Share News

ఫ్లైదుబాయ్ ఉదంతం.. నిందితుడికి విమాన సిబ్బంది సహాయం?

ABN , Publish Date - Oct 12 , 2026 | 06:50 AM

విమానం హైజాక్ ఆరోపణలు ఎదుర్కొంటున్న ఫ్లైదుబాయ్‌ కోపైలట్‌ హమ్మామ్‌కు ఫ్లైట్ సిబ్బంది సాయం చేయబోయారని ఓ ప్రయాణికుడు ఆరోపించారు.

ఫ్లైదుబాయ్ ఉదంతం.. నిందితుడికి విమాన సిబ్బంది సహాయం?
Doubts over Flydubai Crew helping copilot

ఇంటర్నెట్ డెస్క్: విమానం హైజాక్ ఆరోపణలు ఎదుర్కొంటున్న ఫ్లైదుబాయ్‌ కోపైలట్‌ హమ్మామ్‌కు ఫ్లైట్ సిబ్బంది సాయం చేయబోయారని ఓ ప్రయాణికుడు ఆరోపించారు. వారిపై దర్యాప్తు జరపాలని కోరారు. ఘటన సమయంలో విమానంలో ఉన్న ఆసఫ్ రాజువాన్ ఈ ఆరోపణలు చేశారు. ఆ సమయంలో తాను కుటుంబంతో సహా వెళుతున్నట్టు చెప్పారు. ఇద్దరు ఫ్లైట్ అటెండెంట్ల తీరు సందేహాస్పదంగా అనిపించిందని ఇటీవల స్థానిక మీడియాకు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.

మొదట కొందరు ప్యాసింజర్లు కోపైలట్ హమ్మామ్‌ను నిలువరించి సీటులో కదలకుండా కూర్చోబెట్టారని ఆసఫ్ చెప్పారు. ఆ తరువాత ఓ ఫ్లైట్ అటెండెంట్ వచ్చి అతడి కట్లు విప్పే ప్రయత్నం చేస్తున్నట్టు కనిపించిందని అన్నాడు. ఇది చూసిన మిగతా ప్యాసింజర్లు అతడిని అడ్డుకున్నారని వివరించారు.


తీవ్రగాయాల పాలైన మచ్చార్‌కు ఫ్లైట్‌లో ప్రయాణికులు వైద్య సాయం అందిస్తున్న సమయంలో కూడా మరో ఫ్లైట్ అటెండెంట్ తీరు అనుమానాస్పందంగా అనిపించిందని చెప్పారు. అతడు మచ్చార్‌కు ఏదో టాబ్లెట్ ఇవ్వబోతుంటే ప్రయాణికులు వద్దని వారించినట్టు చెప్పారు. ఆ తరువాత కూడా ఫ్లైట్‌లో ఉద్రిక్త వాతావరణం కనిపించిందని ఆసఫ్ తెలిపారు. ఫ్లైట్ అటెండెంట్లు, ప్రయాణికుల మధ్య వాగ్వాదం జరిగిందని అన్నారు. మీరు పోలీసు ఆఫీసరా? అని వారు తనను ప్రశ్నించినట్టు కూడా చెప్పారు. ఆ ఘటనను రికార్డు చేస్తున్న ప్రయాణికులను సిబ్బంది అడ్డుకున్నారని కూడా తెలిపారు.

ఘటన సమయంలో విమానంలో మరో ఇద్దరు పైలట్లు కూడా ఉన్న విషయం తెలిసిందే. వారే విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేశారు. అయితే, మచ్చార్‌పై దాడిని చూసి వారు కొంత షాక్‌కు గురయ్యారని తోటి ప్రయాణికుడు తాల్ చెప్పారు. వారిని కదిపి తేరుకునేలా చేశానని తెలిపారు. ఆ తరువాత వారు విమానాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారని అన్నారు. ఒకదశలో విమానంపై ఎవరి అదుపూ లేకపోయిందని చెప్పారు. అయితే, ఈ అంశాలు అధికారిక దర్యాప్తులో రుజువు కావాల్సి ఉంది.


ఈ వార్తలనూ చదవండి:

ఏఐ, అణ్వస్త్ర పోరు, జీవాయుధాలతో మహా ముప్పు

మచ్చార్‌కు ఇజ్రాయెల్‌ ప్రెసిడెన్షియల్‌ అవార్డు

Updated Date - Oct 12 , 2026 | 07:25 AM