Share News

వైట్‌హౌస్‌పై డ్రోన్ దాడికి కుట్ర.. భగ్నం చేసిన ఎఫ్‌బీఐ..

ABN , Publish Date - Jun 17 , 2026 | 11:38 AM

అమెరికా అధ్యక్ష భవనంపై భారీ ఉగ్రదాడి చేసేందుకు పన్నిన కుట్రను ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (FBI) భగ్నం చేసింది. ఈ కేసులో ఇప్పటివరకు ఐదుగురిని అరెస్ట్ చేసింది.

వైట్‌హౌస్‌పై డ్రోన్ దాడికి కుట్ర.. భగ్నం చేసిన ఎఫ్‌బీఐ..
FBI drone attack plot

ఇంటర్నెట్ డెస్క్: అమెరికా అధ్యక్ష భవనంపై భారీ ఉగ్రదాడి చేసేందుకు పన్నిన కుట్రను ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (FBI) భగ్నం చేసింది. డొనాల్డ్ ట్రంప్ 80వ పుట్టిన రోజు సందర్భంగా వైట్‌హౌస్‌లో నిర్వహించిన యూఎఫ్‌సీ ఈవెంట్‌ను లక్ష్యంగా చేసుకుని డ్రోన్లు, స్నైపర్లతో దాడి చేయాలని కొందరు వ్యక్తులు పన్నిన కుట్రను అధికారులు ముందుగానే గుర్తించి అడ్డుకున్నారు. ఈ కేసులో ఇప్పటివరకు ఐదుగురిని అరెస్ట్ చేసినట్లు ఎఫ్‌‌బీఐ వెల్లడించింది (FBI drone attack plot).


నిందితులు ఐదుగురిలో ఒకరైన 19 ఏళ్ల టైసెన్ ప్రాపర్ తల్లి ఇచ్చిన సమాచారంతోనే ఎఫ్‌బీఐ ఈ కుట్రను భగ్నం చేసింది. గూఢచర్యం, భారీగా ఆయుధాలు కొనుగోలు చేయడం, హిట్ అండ్ రన్ మిషిన్ల గురించి కొందరితో అతడు మాట్లాడుతుండడాన్ని ఆమె గమనించి అనుమానించింది. వెంటనే ఆమె స్థానిక పోలీసులకు సమాచారం అందించింది. దీంతో ఎఫ్‌బీఐ అప్రమత్తమై నిందితులను అదుపులోకి తీసుకుంది (White House UFC event).


ఎఫ్‌బీఐ అధికారులు చెప్పిన వివరాల ప్రకారం.. నిందితులు పేలుడు పదార్థాలు అమర్చిన డ్రోన్లతో వైట్‌హౌస్ సమీపంలోని భవనాలపై దాడి చేసి, ప్రజల్లో భయాందోళనలు సృష్టించాలనుకున్నారు. అనంతరం బయటకు పరుగులు తీసే ప్రజలపై స్నైపర్లతో కాల్పులు జరపాలనుకున్నారు. కొందరు నిందితులు ఎన్‌క్రిప్టెడ్ మెసేజింగ్ యాప్‌ల ద్వారా ప్రణాళికలు రూపొందించినట్లు దర్యాప్తులో తేలింది (Donald Trump security).


ఎఫ్‌బీఐ డైరెక్టర్ కాశ్ పటేల్ దీనిని ఒక పెద్ద ఉగ్రదాడి కుట్రగా అభివర్ణించారు (White House news). సరైన సమయంలో చర్యలు తీసుకోకపోయి ఉంటే భారీ ప్రాణనష్టం సంభవించేదని పేర్కొన్నారు. ఈ బృందంలోని వ్యక్తులకు ఒకరితో ఒకరికి సంబంధం లేదని ఎఫ్‌బీఐ అధికారులు తెలిపారు. వీరంతా ప్రభుత్వ వ్యతిరేకులని, లైంగిక నేరస్థుడు జెఫ్రీ ఎప్‌స్టీన్‌కు సంబంధించిన ఫైళ్లపై ట్రంప్ యంత్రాంగం తీరుతో నిరాశ చెందిన వారని, యూదు వ్యతిరేకులని పేర్కొన్నారు. ప్రస్తుతం అరెస్టు చేసిన వారిపై అధికారులు పలు కేసులు నమోదు చేసి విచారణ కొనసాగిస్తున్నారు.


ఇవి కూడా చదవండి..

మస్క్ సంపద ఎంతంటే.. గంటకు రూ. 9.5 కోట్ల చొప్పున 114 ఏళ్లు ఖర్చుపెట్టినా తరగదు..


సూచీలకు కొనుగోళ్ల అండ.. వరుసగా మూడో రోజూ లాభాల్లోనే..

Updated Date - Jun 18 , 2026 | 03:44 PM