అమెరికాలో హిందూ ఆలయమే లక్ష్యంగా కాల్పుల కుట్ర.. యువకుడి అరెస్ట్
ABN , Publish Date - Oct 15 , 2026 | 03:49 PM
అమెరికాలోని ఇల్లినాయిస్ రాష్ట్రం అరోరా ప్రాంతంలో హిందూ దేవాలయాన్ని లక్ష్యంగా చేసుకుని సామూహిక కాల్పులకు కుట్ర జరిగిందన్న వార్తలపై భారత్ తీవ్రంగా స్పందించింది.
ఇంటర్నెట్ డెస్క్: అమెరికాలోని ఇల్లినాయిస్ రాష్ట్రం అరోరా ప్రాంతంలో హిందూ దేవాలయాన్ని లక్ష్యంగా చేసుకుని సామూహిక కాల్పులకు కుట్ర జరిగిందన్న వార్తలపై భారత్ తీవ్రంగా స్పందించింది. ఈ కుట్రలో జాత్యహంకార.. హిందూ వ్యతిరేక భావజాలం కనిపించడం ఆందోళన కలిగిస్తోందని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది. భారతీయ సంతతికి చెందిన ప్రజలపై హింసకు సంబంధించిన ప్రస్తావనలు ఉండటం మరింత కలవరపరిచే అంశమని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు. అమెరికాలో పెరుగుతున్న జాత్యహంకార విద్వేషం.. భారత్ వ్యతిరేక ద్వేషంపై ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఈ ఘటన మరింత ఆజ్యం పోస్తోందని పేర్కొన్నారు. అమెరికాలోని భారతీయ సమాజం భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని, విద్వేషపూరిత హింసను ఏమాత్రం సహించకూడదని భారత్ స్పష్టం చేసింది.
ఈ కేసులో ఇల్లినాయిస్లోని పాలటైన్కు చెందిన 19 ఏళ్ల అలెగ్జాండ్రోస్ పాపరాకిస్ను అమెరికా అధికారులు అరెస్టు చేశారు. హిందూ ప్రార్థనా స్థలాన్ని లక్ష్యంగా చేసుకుని సామూహిక కాల్పులకు ప్రణాళిక రూపొందించాడనే ఆరోపణలపై అతడిపై దర్యాప్తు చేపట్టారు. అధికారుల సమాచారం ప్రకారం, శ్వేతజాతి ఆధిపత్య భావజాలాన్ని వ్యక్తం చేస్తూ, భారతీయ సంతతికి చెందిన ప్రజలపై హింసను ప్రస్తావించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఒక ప్రకటనపత్రాన్ని అతని వద్ద నుంచి స్వాధీనం చేసుకున్నారు. సామూహిక కాల్పులకు సంబంధించిన ప్రణాళికను వివరిస్తూ.. రైఫిల్, మ్యాగజైన్లు, బాడీ ఆర్మర్ ఉన్నట్టు దర్యాప్తు అధికారులు వెల్లడించారు.
తన సహోద్యోగులతో ఆదివారం ఒక ప్రత్యేకమైన రోజు కాబోతోందని చెప్పినట్లు కూడా ఆరోపణలు ఉన్నాయి. ఈ సమాచారంతో అమెరికా పోలీసులు దర్యాప్తు ప్రారంభించి అతడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి అరెస్టు, నిర్బంధం, అభియోగాల విషయంలో అమెరికా అధికారులు తీసుకున్న చర్యలను భారత్ గమనిస్తోందని రణధీర్ జైస్వాల్ తెలిపారు. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపి, బాధ్యులను న్యాయస్థానం ముందు నిలబెట్టాలని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని భారత్ ఆశాభావం వ్యక్తం చేసింది.
ఇవీ చదవండి:
ముస్కాన్కు మరణశిక్ష.. పిల్లల భవితవ్యంపై సౌరభ్ కుటుంబం స్పందనిదే.?
నాల్గో టీ20లో టీమ్ఇండియా ఓటమికి ప్రధాన కారణం అతడే.!