకుండా బుద్ధి చెప్తాం: ఇరాన్ స్పీకర్
ఆగని దాడులు.. ముదురుతున్న సంక్షోభం
వాషింగ్టన్/దుబాయ్/న్యూఢిల్లీ, మార్చి 10: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలతో చమురు ధరలకు రెక్కలు రావడంతో అమెరికాలో ఒత్తిడి పెరుగుతోంది. దీర్ఘకాలం యుద్ధ చేస్తే తీవ్ర నష్టమనే భావన వ్యక్తమవుతోంది. ఈ క్రమంలో ఇరాన్‌పై యుద్ధాన్ని నిలిపివేద్దామని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు సలహాదారులు సూచించినట్టు తెలిసింది. భారీగా పెరిగిపోతున్న చమురు ధరలు, మరోవైపు కొన్ని నెలల్లో అమెరికాలో చట్టసభ సెనేట్ ఎన్నికలున్న నేపథ్యంలో.. యుద్ధం నుంచి బయటపడే వ్యూహాన్ని అమలు చేయాలని కోరినట్టు సమాచారం. ఈ మేరకు అమెరికాకు చెందిన వాల్‌స్ట్రీట్ జర్నల్ తాజాగా కథనం ప్రచురించింది. ఆ కథనం ప్రకారం.. చమురు ధరలు బ్యారెల్‌కు 100 డాలర్లు దాటిపోవడంపై ట్రంప్ సలహాదారుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. త్వరలో సెనేట్ ఎన్నికలున్న నేపథ్యంలో రిపబ్లికన్ పార్టీ నేతల నుంచి ఆందోళన వ్యక్తం చేస్తూ వారికి ఫోన్‌కాల్స్ వచ్చాయి. యుద్ధం మొదలుపెట్టిన సమయంలో రిపబ్లికన్ల నుంచి అధ్యక్షుడికి మద్దతు లభించింది. కానీ యుద్ధం దీర్ఘకాలం కొనసాగితే ఈ మద్దతు తగ్గిపోయే ప్రమాదం ఉందని సలహాదారులు గుర్తించారు. అంతేకాదు చాలా మంది అమెరికన్లు యుద్ధాన్ని వ్యతిరేకిస్తున్నట్టు ఇటీవల వెలువడిన ఒక సర్వే ఫలితాలను సలహాదారులు అధ్యక్షుడి దృష్టికి తీసుకెళ్లారు. ఈ క్రమంలో ఇంత ఉధృతంగా దాడులు చేస్తున్నా ఇరాన్ తలొగ్గకపోవడంపై ట్రంప్ కూడా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే యుద్ధంలో ప్రధాన లక్ష్యాలను సాధించామంటూ వెనక్కి తగ్గే ప్రణాళికను అమలు చేయాలని ట్రంప్‌కు సలహాదారులు సూచించారని వాల్‌స్ట్రీట్ జర్నల్ పేర్కొంది.

పుతిన్‌కు ట్రంప్ ఫోన్.. యుద్ధంపై చర్చ
పశ్చిమాసియాలో యుద్ధం ముదురుతున్న వేళ ఏం చేయాలన్న దానిపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్, రష్యా అధ్యక్షుడు పుతిన్ చర్చలు జరిపారు. ఈ సందర్భంగా యుద్ధాన్ని త్వరగా ముగించే దిశగా ట్రంప్‌కు పుతిన్ పలు ప్రతిపాదనలు చేశారు. ఈ మేరకు రష్యా అధ్యక్ష కార్యాలయం క్రెమ్లిన్ ఒక ప్రకటన జారీ చేసింది. సోమవారం రాత్రి పుతిన్‌కు ట్రంప్ ఫోన్ చేశారని, దాదాపు గంట సేపు చర్చలు జరిపారని పుతిన్ విదేశాంగ శాఖ సలహాదారు యూరి ఉషకోవ్ తెలిపారు. పశ్చిమాసియాలో పరిస్థితి సహా వివిధ అంశాలపై ఇద్దరు నేతలు స్పష్టంగా తమ అభిప్రాయాలను పంచుకున్నారని వెల్లడించారు. ఇదే సమయంలో పశ్చిమాసియాలో పరిస్థితిపై తన అంచనాలను పుతిన్‌కు ట్రంప్ వివరించారని తెలిపారు. అదే సమయంలో చమురు ధరలు, ఉక్రెయిన్‌లో యుద్ధం, అమెరికా-రష్యా ద్వైపాక్షిక అంశాలపైనా ట్రంప్, పుతిన్ చర్చించారని చెప్పారు.
టన్ను వార్‌హెడ్ ఉన్న క్షిపణులు ప్రయోగిస్తాం: ఐఆర్‌జీసీ
ఇరాన్‌పై దాడులు పెంచుతామన్న అమెరికా, ఇజ్రాయెల్‌లకు ఇరాన్ రెవెల్యూషనరీ గార్డ్స్ కోర్ (ఐఆర్‌జీసీ) తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. ఏకంగా ఒక టన్ను వార్‌హెడ్ ఉన్న క్షిపణులను ప్రయోగించి, తీవ్ర స్థాయిలో నష్టం తప్పదని ఐఆర్‌జీసీ ఏరోస్పేస్ ఫోర్స్ కమాండర్ మాజిద్ మౌసావి ప్రకటించారు. క్షిపణి, డ్రోన్ దాడుల సంఖ్యను, తీవ్రతను మరింతగా పెంచుతామని హెచ్చరించారు. దీర్ఘకాలం యుద్ధానికి తాము సిద్ధంగా పేర్కొన్నారు. ఇక ప్రస్తుతం ఇరాన్ డ్రోన్లలో కేవలం రెండు కిలోల పేలుడు పదార్థాలున్న చిన్న బాంబులనే వాడుతోందని వాల్‌స్ట్రీట్ జర్నల్ పేర్కొంది. ఇరాన్ వద్ద ఇంకా గణనీయ స్థాయిలోనే క్షిపణులు, డ్రోన్లు ఉన్నట్టు అంచనా వేసింది. తాము ప్రయోగిస్తున్నవి మామూ లు ఆయుధాలేనని, అసలైన ఆయుధాలను త్వరలో బయటికి తీస్తామని ఇటీవల ఐఆర్‌జీసీ ప్రకటించిన విషయం తెలిసిందే. మరోవైపు అమెరికా, ఇజ్రాయెల్‌తో తాము కాల్పుల విరమణను కోరుకోవడం లేదని ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ బఖర్ ఖాలిబాఫ్ పేర్కొన్నారు. తమపై మరోసారి దాడి చేయాలన్న ఆలోచన కూడా వారికి కలగకుండా శిక్షిస్తామన్నారు.

చమురును ఆపితే 20 రెట్లు తీవ్ర దాడులు
హోర్ముజ్ జలసంధిలో చమురు రవాణాను ఇరాన్ అడ్డుకుంటే.. ఇప్పుడు చేస్తున్నదానికంటే 20 రెట్లు తీవ్రమైన ప్రతిస్పందన ఉంటుందని ట్రంప్ ‘ట్రూత్ సోషల్’లో హెచ్చరించారు. తాము సులభంగా నాశనం చేయగల లక్ష్యాలన్నింటినీ ధ్వంసం చేస్తామని, అదే జరిగితే ఒక దేశంగా నిలబడటం అసాధ్యంగా మారుతుందని వ్యాఖ్యానించారు. అయితే అలా జరగకూడదని తాను కోరుకుంటున్నట్టు చెప్పారు. హోర్ముజ్ జలసంధిలో రవాణా కొనసాగేందుకు తాము చేపట్టిన చర్యలు చైనా సహా ఆ మార్గాన్ని ఉపయోగించుకునే అన్ని దేశాలకు ఇచ్చే బహుమతి అని అభివర్ణించారు.
క్లస్టర్ బాంబులు వేస్తున్న ఇరాన్!
తీవ్ర నష్టం కలిగించేలా ఇరాన్ క్లస్టర్ బాంబులను ప్రయోగించడం మొదలుపెట్టిందని ఇజ్రాయెల్ మీడియాలో కథనాలు ప్రచురితమయ్యాయి. ఈ బాంబు లక్ష్యాన్ని ఛేదించే ముందు ఒకట్రండు కిలోమీటర్ల ఎత్తులోనే పదులకొద్దీ చిన్న బాంబులుగా విడిపోతుంది. ఏడెనిమిది కిలోమీటర్ల విస్తీర్ణంలో ఆ బాంబులు పడి విధ్వంసం సృష్టిస్తాయి. నిజానికి 2008 నాటి అంతర్జాతీయ ఒప్పందం ప్రకారం.. క్లస్టర్ బాంబులను ప్రయోగించడం తీవ్రమైన యుద్ధ నేరం కిందకు వస్తుంది. అయితే ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా మూడు దేశాలు కూడా ఆ ఒప్పందంలో లేకపోవడం గమనార్హం.
నౌకలను ముంచేయడం సరదానట..: ట్రంప్
ఇరాన్ నౌకలను స్వాధీనం చేసుకోవడం కంటే.. ముంచేయడం సరదాగా ఉంటుందని తమ సైనికాధికారులు చెప్పారని ట్రంప్ వాఖ్యానించారు. ఇరాన్ నేవీకి చెందిన సుమారు 46 నౌకలను అమెరికా ధ్వంసం చేసి ముంచేసిన సంగతి తెలిసిందే. ఈ అంశంపై ట్రంప్ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ఇరాన్ నౌకలను ఎందుకు సముద్రంలో ముంచేయాల్సి వచ్చింది. మనం వాటిని స్వాధీనం చేసుకుని, వాడుకోవచ్చు కదా అని సైనిక అధికారులను అడిగాను. ఆ నౌకలను ముంచేయడం సరదాగా ఉందని, వాటిని ముంచేయడమే మంచిదని సైనికాధికారులు బదులిచ్చారు. 46 నౌకలు సముద్రం అడుగుకు చేరాయి’’ అని ట్రంప్ పేర్కొన్నారు. అయితే ఆ నౌకలను స్వాధీనం చేసుకోకపోవడం మాత్రం కాస్త అసంతృప్తిని మిగిల్చిందని చెప్పారు. కొందరిని తొలగించడానికి ఇరాన్ మీద చిన్న సైనిక చర్య మాత్రమే చేపట్టామని, పలు కోణాల్లో ఇప్పటికే విజయం సాధించామని పేర్కొన్నారు. అయితే ఇంకా పూర్తి విజయం సాధించాల్సి ఉందని వ్యాఖ్యానించారు. కాగా, ఇరాన్‌లోని మినాబ్ పాఠశాలపై అమెరికా తొమహాక్ క్షిపణితో దాడి చేసిందని తేలిపోయిందన్న వార్తలను ట్రంప్ తప్పుపట్టారు. ‘‘ఆ క్షిపణులను మేం విదేశాలకు విక్రయించాం. ఆ దేశాలు వినియోగిస్తున్నాయి కూడా. ఇరాన్ వద్ద కూడా కొన్ని తొమహాక్ క్షిపణులు ఉండే అవకాశముంది. అది ఇరాన్ ప్రయోగించినా, మరెవరు ప్రయోగించినా సరే. తొమహాక్ చాలా సాధారణంగా ఉపయోగించే ఆయుధం’’ అని పేర్కొన్నారు.
