బొట్టు పెట్టుకోవద్దన్న బ్రిటన్ స్కూల్.. కోర్టుకెక్కిన హిందూ బాలుడి తండ్రి..
ABN , Publish Date - Nov 07 , 2026 | 06:22 PM
బ్రిటన్లో హిందూ మత విశ్వాసాలకు సంబంధించిన అంశం వివాదాస్పదంగా మారింది. నుదుటిపై తిలకం ధరించకూడదని తమ కుమారుడిని పాఠశాల యాజమాన్యం ఆదేశించిందని ఆరోపిస్తూ ఓ భారత సంతతి హిందూ కుటుంబం న్యాయపోరాటానికి దిగింది.
ఇంటర్నెట్ డెస్క్: బ్రిటన్లో హిందూ మత విశ్వాసాలకు సంబంధించిన అంశం వివాదాస్పదంగా మారింది. నుదుటిపై తిలకం ధరించకూడదని తమ కుమారుడిని పాఠశాల యాజమాన్యం ఆదేశించిందని ఆరోపిస్తూ ఓ భారత సంతతి హిందూ కుటుంబం న్యాయపోరాటానికి దిగింది. తొమ్మిదేళ్ల బాలుడి తండ్రి తన కుమారుడి తరఫున లండన్ హైకోర్టును ఆశ్రయించారు. తమ కుమారుడిపై మతపరమైన వివక్ష, వేధింపులకు పాల్పడ్డారని ఆరోపిస్తూ పాఠశాల నుంచి 25 వేల పౌండ్లు (సుమారు రూ.30 లక్షలు) పరిహారంగా చెల్లించాలని డిమాండ్ చేశారు (Tilak Ban UK School).
బ్రిటన్లోని ఆల్పర్టన్ ప్రాంతంలో ఉన్న వికర్స్ గ్రీన్ ప్రైమరీ స్కూల్లో ఈ వివాదం చోటుచేసుకుంది. తొమ్మిదేళ్ల బాలుడు స్వామినారాయణ హిందూ సాంప్రదాయాన్ని అనుసరిస్తున్నాడు. ఆ బాలుడు సుమారు నాలుగేళ్లుగా పాఠశాలకు తిలకం ధరించే వెళ్తున్నాడు. అయితే 2025 నవంబరులో పాఠశాల సిబ్బంది అతడిని తిలకం గురించి ప్రశ్నించి, దానిని ధరించడానికి అనుమతి లేదని చెప్పారు. 2025 డిసెంబర్ 12న బాలుడిని పాఠశాల కౌన్సిల్ నుంచి తొలగించారు. దీనిపై తల్లిదండ్రులు పాఠశాల యాజమాన్యానికి లేఖ రాశారు. తమ కుమారుడు చాలా కాలంగా తిలకం ధరించి పాఠశాలకు వస్తున్నాడని, దానిపై ఎలాంటి నిషేధమూ లేదని వివరించారు (UK School Discrimination).
బాలుడి తండ్రి తన కుమారుడి తరఫున పాఠశాలపై కేసు వేశారు. బ్రిటన్లోని హిందూ సంస్థ 'యాక్షన్ ఫర్ హార్మనీ' ఈ న్యాయపోరాటానికి ఆర్థిక సహాయం అందిస్తోంది. పాఠశాల యాజమాన్యం తమ కుమారుడి మత స్వేచ్ఛకు భంగం కలిగించిందని, మతపరమైన వేధింపులకు పాల్పడిందని తండ్రి ఆరోపించారు. బ్రిటన్ మానవ హక్కుల ఒప్పందంలోని 9వ అధికరణం (మత స్వేచ్ఛ), 14వ అధికరణం (వివక్షకు వ్యతిరేక హక్కు) ఉల్లంఘనకు గురయ్యాయని పేర్కొన్నారు. అంతేకాకుండా ప్రభుత్వ రంగ సంస్థలకు వర్తించే సమానత్వ బాధ్యతలను కూడా పాఠశాల ఉల్లంఘించిందని ఆరోపిస్తూ 25 వేల పౌండ్ల పరిహారం కోరారు (Religious Discrimination UK).
మరోవైపు పాఠశాల యాజమాన్యం ఈ ఆరోపణలను పూర్తిగా ఖండించింది. బాలుడి నుదుటిపై తిలకం ధరించడాన్ని నిషేధించడం వల్ల అతడు హిందూ మతాన్ని ఆచరించకుండా అడ్డుకున్నట్లు కాదని వాదించింది. ఒక విద్యార్థి మతపరమైన చిహ్నాన్ని ధరించడానికి అనుమతిస్తే ఇతర విద్యార్థులతో సామరస్యం దెబ్బతినే అవకాశం ఉందని పేర్కొంది. ఈ వివాదంలో కోర్టు ఇంకా తుది తీర్పు వెలువరించలేదు.
ఇవి కూడా చదవండి..
రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు.. భారీ ఒప్పందం రాబోతోందన్న ట్రంప్..
అమెరికా దాడుల భయం.. ఇరాన్లో అయోడిన్ మాత్రలు పంచుతున్నారా..