Share News

ఏఐ, అణ్వస్త్ర పోరు, జీవాయుధాలతో మహా ముప్పు

ABN , Publish Date - Oct 12 , 2026 | 05:52 AM

కృత్రిమ మేధస్సు (ఏఐ) దుర్వినియోగం, అణు యుద్ధాలు, జీవాయుధాలతో భవిష్యత్తులో మానవాళికి మహా ముప్పు పొంచి ఉందని ప్రముఖ వైద్య జర్నల్‌ ‘లాన్సెట్‌’లో ప్రచురితమైన తాజా నివేదిక హెచ్చరించింది.

ఏఐ, అణ్వస్త్ర పోరు, జీవాయుధాలతో మహా ముప్పు

  • ఏఐ, అణ్వస్త్ర పోరు, జీవాయుధాలతో మహా ముప్పు

  • 2100 నాటికి మానవాళి అంతరించే ప్రమాదం

  • హెచ్చరించిన లాన్సెట్‌ కథనం

న్యూఢిల్లీ, అక్టోబర్‌ 11: కృత్రిమ మేధస్సు (ఏఐ) దుర్వినియోగం, అణు యుద్ధాలు, జీవాయుధాలతో భవిష్యత్తులో మానవాళికి మహా ముప్పు పొంచి ఉందని ప్రముఖ వైద్య జర్నల్‌ ‘లాన్సెట్‌’లో ప్రచురితమైన తాజా నివేదిక హెచ్చరించింది. 2100 నాటికి మానవాళిని తుడిచిపెట్టేసే ప్రమాదం ఉందని హెచ్చరించింది. వచ్చే 75 ఏళ్లలో మానవాళి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపించే ఇలాంటి 17 ప్రధాన ముప్పులను ప్రస్తావించింది. త్వరలో జర్మనీలోని బెర్లిన్‌లో జరిగే ప్రపంచ ఆరోగ్య సదస్సులో దీనిపై చర్చించనున్నారు. జీవాయుధాలను సృష్టించడానికి ఏఐని దుర్వినియోగం చేసే ప్రమాదం ఉందని.. లక్షలాది మంది ప్రాణాలను ప్రమాదంలో పడేయొచ్చని నివేదిక హెచ్చరించింది.

అణ్వస్త్ర యుద్ధంతో భారీస్థాయిలో హానికారక ధూళి కణాలు వాతావరణంలోని పైపొరల్లోకి చేరి సూర్యరశ్మిని అడ్డుకుంటాయని.. ఆహారోత్పత్తిని ప్రభావితం చేస్తాయని తెలిపింది. దీనివల్ల ఆహార కొతర ఏర్పడి మానవాళి మనుగడకు ముప్పుగా మారొచ్చని వివరించింది. అలాగే వాయు కాలుష్యం, వాతావరణ మార్పులు, యాంటీ మైక్రోబయల్‌ రెసిస్టెన్స్‌ (సూక్ష్మజీవులు మందులకు లొంగకపోవడం), ప్రకృతి విపత్తులు సవాళ్లుగా పేర్కొంది. ఒకదానితో ఒకటి ముడిపడిన ఈ సమస్యలను సమగ్రంగా ఎదుర్కోవాలని సూచించింది. ఇవి వాస్తవ రూపం దాల్చితే మానవాళికి మహాముప్పుగా మారొచ్చని లాన్సెట్‌ ఎడిటోరియల్‌ కథనం సైతం హెచ్చరించింది.

భూతాపాన్ని కూడా పెద్దముప్పుగా పేర్కొంది. ఉష్ణోగ్రతలు పెరుగుతూ పోతే మానవ ఆరోగ్యంపై తీవ్రప్రభావం పడుతుందని అంచనా వేసింది. భూతాపాన్ని 4.4 డిగ్రీల సెల్సియస్‌ వరకు పెరగకుండా, 1.8 డిగ్రీలకే పరిమితం చేయాలని.. దీనివల్ల 189 కోట్ల ఆరోగ్యకర సంవత్సరాలను కాపాడుకోవచ్చని సూచించింది.


ఈ వార్తలనూ చదవండి...

నెల్లూరులో ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన సీఎం చంద్రబాబు

రాయలసీమ అభివృద్ధి సభలో రాజకీయాలు వద్దు: పవన్ కల్యాణ్

Updated Date - Oct 12 , 2026 | 06:28 AM