అమెరికా మధ్యంతర ఎన్నికలు.. సత్తా చాటిన భారతీయులు..
ABN , Publish Date - Nov 04 , 2026 | 06:23 PM
అమెరికా మధ్యంతర ఎన్నికల్లో భారత సంతతి అభ్యర్థులు సత్తా చాటారు. ముఖ్యంగా డెమోక్రాట్ పార్టీ తరఫున పోటీ చేసిన భారతీయ అమెరికన్లు పలు కీలక స్థానాల్లో విజయం సాధించారు.
ఇంటర్నెట్ డెస్క్: అమెరికా మధ్యంతర ఎన్నికల్లో భారత సంతతి అభ్యర్థులు సత్తా చాటారు. ముఖ్యంగా డెమోక్రాట్ పార్టీ తరఫున పోటీ చేసిన భారతీయ అమెరికన్లు పలు కీలక స్థానాల్లో విజయం సాధించారు. ఇప్పటికే కాంగ్రెస్‌లో కొనసాగుతున్న నలుగురు భారత సంతతి నాయకులు మరోసారి ఎన్నికవగా, పియా దండియా తొలిసారి అమెరికా ప్రతినిధుల సభలో అడుగుపెట్టనున్నారు. మరోవైపు రిపబ్లికన్ పార్టీ తరఫున పోటీ చేసిన వివేక్ రామస్వామికి ఓటమి ఎదురైంది (Indian Americans US Elections 2026).
అమెరికా ప్రతినిధుల సభకు జరిగిన ఎన్నికల్లో భారత సంతతికి చెందిన అమీ బేరా, రో ఖన్నా, సుహాస్ సుబ్రహ్మణ్యం, ప్రమీలా జయపాల్ మరోసారి విజయం సాధించారు. కాలిఫోర్నియాలోని మూడో కాంగ్రెస్ నియోజకవర్గం నుంచి అమీ బేరా ఎనిమిదోసారి ఎన్నికయ్యారు. కాలిఫోర్నియాలోని 17వ నియోజకవర్గం నుంచి రో ఖన్నా గెలుపొందారు. వర్జీనియాలోని పదో నియోజకవర్గం నుంచి సుహాస్ సుబ్రహ్మణ్యం మరోసారి విజయం సాధించారు. వాషింగ్టన్ ఏడో నియోజకవర్గం నుంచి ప్రమీలా జయపాల్ ఆరోసారి గెలిచారు (Indians in US Midterm Results).
ఫ్లోరిడాలోని 22వ కాంగ్రెస్ నియోజకవర్గం నుంచి డెమోక్రాట్ అభ్యర్థి పియా దండియా (Pia Dandiya victory) విజయం సాధించారు. రిపబ్లికన్ అభ్యర్థి కేసీ అస్కర్‌ను ఓడించి ఆమె తొలిసారి అమెరికా కాంగ్రెస్‌లోకి ప్రవేశించనున్నారు. గతంలో ఉపాధ్యాయురాలిగా, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలిగా పనిచేసిన పియా దండియా పామ్ బీచ్ కౌంటీలోనే జన్మించి పెరిగారు. ఆమెకు 51.9 శాతం ఓట్లు లభించాయి. మేరీల్యాండ్ రాష్ట్ర లెఫ్టినెంట్ గవర్నర్‌గా పనిచేస్తున్న భారత సంతతికి చెందిన అరుణా మిల్లర్ మరోసారి విజయం సాధించారు. డెమోక్రాట్ పార్టీకి చెందిన ఆమె గవర్నర్ వెస్ మూర్‌తో కలిసి పోటీ చేసి తిరిగి పదవిని నిలబెట్టుకున్నారు.
కాగా, భారత సంతతికి చెందిన రిపబ్లికన్ నాయకుడు వివేక్ రామస్వామికి ఒహాయో గవర్నర్ ఎన్నికల్లో ఓటమి ఎదురైంది (US Midterm Results). అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మద్దతు ఉన్నప్పటికీ ఆయన డెమోక్రాట్ అభ్యర్థి అమీ ఆక్టన్ చేతిలో ఓడిపోయారు. అలాగే నార్త్ కరోలినా రాష్ట్రంలోని నాలుగో కాంగ్రెస్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన రిపబ్లికన్ అభ్యర్థి మహేశ్ గనోర్కర్ కూడా ఓటమి పాలయ్యారు.
ఇవి కూడా చదవండి..
అమెరికా మిడ్‌టర్మ్ ఫలితాలపై కమలా హారిస్ స్పందన.. 'హల్లెలూయ' వీడియో వైరల్..
అమెరికా కాంగ్రెస్‌పై డెమోక్రాట్ల పట్టు.. భారత్ పరిస్థితేంటి..