అమెరికా మధ్యంతర ఎన్నికల్లో సరికొత్త చరిత్ర.. యూఎస్ కాంగ్రెస్‌కు 102 మంది డెమోక్రటిక్ మహిళలు
ABN , Publish Date - Nov 06 , 2026 | 03:40 PM
తాజాగా జరిగిన అమెరికా మధ్యంతర ఎన్నికల్లో మహిళా ప్రాతినిధ్యం విషయంలో సరికొత్త చరిత్ర లిఖితమైంది. ఈ ఎన్నికల్లో డెమోక్రటిక్ మహిళలు సత్తా చాటారు.
ఇంటర్నెట్ డెస్క్: తాజాగా జరిగిన అమెరికా మధ్యంతర ఎన్నికల్లో మహిళా ప్రాతినిధ్యం విషయంలో సరికొత్త చరిత్ర లిఖితమైంది. మొట్టమొదటిసారి వందమందికిపైగా డెమోక్రటిక్ మహిళలు ఆ దేశ కాంగ్రెస్‌కు ఎన్నికై చరిత్ర సృష్టించారు. ఇదే సమయంలో రిపబ్లికన్ మహిళా ప్రాతినిధ్యం మాత్రం తగ్గుముఖం పట్టింది. వాషింగ్ టన్ పోస్ట్ ప్రకారం ఇప్పటికే 102 మంది డెమోక్రటిక్ మహిళలు మిడ్‌టర్మ్ ఎన్నికల్లో విజయం సాధించారు. మరోవైపు రిపబ్లికన్ మహిళలు కేవలం 16 స్థానాలకే పరిమితం అయ్యారు. ఇంకా కొన్ని స్థానాల్లో ఫలితాలు తేలలేదు. అవి కూడా కలిపితే ఈ సంఖ్య 20కు చేరే అవకాశముంది. అలాగే ఎన్నికైన డెమోక్రటిక్ మహిళల సంఖ్య కూడా పెరగొచ్చు.
అమెరికా ప్రతినిధుల సభ (హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్)లో మహిళల ప్రాతినిధ్యం 30 శాతం మేర ఉంటుందని ఓ అంచనా. ఆ దేశ చరిత్రలోనే ఇంత మంది స్త్రీలు కాంగ్రెస్‌కు ఎన్నికవడం ఇదే తొలిసారి. ప్రాతినిధ్యం పెరిగినా.. అమెరికాలో మహిళల జనాభాతో పోలిస్తే ఈ సంఖ్య తక్కువే. ఆ దేశ మొత్తం జనాభాలో 51 శాతం మహిళలున్నారు. కానీ హౌస్‌లో వీరి ప్రాతినిధ్యం 30 శాతమే ఉంది.
కాగా 2026 మధ్యంతర ఎన్నికల్లో మహిళలు సత్తా చాటారు. 15 మంది స్త్రీలు గవర్నర్‌గా ఎన్నికై చరిత్ర సృష్టించారు. జార్జియా రాష్ట్రానికి తొలి నల్లజాతి మహిళా గవర్నర్‌గా కీషా లాన్స్ బాటమ్స్ ఎన్నికవడం మరో విశేషం. ఈ విజయాలు అమెరికాలో మహిళా ప్రాతినిధ్యం క్రమంగా పెరుగుతోందనడానికి ఉదాహరణలని అక్కడి రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
ఈ వార్తలూ చదవండి
ఇరాన్‌ను పూర్తిగా తుడిచిపెట్టేస్తా.. ట్రంప్ హెచ్చరిక
బ్యాంకులో కుంభకోణం.. దేశాధ్యక్షుడి అభిశంసనకు రంగం సిద్ధం