ఇరాన్ - ఇజ్రాయెల్ యుద్ధం.. స్పందించిన ఫ్రాన్స్
ABN , Publish Date - Mar 03 , 2026 | 04:13 PM
ఇరాన్ - ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో ఫ్రాన్స్ స్పందించింది. అవసరమైతే భాగస్వామ్య దేశాలను రక్షించేందుకు సిద్ధమని ఫ్రాన్స్ విదేశాంగ మంత్రి జీన్ నియోల్ బ్యారెట్ స్పష్టం చేశారు.
న్యూఢిల్లీ, మార్చి 03: ఇరాన్ - ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో ఫ్రాన్స్ స్పందించింది. అవసరమైతే భాగస్వామ్య దేశాలను రక్షించేందుకు సిద్ధమని ఫ్రాన్స్ విదేశాంగ మంత్రి జీన్ నియోల్ బ్యారెట్ స్పష్టం చేశారు. ఈ ఇరు దేశాల యుద్ధంపై చైనా విదేశాంగ మంత్రి వాంగ్ వైతో బ్యారెట్ ఫోన్‌లో మాట్లాడారు. ఈ యుద్ధ ప్రభావాన్ని తగ్గించేందుకు కృషి చేయాలని చైనా విదేశాంగ మంత్రికి ఆయన పిలుపునిచ్చారు.
ఇక ఈ యుద్ధం మరిన్ని దేశాలను ప్రభావితం చేస్తోందని బ్యారెట్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ యుద్ధ ప్రభావిత దేశాల్లో సుమారు 4 లక్షల మంది ఫ్రెంచ్ పౌరులు ఉన్నారని గణాంకాలతో సహా వివరించారు. యుద్ధ ప్రభావిత దేశాల్లో ఉన్న వారిని తరలించేందుకు వాణిజ్య, సైనిక విమానాలు సిద్ధంగా ఉన్నాయని ఈ సందర్భంగా ఫ్రాన్స్ విదేశాంగ మంత్రి జీన్ నియోల్ బ్యారెట్ వెల్లడించారు.
అలాగే ఇరాన్ ప్రజల ఆకాంక్షలను పరిగణనలోకి తీసుకోవాలని వారు నిర్ణయించారు. వారి భద్రతకు హామీ ఇచ్చే రాజకీయ పరిష్కారానికి కట్టుబడి ఉన్నట్లు ఈ సందర్భంగా ఇరు దేశాల విదేశాంగ మంత్రులు వెల్లడించారు. ఈ మేరకు బ్యారెట్ కార్యాలయం మంగళవారం ఒక ప్రకటనలో వివరించింది. ఇజ్రాయెల్, అమెరికా చేస్తున్న దాడుల్లో ఫ్రాన్స్ ప్రమేయం లేదని స్పష్టం చేశారు. దేశాల మధ్య నెలకున్న వివాదాలను పరిష్కరించడానికి అంతర్జాతీయ సంస్థలకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు.