భారత్ బాధ్యతాయుతంగా వ్యవహరించింది: అమెరికా ఆర్థిక మంత్రి
ABN , Publish Date - Mar 07 , 2026 | 02:47 PM
ఇరాన్ - ఇజ్రాయెల్, అమెరికా మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో భారత్ చక్కగా వ్యవహరిస్తోందంటూ అమెరికా కితాబిచ్చింది. రష్యా నుంచి చమురు కొనుగోలు చేసేందుకు ఇటీవల ఆమోదం తెలిపిన అమెరికా ట్రెజరీ సెక్రటరీ.. భారత్ బాధ్యతాయుతంగా నడుచుకుంటోందంటూ కితాబిచ్చారు.
ఇంటర్నెట్ డెస్క్: పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితుల కారణంగా భారత్ సహా పలు దేశాలకు చమురు సమస్యాత్మకంగా మారింది. ఈ నేపథ్యంలో భారత్ బాధ్యతాయుతంగా వ్యవహరించిందంటూ అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెసెంట్ అన్నారు. పశ్చిమాసియాలో యుద్ధం కొనసాగుతున్న తరుణంలో ఇప్పటికే సముద్ర మార్గాల్లో ప్రయాణిస్తున్న రష్యా చమురును కొనుగోలు చేసేందుకు భారత్‌కు అనుమతులిస్తున్నట్టు అమెరికా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ విషయమై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతుండగా.. స్కాట్ ఈ విధంగా స్పందించారు.
'ప్రపంచ దేశాలకు చమురు సరఫరా బాగానే కొనసాగుతోంది. ఇప్పటికే సముద్ర మార్గంలో ఉన్న రష్యా చమురును కొనుగోలు చేసేందుకు మిత్ర దేశమైన భారత్‌కు అమెరికా ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చింది' అని స్కాట్ బెసెంట్ వ్యాఖ్యానించారు. ఈ విషయంలో 'భారత్ చాలా బాధ్యతగా వ్యవహరించింది. ముందుగా ఆంక్షలున్న రష్యా నుంచి చమురు కొనుగోలు ఆపాలని మేము కోరాం.. భారత్ ఆపివేసింది. ఆ తర్వాత అమెరికా నుంచి చమురు కొనాలని భారత్ నిర్ణయించింది. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో చమురు సరఫరాలో తాత్కాలికంగా లోటు ఏర్పడింది. దాన్ని భర్తీ చేసేందుకు రష్యా చమురును కొనేందుకు మేము భారత్‌కు అనుమతి ఇచ్చాం. త్వరలోనే రష్యా చమురుపై ఉన్న మరికొన్ని ఆంక్షలను కూడా తొలగించవచ్చు' అని ఆయన చెప్పారు. మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతల నేపథ్యంలో మార్కెట్‌కు ఉపశమనం కలిగించేలా చర్యలు కొనసాగిస్తున్నామని స్కాట్ తెలిపారు.
గతంలో రష్యా చమురు కొనుగోలు, ఇతర వాణిజ్య కారణాలు చూపుతూ భారత్‌పై అమెరికా 50 శాతం సుంకం విధించింది. అయితే.. దేశంలోని 140 కోట్ల మంది ప్రజల ఇంధన అవసరాలు, భద్రతే తమ తొలి ప్రాధాన్యమని భారత్ బదులిచ్చింది. ఈ రష్యన్ చమురును భారత చమురు శుద్ధి కర్మాగారాలు పలు దేశాలకు ఎగుమతి చేస్తున్నాయి. కొన్నిరోజుల తర్వాత భారత్, అమెరికా వాణిజ్య ఒప్పందం కుదుర్చుకున్నాయి. రష్యా చమురు కొనుగోళ్లు నిలిపివేస్తామని భారత్ హామీ ఇచ్చిందని, ఒప్పందం కుదుర్చుకుంటున్నామని, సుంకాన్ని కూడా 18 శాతానికి తగ్గించామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన విషయం తెలిసిందే.
అయితే.. ఇరాన్‌పై ఇజ్రాయెల్, అమెరికాల ఉద్రిక్తతల నేపథ్యంలో చమురు సరఫరాకు ఆటంకాలు లేకుండా చేయడం, మార్కెట్లో ఒత్తిడి తగ్గించడమే లక్ష్యంగా భారత్‌కు అనుమతి ఇచ్చామని అమెరికా అధికారులు చెప్పారు. హోర్ముజ్ జలసంధి వద్ద నెలకొన్న పరిస్థితుల వల్ల ఇటీవల చమురు ధరలు పెరుగుతున్నాయి.
ఇవీ చదవండి:
బెంగాల్‌లో ఓటర్ల తొలగింపును నిరసిస్తూ సీఎం మమత ధర్నా
టీవీ న్యూస్ ఛానళ్ల టీఆర్పీ రిపోర్టింగ్‌పై కేంద్రం నిషేధం