ఇరాన్‌లోని నటాంజ్ అణుశుద్ధి కేంద్రంపై దాడిని ధ్రువీకరించిన ఐఏఈఏ
ABN , Publish Date - Mar 03 , 2026 | 05:23 PM
ఇరాన్‌లోని నటాంజ్ అణు శుద్ధి కేంద్రంపై దాడి జరిగినట్టు ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ ధ్రువీకరించింది. దాడుల తర్వాత సేకరించిన హై రిజల్యూషన్ ఉపగ్రహ చిత్రాలను విశ్లేషించినట్టు తెలిపింది.
టెహ్రాన్: ఇరాన్‌లోని సైనిక స్థావరాలు, చమురు క్షేత్రాలు, అణుశుద్ధి కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ దాడులు కొనసాగిస్తోంది. ఈ దాడుల్లో ఇరాన్‌లోని నటాంజ్ అణు శుద్ధి కేంద్రంపై దాడి జరిగినట్టు ఇరాన్ ఇప్పటికే ప్రకటించింది. తాజాగా ఈ దాడిని ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ (IAEA) ధ్రువీకరించింది. దాడుల తర్వాత సేకరించిన హై రిజల్యూషన్ ఉపగ్రహ చిత్రాలను విశ్లేషించామని, నటాంజ్ న్యూక్లియర్ సైట్ వద్ద స్ట్రక్చరల్ డ్యామేజ్ జరిగిందని తెలిపింది. ఫెసిలిటీ ప్రవేశద్వారం వద్ద ఉన్న భవంతులకు నష్టం జరిగినట్టు కనిపిస్తోందని పేర్కొంది. అయితే రేడియేషన్ లీక్ అయిన సంకేతాలు ఏమీ లేవని వెల్లడించింది.
ఇజ్రాయెల్ గత ఏడాది ఇరాన్‌పై 12 రోజుల పాటు దాడి జరిపింది. ఆ దాడిలో నటాంజ్ అణుశుద్ధి కేంద్రానికి భారీ నష్టం వాటిల్లింది. ఆ సమయంలో అమెరికా సైతం నటాంజ్, మరో రెండు అణు కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని దాడులు జరిపింది. తాజాగా మరోసారి నటాంజ్ న్యూక్లియర్ సైట్‌పై అమెరికా-ఇజ్రాయెల్ దాడి చేసినట్టు ఐఏఈఏలో ఇరాన్ రాయబారి ఆదివారంనాడు వెల్లడించారు. అయితే దీనిని ఐక్యరాజ్యసమితి అణు నిఘా సంస్థ డైరెక్టర్ జనరల్ రాఫెల్ గ్రాస్సీ తోసిపుచ్చారు. దాడి జరిగిందనడానికి ఎలాంటి సాక్ష్యం లేదన్నారు. వాస్తవ సమాచారం కోస ఇరాన్ న్యూక్లియర్ రెగ్యులేరటీ అథారిటీని సంప్రదిస్తున్నట్టు చెప్పారు.
కాగా, ఇజ్రాయెల్ దాడులు మొదలుపెట్టినప్పటికీ ఇంతవరకూ 787 మంది పౌరులు మరణించినట్టు ఇరాన్ అధికారులు తెలిపారు. వీరిలో ఇరాన్ సుప్రీం నేత అయతుల్లా అలీ ఖమేనీ, ఆయన కుటుంబానికి చెందిన మరో నలుగురు, పలువురు సైనిక ఉన్నతాధికారులు ఉన్నారు. ఇజ్రాయెల్ దాడిని దురాక్రణ చర్యగా అభివర్ణించిన ఇరాన్.. వెనక్కి తగ్గేదిలేదని, ప్రతీకారం తీర్పుకుంటామని ప్రకటించింది.
ఇవి కూడా చదవండి..
ఇరాన్‌పై అమెరికా దాడులను ఖండించిన చైనా
ఇరాన్‌పై యుద్ధాన్ని బలవంతంగా రుద్దారు.. పాక్ రక్షణ శాఖ మంత్రి ఆగ్రహం