భూగర్భ స్థావరంలో ఇరాన్ సుప్రీం లీడర్.. చర్చలపై ప్రభావం!
ABN , Publish Date - May 25 , 2026 | 11:49 AM
ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తాబా ఖమేనీ భూగర్భ స్థావరంలో తలదాచుకుంటున్నట్టు అమెరికా నిఘావర్గాలు సహా పలు అంతర్జాతీయ మీడియా సంస్థలు నివేదించాయి. దీని ఫలితంగానే సమాచార మార్పిడికి అధిక సమయం పడుతోందని పేర్కొన్నాయి.
ఇంటర్నెట్ డెస్క్: అమెరికా-ఇరాన్ మధ్య కీలక చర్చలు జరుగుతున్న నేపథ్యంలో ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తాబా ఖమేనీ రహస్య స్థావరంలో దాక్కున్నట్టు తెలుస్తోంది. ఈ విషయం ఇప్పుడు అంతర్జాతీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. అమెరికా నిఘావర్గాల సమాచారం, పలు అంతర్జాతీయ మీడియా సంస్థల నివేదికల ప్రకారం.. ఖమేనీ ప్రస్తుతం కట్టుదిట్టమైన భద్రత నడుమ బంకర్లలో ఉంటూ, బయటి ప్రపంచంతో దాదాపు సంబంధాలు తెంచుకున్నట్లు తెలుస్తోంది. ఇరాన్ ప్రభుత్వంలోని అత్యున్నత స్థాయి అధికారులకు కూడా ఆయన ఆచూకీ తెలియదని, ఆయనను నేరుగా సంప్రదించే మార్గంలేదని నివేదికలు పేర్కొన్నాయి.
దీంతో ఖమేనీతో నేరుగా మాట్లాడే అవకాశం కూడా లేదని, ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన దూతల ద్వారానే సమాచార మార్పిడి జరుగుతున్నట్టు నివేదికలు వెల్లడించాయి. అమెరికా నుంచి వచ్చే ప్రతిపాదనలు ముందుగా దూతల ద్వారా ఖమేనీకి చేరుతుండటంతో, దానికి ఆయన సమాచారమిచ్చేందుకు ఎక్కువ సమయం పడుతోందని స్పష్టం చేశాయి. ఈ కారణంగానే అమెరికా-ఇరాన్ మధ్య జరుగుతున్న అణు ఒప్పంద చర్చలు నెమ్మదిగా సాగుతున్నాయని సమాచారం.
ఇక.. అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా నిర్వహించిన 'ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ' దాడుల అనంతరం ఇరాన్ నాయకత్వం మరింత అప్రమత్తమైనట్టు తెలుస్తోంది. ఆ దాడుల్లో మాజీ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీ మృతిచెందగా.. మొజ్తాబా ఖమేనీ గాయపడ్డారు. నాటి నుంచి ఆయన ఎక్కడా బహిరంగంగా కనిపించడం లేదు. ఇరాన్ కీలక నాయకులు కూడా బంకర్లలో తలదాచుకుంటున్నారని నివేదికలు చెబుతున్నాయి.
ఇవీ చదవండి:
ఇరాన్‌తో ఒప్పందం విషయంలో తొందరపడడం లేదు: డొనాల్డ్ ట్రంప్
ఉక్రెయిన్‌పై ‘ఒరెష్నిక్’ క్షిపణితో రష్యా దాడి