Share News

వాషింగ్టన్‌లో డర్టీ బాంబు దాడికి ఇరాన్ కుట్ర.. అమెరికా నిఘా వర్గాల అనుమానం..

ABN , Publish Date - Nov 17 , 2026 | 09:39 AM

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వంలోని కీలక అధికారులను లక్ష్యంగా చేసుకుని వాషింగ్టన్‌లో డర్టీ బాంబు లేదా రసాయన ఆయుధాలతో దాడి చేసేందుకు ఇరాన్ ప్లాన్ చేస్తోందనే వార్త అంతర్జాతీయంగా సంచలనం సృష్టిస్తోంది.

వాషింగ్టన్‌లో డర్టీ బాంబు దాడికి ఇరాన్ కుట్ర.. అమెరికా నిఘా వర్గాల అనుమానం..
Washington DC Attack

ఇంటర్నెట్ డెస్క్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వంలోని కీలక అధికారులను లక్ష్యంగా చేసుకుని వాషింగ్టన్‌లో డర్టీ బాంబు లేదా రసాయన ఆయుధాలతో దాడి చేసేందుకు ఇరాన్ ప్లాన్ చేస్తోందనే వార్త అంతర్జాతీయంగా సంచలనం సృష్టిస్తోంది. ఈ మేరకు అమెరికా నిఘా వర్గాలకు సమాచారం అందినట్టు అంతర్జాతీయ మీడియా సంస్థ సీఎన్ఎన్ ఓ సంచలన కథనం ప్రచురించింది. అయితే అమెరికాపై తక్షణ దాడి ముప్పు ఉందని నిర్ధారించే విశ్వసనీయ సమాచారం ప్రస్తుతం లేదని వైట్‌హౌస్ స్పష్టం చేసింది (Iran Dirty Bomb Plot).


ఏడుగురు అమెరికా అధికారులను ఉటంకిస్తూ సీఎన్ఎన్ ఈ కథనాన్ని ప్రచురించింది. సీఎన్‌ఎన్ కథనం ప్రకారం.. ఇరాన్ రూపొందిస్తున్న ప్రణాళికలో వాషింగ్టన్‌లోని నిర్దిష్ట ప్రాంతాలు, కీలక అధికారుల ప్రస్తావన ఉన్నట్లు ఇద్దరు అధికారులు తెలిపారు. ఈ సమాచారంతో గత వారం రోజులుగా అమెరికా ఉన్నతాధికారులు పలుమార్లు సమావేశమై భద్రతా చర్యలు, ప్రత్యామ్నాయ ప్రణాళికలపై చర్చించినట్లు కథనం పేర్కొంది. ఇరాన్ నుంచి వచ్చినట్లు భావిస్తున్న ముప్పుల నేపథ్యంలో అమెరికా ట్రెజరీ మంత్రి స్కాట్ బెసెంట్‌ను ముందుజాగ్రత్త చర్యగా సైనిక నివాస సముదాయానికి తరలించినట్టు వెల్లడించింది (US Intelligence Report).


ఈ ఆరోపణలపై వైట్‌హౌస్ ప్రతినిధి లారెన్ బిస్ స్పందించారు. అమెరికా ప్రభుత్వం అన్ని రకాల ముప్పులను నిశితంగా పరిశీలిస్తోందని, అయితే ప్రస్తుతం దేశ భూభాగానికి సంబంధించి తక్షణ ముప్పులేవీ లేవని స్పష్టం చేశారు. కాగా, ఈ కథనాన్ని ఇరాన్ ఖండించింది. ఎలాంటి పరిస్థితుల్లోనూ రసాయన ఆయుధాల వినియోగాన్ని తమ దేశం సమర్థించదని ఇరాన్ ఐక్యరాజ్యసమితి దౌత్య మిషన్ తెలిపింది. తమపై వస్తున్న ఆరోపణలు నిరాధారమైనవని, కల్పితమైనవని పేర్కొంది (Chemical Weapons Threat).


కాగా, గత కొద్ది రోజులుగా డర్టీ బాంబు బాగా చర్చనీయాంశమైంది (US Iran War). ఇందులో సాధారణ పేలుడు పదార్థాలతో పాటు రేడియోధార్మిక పదార్థాలను ఉపయోగిస్తారు. దీని వల్ల సాధారణ అణుబాంబుల మాదిరిగా అణు విస్ఫోటనం జరగదు. అయితే పేలుడు ద్వారా రేడియోధార్మిక కాలుష్యం వ్యాపించి ప్రజల ఆరోగ్యానికి, పర్యావరణానికి ముప్పు కలుగుతుంది. భారీ అణు విధ్వంసం సృష్టించడం కంటే భయాందోళనలు, కాలుష్యం, ప్రజా జీవనానికి అంతరాయం కలిగించడం కోసమే డర్టీ బాంబును ప్రయోగిస్తారు.


ఇవి కూడా చదవండి..

హోర్ముజ్ జలసంధిలో మరో నౌకపై దాడి.. ఒమన్ తీరానికి సమీపంలో ట్యాంకర్‌కు మంటలు..


స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. ఈ రోజు మీ నగరంలో ఎలా ఉన్నాయంటే..

Updated Date - Nov 17 , 2026 | 09:39 AM