Share News

వెయ్యి క్షిపణులు గురి పెట్టా!

ABN , Publish Date - Jul 12 , 2026 | 05:57 AM

తనకు ఏదైనా హాని తలపెట్టినా, అలాంటి ప్రయత్నమేదీ చేసినా ఇరాన్‌ సర్వనాశనం అవుతుందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ హెచ్చరించారు...

వెయ్యి క్షిపణులు గురి పెట్టా!

  • నాకు హాని తలపెడితే ఇరాన్‌ సర్వనాశనమే

  • ఇరాన్‌పై ఏడాది పాటు దాడులు చేసేలా

  • అమెరికా మిలిటరీ సిద్ధంగా ఉంది: ట్రంప్‌

  • హోర్ముజ్‌ పూర్తిగా తెరుస్తున్నట్టు 24 గంటల్లో

  • అధికారిక ప్రకటన చేయాలని ఇరాన్‌కు స్పష్టీకరణ

  • నాన్న మరణానికి ప్రతీకారం తప్పదు: మొజ్తాబా

వాషింగ్టన్‌/దుబాయ్‌/న్యూఢిల్లీ, జూలై 11: తనకు ఏదైనా హాని తలపెట్టినా, అలాంటి ప్రయత్నమేదీ చేసినా ఇరాన్‌ సర్వనాశనం అవుతుందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ హెచ్చరించారు. ఇరాన్‌వైపు ఇప్పటికే వెయ్యి క్షిపణులు గురిపెట్టి ఉన్నాయని.. ఇంకా వేలకొద్దీ క్షిపణులు కూడా ప్రయోగించేందుకు సిద్ధం చేస్తున్నామని చెప్పారు. దీనిపై ఆయన ట్రూత్‌ సోషల్‌లో పలు పోస్టులు పెట్టారు. ‘‘నాకేమైనా అయితే ఏం చేయాలన్న దానిపై ముందే ఆదేశాలు ఇచ్చాను. ఇరాన్‌పై ఏడాది పాటు, అవసరమైతే ఇంకా ఎక్కువకాలం దాడులు చేయడానికి అమెరికా మిలిటరీ సర్వ సన్నద్ధతతో ఉంది. ఇరాన్‌లో మిగిలి ఉన్న అన్నింటినీ ధ్వంసం చేస్తుంది..’’ అని ట్రంప్‌ పేర్కొన్నారు. మరోవైపు, ఒప్పందంలో కీలకమైన హోర్ముజ్‌ జలసంధిని పూర్తిగా తెరుస్తున్నట్టు, నౌకలపై దాడులు చేయబోమని హామీ ఇస్తూ 24 గంటల్లో అధికారిక ప్రకటన చేయాలని ఇరాన్‌కు అమెరికా అల్టిమేటం జారీ చేసింది. పాకిస్థాన్‌, ఖతార్‌ మధ్యవర్తుల ద్వారా ఇరాన్‌కు ఈ అల్టిమేటం అందినట్టు యాక్సియోస్‌ వార్తా సంస్థ పేర్కొంది. 24 గంటల్లో దీనిపై ప్రకటన చేయకుంటే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించినట్టు వెల్లడించింది. ఇదిలా ఉండగా, అమెరికా, ఇజ్రాయెల్‌ దాడుల్లో దెబ్బతిన్న యురేనియం శుద్ధి కేంద్రాలను ఇరాన్‌ పునర్నిర్మిస్తోందంటూ సీఎన్‌ఎస్‌ కథనం ప్రచురించింది. దాడుల్లో ఆయా స్థావరాలు దెబ్బతిన్నప్పటి, జూలై తొలివారం నాటి ఉపగ్రహ చిత్రాలను విశ్లేషించి దీనిని గుర్తించినట్టు పేర్కొంది. ఇరాన్‌ పార్చిన్‌ మిలిటరీ కాంప్లెక్స్‌లో భాగమైన టలెఘాన్‌-2 భూగర్భ అణుశుద్ధి కేంద్రం వద్ద నిర్మాణ పనులు జరుగుతున్నాయని పేర్కొంది. కాగా, కాల్పుల విరమణ, అవగాహన ఒప్పందం అమలు విషయంలో ఇరాన్‌ మాట మీదే నిలబడి ఉందని ఆ దేశ విదేశాంగ మంత్రి అబ్బాస్‌ అరాగ్చీ పేర్కొన్నారు. కాల్పుల విరమణ ఒప్పందాన్ని అమెరికానే ఉల్లంఘించిందని ఆరోపించారు. అమెరికాతో ఒప్పందానికి సంబంధించిన చర్చల కోసం ఆయన శనివారం ఒమన్‌కు వెళ్లారు. ఇక అమెరికా మళ్లీ ఇరాన్‌పై పూర్తిస్థాయి యుద్ధానికి దిగితే ఎదుర్కొనేందుకు అన్నిరకాలుగా సిద్ధంగా ఉన్నామని ఇరాన్‌ స్పీకర్‌ మొహమ్మద్‌ బఘర్‌ ఘలీబఫ్‌ పేర్కొన్నారు.


మా నాయకుడి మరణానికి ప్రతీకారం తీర్చుకుంటాం

  • మొజ్తాబా ఖమేనీ

ఇరాన్‌ దివంగత సుప్రీం లీడరల్‌ అయతొల్లా అలీ ఖమేనీ మరణానికి తాము కచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటామని ఆయన కుమారుడు, ప్రస్తుత సుప్రీంలీడర్‌ మొజ్తాబా ఖమేనీ ప్రకటించారు. ప్రతీకారం తీర్చుకోవడం ఇరాన్‌ ప్రజల సంకల్పమని పేర్కొన్నారు. అలీ ఖమేనీ అంత్యక్రియల అనంతరం మొజ్తాబా తొలిసారిగా ప్రకటన చేశారు. తన తండ్రి అంత్యక్రియలకు హాజరైన లక్షలాది మంది ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.

ఈ వార్తలు కూడా చదవండి...

ఎంఎస్ఎంఈలకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్

ఆ ఘటనపై మంత్రి సత్యకుమార్ యాదవ్ సీరియస్

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Jul 12 , 2026 | 06:11 AM