Share News

బ్యాంకులో కుంభకోణం.. దేశాధ్యక్షుడి అభిశంసనకు రంగం సిద్ధం

ABN , Publish Date - Nov 06 , 2026 | 01:40 PM

దక్షిణ అమెరికా దేశమైన పరాగ్వేలోని ప్రముఖ బ్యాంకులో బయటపడ్డ అవకతవకలు చివరకు దేశాధ్యక్షుడు శాంటియాగో పెన్యా పదవికే ఎసరు తెచ్చాయి.

బ్యాంకులో కుంభకోణం.. దేశాధ్యక్షుడి అభిశంసనకు రంగం సిద్ధం
Paraguay ueno banking crisis

ఇంటర్నెట్ డెస్క్: దక్షిణ అమెరికా దేశమైన పరాగ్వేలోని ప్రముఖ బ్యాంకులో బయటపడ్డ అవకతవకలు చివరకు దేశాధ్యక్షుడు శాంటియాగో పెన్యా పదవికే ఎసరు తెచ్చాయి. పెన్యా రాజీనామాను పెండింగ్‌లో పెట్టిన అక్కడి చట్టసభలు ఆయన అభిశంసనకు ప్రస్తుతం రంగం సిద్ధం చేస్తున్నాయి. పరాగ్వే బ్యాంకింగ్ రంగం సంక్షోభంలో పడిపోవడంతో దేశ ఆర్థిక వ్యవస్థపైనే నీలినీడలు కమ్ముకున్నాయి.


అసలేం జరిగిందంటే..

ప్రస్తుత సంక్షోభానికి కేంద్ర బిందువుగా మారిన ఊవెనో బ్యాంకు మొదట్లో ఓ చిన్న ఆర్థిక సంస్థగా ప్రారంభమైంది. 2023లో లైసెన్సులు రావడంతో పూర్తిస్థాయి బ్యాంకుగా మారింది. రకరకాల క్యాష్ బ్యాక్ ఆఫర్లతో కస్టమర్లను పెద్ద సంఖ్యలో చేర్చుకుంది. భారీగా డిపాజిట్లు సేకరించింది. ఊవెనోపై నమ్మకం పెరగడంతో దేశంలోని దాదాపు సగం జనాభా బ్యాంకుకు కస్టమర్లుగా మారారు. దేశ జనాభా 65 లక్షలు కాగా వారిలో దాదాపు 30 లక్షల మంది బ్యాంకులో తమ డబ్బు డిపాజిట్ చేశారు. 850 మిలియన్ డాలర్ల ప్రజాధనం బ్యాంకులోకి చేరింది. ప్రభుత్వ సంస్థలు, పెన్షన్ సంస్థలు కూడా బ్యాంకులోకి తమ నిధులను మళ్లించాయి. పరాగ్వే జాతీయ ఫుట్‌బాల్ టీమ్‌కు ఊవెనో స్పాన్సర్‌గా కూడా నిలిచింది.


సంక్షోభం మొదలైందిలా..

అంతా సవ్యంగా సాగుతున్న తరుణంలో షాకింగ్ ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఊవెనో షేర్ హోల్డర్ అయిన గ్రూపో వాజ్కేజ్‌కు బ్యాంకు భారీ స్థాయిలో లోన్లు ఇచ్చిందన్న విషయం ఇటీవల బయటపడటంతో కలకలం రేగింది. ఊవెనోపై పరాగ్వే కేంద్ర బ్యాంకు కూడా దృష్టిసారించింది. కస్టమర్ల డిపాజిట్లకు హామీగా నిల్వ ఉంచాల్సిన నిధులు ఊవెనో వద్ద లేవని గుర్తించింది. చివరకు బ్యాంకు కార్యకలాపాలను తన ఆధీనంలోకి తీసుకుంది.

ఇదిలా ఉంటే, అధ్యక్షుడు పెన్యాకు గ్రూపో వాజ్కెజ్‌తో ఉన్న వ్యాపార సంబంధాలు కూడా వెలుగులోకి వచ్చాయి. గతేడాది వరకూ వాజ్కెజ్ గ్రూపు‌లో పెన్యా షేర్ హోల్డర్‌గా ఉన్నట్టు బయటపడటంతో దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. ప్రతిపక్ష పార్టీ సభ్యులు పెన్యాపై ఆరోపణలు గుప్పించారు. బ్యాంకు నిధుల దుర్వినియోగం వెనుక ఆయన హస్తం ఉందని మండిపడ్డారు. వ్యవస్థాగత స్థాయిలో జరిగిన తప్పులను దాచిపెట్టేందుకు ప్రయత్నం జరిగిందని ఆరోపించారు.


పెన్యా మాత్రం ఈ ఆరోపణలను తోసిపుచ్చారు. కానీ, పెన్యా పాత్రపై కూడా దర్యాప్తు చేస్తున్నట్టు అధికారులు పేర్కొనడం పరిస్థితిని మరో మలుపు తిప్పింది. ఈ పరిణామాల నేపథ్యంలో గురువారం అధ్యక్షుడు రాజీనామాను సమర్పించారు. అయితే, చట్టసభలు మాత్రం ఆయన రాజీనామాను పెండింగ్‌లో పెట్టి అభిశంసన ప్రక్రియను ప్రారంభించాయి.

మరోవైపు, ఊవెనోలో సంక్షోభం దేశ బ్యాంకింగ్ రంగాన్ని చుట్టుకుంది. ఊవెనో యాప్‌, ఆన్‌లైన్ పోర్టళ్లు నిలిచిపోయాయి. బ్రాంచ్‌లు మూతపడ్డాయి. కస్టమర్లు తమ డిపాజిట్లు వెనక్కు తీసుకునేందుకు రంగంలోకి దిగడంతో పరిస్థితి తీవ్రరూపం దాల్చింది. ఊవెనో కస్టమర్ల అకౌంట్లను ఇతర బ్యాంకులకు బదిలీ చేసేందుకు కేంద్ర బ్యాంకు ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో సాంకేతిక సమస్యలు తలెత్తి దేశవ్యాప్తంగా బ్యాంకింగ్ సేవల్లో అంతరాయాలు మొదలయ్యాయి.


దక్షిణ అమెరికాలో అత్యంత పేద దేశాల్లో ఒకటైన పరాగ్వే ఇటీవల కాలంలో విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో తలెత్తిన బ్యాంకింగ్ సంక్షోభం యావత్ దేశ ఆర్థిక వ్యవస్థనే తలకిందులు చేసే అవకాశాలు ఉన్నాయన్న భయాలు వ్యక్తం అవుతున్నాయి. పరాగ్వే ప్రభుత్వం మాత్రం కంగారు పడవద్దని ప్రజలకు భరోసా ఇస్తోంది. ఊవెనో బ్యాంకు కస్టమర్లలో మొదట అత్యల్ప డిపాజిట్లు ఉన్న వారి డబ్బును తిరిగిచ్చే ప్రక్రియను ప్రారంభించింది.


ఈ వార్తలనూ చదవండి:

ఇరాన్‌ను పూర్తిగా తుడిచిపెట్టేస్తా.. ట్రంప్ హెచ్చరిక

ఇజ్రాయెల్ ప్రధాని రేసులో ఐసెన్‌కోట్.. అరబ్ పార్టీల మద్దతు

Updated Date - Nov 06 , 2026 | 02:36 PM