Share News

అగ్ని వలయం

ABN , Publish Date - Mar 07 , 2026 | 04:19 AM

పశ్చిమాసియా యుద్ధ వలయంలో చిక్కుకుంది. ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్‌ దాడులను మరింత ఉధృతం చేశాయి. పగలు, రాత్రి తేడా లేకుండా వందలాది ఫైటర్లతో బాంబులు....

అగ్ని వలయం

  • అమెరికా-ఇజ్రాయెల్‌, ఇరాన్‌ పరస్పర దాడులు తీవ్రతరం

  • టెహ్రాన్‌పై వందలాది ఫైటర్లతో దాడులు

  • ఇరాన్‌ డ్రోన్‌ వాహక యుద్ధ నౌక పేల్చివేత

  • లెబనాన్‌లోని హెజ్బొల్లా స్థావరాలపై ఇజ్రాయెల్‌ దాడులు.. 217 మంది మృతి

  • గల్ఫ్‌ దేశాలకు రక్షణగా బ్రిటన్‌ విమానాలు

  • అమెరికా స్థావరాలపై దాడి కోసం ఇరాన్‌కు రష్యా ‘నిఘా’ సాయం?

  • ఆ సమాచారంతోనే కచ్చితమైన దాడులు

  • ఇరాన్‌ బేషరతుగా లొంగిపోవాల్సిందే

  • తర్వాత మేం గొప్ప నేతను ఎంపిక చేస్తాం

  • ఇరాన్‌ భద్రతా బలగాలు ఆయుధాల్ని వదిలేయాలి.. లేదంటే చావు తప్పదు: ట్రంప్‌

  • చమురు ధరలు పెరిగితే పెరగనీ..తమకు యుద్ధమే ముఖ్యమని వ్యాఖ్య

  • అమెరికా, ఇజ్రాయెల్‌వైపు దృష్టి పెట్టండి

  • కాల్పుల విరమణకు ప్రయత్నిస్తున్న దేశాలకుఇరాన్‌ అధ్యక్షుడు పెజెష్కియాన్‌ సూచన

దుబాయ్‌/టెల్‌అవీవ్‌/వాషింగ్టన్‌, మార్చి 6: పశ్చిమాసియా యుద్ధ వలయంలో చిక్కుకుంది. ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్‌ దాడులను మరింత ఉధృతం చేశాయి. పగలు, రాత్రి తేడా లేకుండా వందలాది ఫైటర్లతో బాంబులు, క్షిపణులు ప్రయోగిస్తున్నాయి. హెజ్బొల్లా తీవ్రవాద సంస్థ ఇరాన్‌కు మద్దతుగా రావడంతో.. లెబనాన్‌లోని ఆ సంస్థ స్థావరాలపై విరుచుకుపడుతోంది. వేలాది మంది ప్రజలు ఇళ్లు వదిలి తరలిపోవాల్సి వస్తోంది. మరోవైపు ఇజ్రాయెల్‌పై, గల్ఫ్‌లోని కువైట్‌, ఖతార్‌, బహ్రెయిన్‌, యూఏఈ, సౌదీలో ఉన్న అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్‌ క్షిపణులు, డ్రోన్‌ దాడులు పెంచింది. అదే సమయంలో కీలక చమురు రిఫైనరీలు, విమానాశ్రయాలనూ లక్ష్యంగా చేసుకుంది. హోర్ముజ్‌ జలసంధిలో నౌకలపై ఇరాన్‌ రెవెల్యూషనరీ గార్డ్స్‌ కార్ప్స్‌ (ఐఆర్‌జీసీ) వరుసగా దాడులు చేస్తోంది. ఇరాన్‌కు మద్దతుగా హెజ్బొల్లా ఇజ్రాయెల్‌పై రాకెట్లు, డ్రోన్లతో దాడులు చేస్తోంది. ఇరాక్‌లో ఇరాన్‌ అనుకూల ‘ఇస్లామిక్‌ రిపబ్లిక్‌’ మిలీషియా గ్రూపు బాగ్దాద్‌ విమానాశ్రయం, అమెరికా సైనిక స్థావరంపై డ్రోన్లను ప్రయోగిస్తోంది. ఈ పరిణామాలతో పర్షియన్‌ గల్ఫ్‌, హోర్ముజ్‌ జలసంధికి చుట్టూ ఉన్న దేశాలన్నీ అగ్ని వలయంలో చిక్కుకున్నాయి.


వందలాది ఫైటర్లతో ఇరాన్‌పైకి..

ఇజ్రాయెల్‌ శుక్రవారం తెల్లవారుజామున ఇరాన్‌లోని టెహ్రాన్‌, ఇస్ఫహాన్‌, కెర్మన్‌షా, లెబనాన్‌లోని బీరూట్‌, స్రిఫా, ఐతా అల్‌ షాబ్‌, టోలిన్‌, మజ్డల్‌ సెలెమ్‌ పట్టణాలపై వందల విమానాలతో, క్షిపణులతో విరుచుకుపడింది. ఇరాన్‌కు చెందిన డ్రోన్‌ వాహక యుద్ధనౌక ఐఆర్‌ఐఎస్‌ షహీద్‌ బఘేరిను పేల్చేశామని అమెరికా సెంట్రల్‌ కమాండ్‌ వెల్లడించింది. శుక్రవారం తెల్లవారుజామున బీ-2 స్టెల్త్‌ బాంబర్లతో 900 కిలోలకుపైగా బరువుండే బంకర్‌ బస్టర్‌ బాంబులను వేసి ఇరాన్‌లోని పలు భూగర్భ బాలిస్టిక్‌ క్షిపణి లాంచర్లను ధ్వంసం చేశామని తెలిపింది. ఇరాన్‌కు చెందిన 80శాతం గగనతల రక్షణ వ్యవస్థలను, 60శాతం క్షిపణి లాంఛర్లను నాశనం చేశామని ఇజ్రాయెల్‌ ఆర్మీ చీఫ్‌ ఇయాల్‌ జమీర్‌ ప్రకటించారు. లెబనాన్‌లోని బీరూట్‌లో హెజ్బోల్లా కమాండర్‌ జైద్‌ అలీ జుమాను, హెజ్బొల్లా సభ్యులకు శిక్షణ ఇస్తున్న హమాస్‌ కమాండర్‌ను చంపేశామని వెల్లడించారు. శుక్రవారం ఒక్కరోజే పశ్చిమ ఇరాన్‌లోని 400 లక్ష్యాలపై దాడి చేశామని ఇజ్రాయెల్‌ ప్రకటించింది.

లెబనాన్‌ కకావికలం..

ఇజ్రాయెల్‌ దాడుల తీవ్రతతో ఆందోళన చెందిన సుమారు లక్ష మంది లెబనాన్‌ ప్రజలు ఇతర ప్రాంతాలకు తరలివెళ్లారు. కొందరు పక్కనే ఉన్న సిరియాలోకి వెళుతున్నట్టు ఆ దేశ అధికారవర్గాలు తెలిపాయి. ఇజ్రాయెల్‌ దాడులతో లెబనాన్‌లో మృతిచెందినవారి సంఖ్య 217కు చేరిందని, 798 మంది గాయపడ్డారని ఆ దేశ ఆరోగ్యశాఖ ప్రకటించింది. ఇజ్రాయెల్‌కు చెందిన హైఫా నేవీ బేస్‌, గోలన్‌హైట్స్‌లోని స్థావరాలపై దాడులు చేసినట్టు హెజ్బొల్లా సంస్థ వెల్లడించింది. ఇరాన్‌లో మృతుల సంఖ్య 1,332కు చేరినట్టు రెడ్‌ క్రిసెంట్‌ సంస్థ పేర్కొంది.

2.jpg


50 విమానాలతో ఖమేనీ బంకర్‌ పేల్చేశాం

ఇరాన్‌పై తొలి దాడిలోనే ఖమేనీ నివాసంతోపాటు దాని కింద ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన భూగర్భ బంకర్‌ను 50 యుద్ధ విమానాలతో పేల్చివేశామని ఇజ్రాయెల్‌ డిఫెన్స్‌ ఫోర్స్‌ శుక్రవారం వెల్లడించింది. ఈ మేరకు వరుసపెట్టి బాంబులు ఖమేనీ నివాసాన్ని తాకి పేలిపోయిన దృశ్యాలను విడుదల చేసింది. ఆ భూగర్భ బంకర్‌ నుంచి టెహ్రాన్‌లోని కీలక ప్రదేశాలకు సొరంగాలు ఉన్నాయని, అందులో సమావేశ గదులు కూడా ఉన్నాయని పేర్కొంది. ఖమేనీ మృతి తర్వాత కూడా ఆ సొరంగాలను, గదులను నేతలు, అధికారులు వినియోగిస్తున్నట్టు గుర్తించామని తెలిపింది.

కీలక ప్రాంతాలపై ఇరాన్‌ దాడులు

ఇరాన్‌ డ్రోన్లు, క్షిపణులతో ఇజ్రాయెల్‌తోపాటు అరబ్‌ గల్ఫ్‌ దేశాల్లోని కీలక ప్రాంతాలపై దాడులు చేస్తోంది. శుక్రవారం ఖతార్‌లోని అల్‌ ఉదేద్‌ ఎయిర్‌బేస్‌, ఫుజేరా ఆయిల్‌ ఇండస్ర్టీ జోన్‌పై ఇరాన్‌ డ్రోన్‌ దాడులు చేసింది. వాటిని విజయవంతంగా అడ్డుకున్నామని ఖతార్‌ తెలిపింది. అయితే డ్రోన్ల శకలాలు పడటంతో ఫుజేరా జోన్‌లోని చమురు నిల్వ కేంద్రంలో మంటలు అంటుకున్నాయని, వాటిని ఆర్పేశామని ప్రకటించింది. మనామా నగరంలోని ఒక హోటల్‌, రెండు నివాస భవనాలపై ఇరాన్‌ క్షిపణి దాడి జరిగిందని బహ్రెయిన్‌ వెల్లడించింది. రియాద్‌ వైపు దూసుకొచ్చిన పలు క్షిపణులను మధ్యలోనే అడ్డుకున్నామని సౌదీ ప్రకటించింది. అయితే ఇరాన్‌ దాడులతో ఆందోళన నెలకొన్న నేపథ్యంలో.. ఖతార్‌, బహ్రెయిన్‌కు రక్షణగా తమ యుద్ధ విమానాలు ఉంటాయని బ్రిటన్‌ ప్రధాని కీర్‌ స్టార్మర్‌ ప్రకటించారు. ఇందుకోసం నాలుగు టైఫూన్‌ ఫైటర్లను పంపుతున్నట్టు తెలిపారు.

4.jpg


4 రోజుల్లో.. రూ.34 వేల కోట్ల ఆయుధాలు!

ఇరాన్‌పై దాడుల కోసం అమెరికా తొలి నాలుగు రోజుల్లో (ఫిబ్రవరి 28 నుంచి మార్చి 3 వరకు) వినియోగించిన ఆయుధాల విలువ ఏకంగా రూ.34 వేల కోట్లు (3.7 బిలియన్‌ డాలర్లు). అంటే సగటున రోజుకు రూ.8,500 కోట్లు. యుద్ధానికి నిధులకోసం అమెరికా రక్షణ శాఖ ‘కాంగ్రెషనల్‌ బడ్జెట్‌ ఆఫీస్‌‌’కు పంపిన ప్రతిపాదనల ఆధారంగా అమెరికాకు చెందిన సెంటర్‌ ఫర్‌ స్ట్రాటజిక్‌ అండ్‌ ఇంటర్నేషనల్‌ స్టడీస్‌ (సీఎస్‌ఐఎస్‌) ఈ అంచనాలు వేసింది. యుద్ధానికి నిధుల కోసం బడ్జెట్‌లో ఇతర రంగాలకు చేసిన కేటాయింపుల్లో కోతలు పెట్టాల్సి ఉంటుందని పేర్కొంది. శుక్రవారంతో యుద్ధం ఏడో రోజుకు చేరుకుంది. అందులో తొలి నాలుగు రోజుల ఖర్చే రూ.34 వేల కోట్లు. తర్వాతి లెక్కలు తేలాల్సి ఉంది. ఇజ్రాయెల్‌ సొంతంగా చేసిన దాడుల కోసం చేస్తున్న ఖర్చు దీనికి అదనం.

సంధి కోసం అమెరికా, ఇజ్రాయెల్‌వైపు దృష్టిపెట్టండి పెజెష్కియాన్‌

పశ్చిమాసియాలో కాల్పుల విరమణ కోసం ప్రయత్నిస్తున్నవారు మొదట ఇజ్రాయెల్‌, అమెరికా వెనక్కి తగ్గేలా ప్రయత్నించాలని ఇరాన్‌ అధ్యక్షుడు మసౌద్‌ పెజెష్కియాన్‌ సూచించారు. ఈ ప్రాంతంలో స్థిరమైన శాంతికి కట్టుబడి ఉన్నామని పేర్కొన్నారు. ఈ మేరకు శుక్రవారం ‘ఎక్స్‌’లో పోస్టు పెట్టారు. ‘‘ఇరాన్‌ ప్రజలను తక్కువగా అంచనా వేసి ఘర్షణకు నాంది పలికిన ఇజ్రాయెల్‌, అమెరికాలపై మొదట దృష్టిపెట్టాలి. మేం శాంతికి కట్టుబడి ఉన్నాం. అయితే మా దేశ గౌరవాన్ని, సార్వభౌమత్వాన్ని కాపాడుకునే విషయంలో మాత్ర ఏమాత్రం వెనక్కి తగ్గబోం’’ అని పెజెష్కియాన్‌ పేర్కొన్నారు. యుద్ధం ముదిరి గల్ఫ్‌ ప్రాంతంపై తీవ్ర ప్రభావం పడుతుండటంతో.. ఖతార్‌, ఒమన్‌, బహ్రెయిన్‌, యూఏఈ తదితర దేశాలు దాడులు ఆపాలని ఇటు ఇరాన్‌, అటు అమెరికా, ఇజ్రాయెల్‌లపై ఒత్తిడి తెస్తున్నాయి. పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నివారణ కోసం చేపట్టాల్సిన చర్యలపై అరబ్‌ గల్ఫ్‌ దేశాల అధినేతలతో యూరోపియన్‌ యూనియన్‌ ప్రెసిడెంట్‌ ఉర్సులా వాన్‌డెర్‌ లెయన్‌, యూరోపియన్‌ కౌన్సిల్‌ ప్రెసిడెంట్‌ ఆంటోనియో కోస్టా సోమవారం భేటీ అయి చర్చించనున్నారు.

3.jpg

Updated Date - Mar 07 , 2026 | 04:19 AM