Share News

ఇరాన్‌పై భీకర దాడులు

ABN , Publish Date - Jul 16 , 2026 | 06:24 AM

పశ్చిమాసియాలో మళ్లీ పూర్తిస్థాయి యుద్ధం దిశగా అడుగులు పడుతున్నాయి. పరస్పర దాడులు ఉధృతమవడం, ఇరాన్‌ హోర్ముజ్‌ను మూసివేయడం, అమెరికాతో డీల్‌ నుంచి...

ఇరాన్‌పై భీకర దాడులు

బందర్‌ అబ్బాస్‌, చబహార్‌ సహా తీర ప్రాంత

పట్టణాలపై ఏడుగంటల పాటు అమెరికా దాడి

సాయంత్రం మళ్లీ క్షిపణులు, బాంబుల వర్షం

జలసంధిలోని కీలక గ్రేటర్‌ టంబ్‌ దీవిపై దాడి

హోర్ముజ్‌ వెలుపల అమెరికా నౌకా దిగ్బంధం

జలసంధిని మూసేసినట్టు ఇరాన్‌ ప్రకటన

గల్ఫ్‌ పెట్రో ఉత్పత్తుల ఎగుమతుల్ని అడ్డుకుంటాం

అమెరికాతో ఒప్పందం నుంచి తప్పుకొంటున్నాం: ఐఆర్‌జీసీ

ఇరాన్‌ చర్చలకు రావాల్సిందే.. లేకుంటే

అంతమే.. అమెరికా అధ్యక్షుడి హెచ్చరిక

‘సిచ్యువేషన్‌ రూమ్‌’లో ట్రంప్‌ బృందం భేటీ

పూర్తిస్థాయి యుద్ధం కోసమేననే అంచనాలు

వాషింగ్టన్‌/దుబాయ్‌, జూలై 15: పశ్చిమాసియాలో మళ్లీ పూర్తిస్థాయి యుద్ధం దిశగా అడుగులు పడుతున్నాయి. పరస్పర దాడులు ఉధృతమవడం, ఇరాన్‌ హోర్ముజ్‌ను మూసివేయడం, అమెరికాతో డీల్‌ నుంచి తప్పుకొంటున్నట్టు ప్రకటించడం, హోర్ముజ్‌ వెలుపల అమెరికా నౌకా దిగ్బంధం వంటి పరిణామాలు ఆందోళన రేపుతున్నాయి. కాల్పుల విరమణ ప్రకటన తర్వాత ఇప్పటివరకూ ఇరాన్‌పై అర్ధరాత్రి తర్వాత మాత్రమే, అదీ పరిమితంగా దాడులు చేస్తూ వచ్చిన అమెరికా.. ఇప్పుడు పూర్తిస్థాయి యుద్ధం తరహాలో పగటి పూట కూడా బాంబులు వేయడం మొదలుపెట్టింది. ఇరాన్‌ కీలక ప్రాంతాలపై బుధవారం తెల్లవారుజాము నుంచి ఏడు గంటల పాటు బాంబుల వర్షం కురిపించింది. అటు ఇరాన్‌ కూడా పగలు, రాత్రి తేడా లేకుండా గల్ఫ్‌లోని అమెరికా సైనిక స్థావరాలపైకి డ్రోన్లు, క్షిపణులను ప్రయోగిస్తోంది. పదుల కొద్దీ డ్రోన్లు, క్షిపణులు తమవైపు వచ్చాయని, వాటిని మధ్యలో అడ్డుకున్నామని బహ్రెయిన్‌, కువైట్‌, జోర్డాన్‌, యూఏఈ ప్రకటించాయి. అయితే బహ్రెయిన్‌లోని అమెరికా 5వ ఫ్లీట్‌ నౌకాదళ కమాండ్‌ సెంటర్‌ను, ఇంధన ట్యాంకులను ధ్వంసం చేశామని.. కువైట్‌లోని మినా అబ్దుల్లా అమెరికా స్థావరంలో మిలిటరీ వ్యవస్థలను దెబ్బతీశామని ఐఆర్‌జీసీ పేర్కొంది. గత వారంలో రోజుల్లో అమెరికా దాడుల్లో ఇరాన్‌లో మృతుల సంఖ్య 30కి, గాయపడ్డవారి సంఖ్య 260కి పెరిగినట్టు ఇరాన్‌ ఆరోగ్యశాఖ ప్రతినిధి బుధవారం వెల్లడించారు. బుధవారం ఒక్కరోజే ఏడుగురు మరణించినట్టు తెలిపారు. బుధవారం సాయంత్రం హోర్ముజ్‌లో కీలకమైన గ్రేటర్‌ టంబ్‌ దీవిపై అమెరికా భారీ దాడి చేసింది. ఇరాన్‌- యూఏఈ మధ్య వివాదమున్న ఈ దీవి కొన్నేళ్లుగా ఇరాన్‌ ఆధీనంలో ఉంది. గ్రేటర్‌ టంబ్‌ దీవిపై దాడితో ఇరాన్‌ హోర్ముజ్‌లో నౌకలపై దాడి చేసే సామర్థ్యం మరింత తగ్గిపోయిందని అమెరికా పేర్కొంది. హోర్ముజ్‌ జలసంధి బయట అమెరికా నౌకా దిగ్బంధం కొనసాగుతోందని, జలసంధి దాటేందుకు ప్రయత్నించిన రెండు ఇరాన్‌ సంబంధిత నౌకలను వెనక్కి పంపామని తెలిపింది.


హోర్ముజ్‌ మూత.. చమురు ఎగుమతులు బంద్‌!

అమెరికాతో అవగాహన ఒప్పందం నుంచి పూర్తిగా తప్పుకొంటున్నట్టు ఇరాన్‌ ప్రకటించింది. ఏదేమైనా సరే హోర్ముజ్‌ జలసంధిపై తమ సార్వభౌమాధికారాన్ని వదులుకునే ప్రసక్తే లేదని పేర్కొంది. హోర్ముజ్‌ను పూర్తిగా మూసివేస్తున్నామని, పరిస్థితి చక్కబడే వరకు ఎలాంటి నౌకా ప్రయాణానికి వీలు లేదని ఐఆర్‌జీసీ ప్రకటించింది. హోర్ముజ్‌ బయట అమెరికా దిగ్బంధంపై మండిపడింది. పశ్చిమాసియా, గల్ఫ్‌ ప్రాంతాల్లోని ఇరాన్‌ సహా అన్ని దేశాల నుంచి ఎలాంటి ఆటంకం లేకుండా చమురు, గ్యాస్‌ ఎగుమతులు జరగాలని.. లేదా ఏ దేశం నుంచీ, ఎలాంటి ఎగుమతులు జరగడానికి వీల్లేదని స్పష్టం చేసింది.

మౌలిక సదుపాయాలు ధ్వంసం చేస్తాం: ట్రంప్‌

ఇరాన్‌ వచ్చే వారంలోగా చర్చలకు రాకపోతే.. ఆ దేశం అంతుచూస్తామని, మౌలిక సదుపాయాలనూ ధ్వంసం చేస్తామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ హెచ్చరించారు. ట్రంప్‌ బుధవారం కీలకమైన సిట్యువేషన్‌ గదిలో సమావేశం నిర్వహించారు. సాధారణంగా విదేశాల్లో సైనిక చర్యలు, దాడులు చేపట్టినప్పుడు ఈ గది నుంచి సమీక్షిస్తుంటారు. ప్రస్తుతం ఇరాన్‌తో మళ్లీ యుద్ధం చేపట్టవచ్చన్న అంచనాల నేపథ్యంలో ట్రంప్‌ ఇదే గదిలో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించడం చర్చనీయాంశంగా మారింది. ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌, విదేశాంగ, రక్షణ మంత్రులు మార్కో రూబియో, పీట్‌ హెగ్సెత్‌, రక్షణశాఖ ఉన్నతాధికారులు ఈ భేటీలో పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి...

కృష్ణా డెల్టాకు న్యాయం చేయాలనే పట్టిసీమ చేపట్టాం: సీఎం చంద్రబాబు

జగన్ కడపకు పట్టిన క్యాన్సర్ గడ్డ: మంత్రి లోకేశ్

Read Latest AP News And Telugu News

Updated Date - Jul 16 , 2026 | 06:24 AM