Share News

ఇరాన్‌పై అమెరికా దాడులను ఖండించిన చైనా

ABN , Publish Date - Mar 03 , 2026 | 04:00 PM

ఇరాన్‌పై అమెరికా నేతృత్వంలో జరుగుతున్న దాడులను చైనా ఖండించింది. కాల్పులను తక్షణం కట్టిపెట్టి చర్చలకు దిగాలని సూచించింది.

ఇరాన్‌పై అమెరికా దాడులను ఖండించిన చైనా
China condemns US Iran strikes

ఇంటర్నెట్ డెస్క్: ఇరాన్‌పై అమెరికా దాడులను చైనా ఖండించింది. తక్షణం కాల్పుల విరమణ ప్రకటించాలని సూచించింది. లేని పక్షంలో ఈ ఘర్షణలు ఇతర దేశాలకు విస్తరించే ప్రమాదం ఉందని హెచ్చరించింది. గల్ఫ్ ప్రాంతంలోని అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ దాడులు చేస్తున్న నేపథ్యంలో చైనా విదేశాంగ శాఖ ఈ ప్రకటనను విడుదల చేసింది. అన్ని సైనిక చర్యలకూ ముగింపు చెప్పడం తక్షణ అవసరమని వ్యాఖ్యానించింది. చర్చల ద్వారా వివాదాలను పరిష్కరించుకోవాలని చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి సూచించారు.

అమెరికా నేతృత్వంలో జరుగుతున్న దాడులు అంతర్జాతీయ చట్టాలకు వ్యతిరేకమని కూడా చైనా కామెంట్ చేసింది. ఈ దాడులకు ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి అనుమతి లేదని పేర్కొంది. ఉద్రిక్తతలు అంతకంతకూ పెరుగుతున్న నేపథ్యంలో భద్రతా మండలి అత్యవసర ప్రాతిపదికన సమావేశం కావాలని చైనా సూచించింది. గల్ఫ్ దేశాల సార్వభౌమత్వం, భద్రత, ప్రాదేశిక సమగ్రతను గౌరవించాలని స్పష్టం చేసింది. రష్యా విదేశాంగ శాఖ మంత్రి సెర్గీ లావ్రోవ్‌తో చైనా విదేశాంగ శాఖ మంత్రి వాంగ్ ఈ విషయమైన ఫోన్‌లో మాట్లాడారు. శాంతి నెలకొల్పే దిశగా ప్రయత్నాలు జరగాలని చెప్పారు.


త్వరలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనాలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో ఇరు దేశాలు నిరంతరం టచ్‌లో ఉన్నాయని కూడా విదేశాంగ శాఖ ప్రతినిధి తెలిపారు.

ఇక ఇరాన్‌లో చిక్కుకున్న చైనీయులను స్వదేశానికి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని కూడా చైనా ప్రభుత్వం తెలిపింది. ఇప్పటికే 3 వేల మంది చైనీయులను స్వదేశానికి తీసుకొచ్చామని పేర్కొంది.


ఇవి కూడా చదవండి

ఇది ముగింపు లేని యుద్ధం కాదు: యూఎస్ మంత్రి పీటర్ హెగ్సెత్

పొరపాటున అమెరికా ఫైటర్ జెట్స్‌ను కూల్చిన కువైత్: పెంటగాన్


Updated Date - Mar 03 , 2026 | 04:24 PM