19 మంది భారతీయులను అరెస్ట్ చేసిన యూఏఈ.. ఎందుకంటే..
ABN , Publish Date - Mar 16 , 2026 | 11:39 AM
అమెరికా, ఇజ్రాయెల్- ఇరాన్ మధ్య యుద్ధం ముదురుతున్న వేళ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రభుత్వం భారీ చర్యలకు ఉపక్రమించింది. పశ్చిమాసియా ప్రాంతంలో ఈ యుద్ధం పరిస్థితుల గురించి సోషల్ మీడియా వేదికగా తప్పుడు సమాచారాన్ని, కల్పిత దృశ్యాలను ప్రచారం చేస్తున్న వారిపై కొరడా ఝుళిపించింది.
ఇంటర్నెట్ డెస్క్: అమెరికా, ఇజ్రాయెల్- ఇరాన్ మధ్య యుద్ధం ముదురుతున్న వేళ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రభుత్వం భారీ చర్యలకు ఉపక్రమించింది. పశ్చిమాసియా ప్రాంతంలో ఈ యుద్ధం పరిస్థితుల గురించి సోషల్ మీడియా వేదికగా తప్పుడు సమాచారాన్ని, కల్పిత దృశ్యాలను ప్రచారం చేస్తున్న వారిపై కొరడా ఝుళిపించింది. నిబంధనలు ఉల్లంఘించిన ఆరోపణలపై మొత్తం 35 మందిని అరెస్ట్ చేయగా, అందులో ఏకంగా 19 మంది భారతీయులు ఉన్నారు.
గల్ఫ్ ప్రాంతంలో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో, క్షిపణి దాడులు లేదా రక్షణ వ్యవస్థల ఆపరేషన్లను చిత్రీకరించవద్దని గతంలో యూఏఈ ప్రభుత్వం స్థానికులను హెచ్చరించింది. ఈ ఆదేశాలను బేఖాతరు చేస్తూ, కొందరు సోషల్ మీడియాలో తప్పుడు సమాచారాన్ని పోస్ట్ చేశారు. ఈ క్రమంలో ఆంక్షలను ఉల్లంఘించిన 25 మందిని అరెస్ట్ చేయాలని యూఏఈ అటార్నీ జనరల్ డాక్టర్ హమద్ సైఫ్ అల్ షమ్సీ ఆదేశించారు. అరెస్టైన వారిలో 17 మంది భారతీయులు ఉన్నారు. అంతకుముందు రెండు రోజుల క్రితం పది మందిని అరెస్ట్ చేయగా.. అందులో ఇద్దరు భారతీయులు ఉన్నారు. మొత్తంగా 35 మందిలో 19 మంది భారతీయులు ఇప్పుడు జైలు పాలయ్యారు.
నిందితులపై యూఏఈ ఆరోపణలు ఇవే..
మూడు గ్రూపులుగా విడిపోయిన నిందితులు సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. క్షిపణుల వీడియోలు, ఏఐ ఫేక్ దృశ్యాలు, శత్రు దేశాలకు మద్దతుగా పోస్టులు పెడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ తరహా నేరాలకు పాల్పడితే నిందితులకు కనీసం ఏడాది జైలు శిక్షతో పాటు, ఒక లక్ష దిర్హమ్‌లకు..మన కరెన్సీలో దాదాపు రూ.22 లక్షలకు పైగా జరిమానా విధించే అవకాశం ఉందని సమాచారం. మరోవైపు యూఏఈలోని మూడు ప్రధాన ఓడరేవులను ఖాళీ చేయాలని ఇరాన్ పిలుపునిచ్చిన ఒక రోజు తర్వాత , ఆదివారం ఉదయం గల్ఫ్ దేశాలపై కొత్త దాడులు జరిగాయని స్థానిక మీడియా వెల్లడించింది. ఈ యుద్ధం ప్రారంభమైన తర్వాత తొలిసారిఅమెరికా సంబంధం లేని పొరుగు దేశాలకు చెందిన ప్రదేశాలపై ఇరాన్ బెదిరింపులకు దిగింది.
ఇవి కూడా చదవండి:
54 వేల టన్నుల LPGతో గుజరాత్ పోర్ట్ చేరుకున్న శివాలిక్ నౌక
హార్మూజ్ జలసంధికి యుద్ధ నౌకలు పంపండి: ట్రంప్ పిలుపు