Share News

పుతిన్, ట్రంప్ ఫోన్ కాల్‌లో కీలక చర్చలు.. అమెరికాకు రష్యా డీజిల్ సరఫరాపై ప్రతిపాదన

ABN , Publish Date - Oct 10 , 2026 | 09:22 AM

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మధ్య సుమారు గంటన్నరపాటు ఫోన్ సంభాషణ జరిగింది. అమెరికాకు రష్యా నుంచి డీజిల్ సరఫరా, ఉక్రెయిన్ యుద్ధం, ఇరాన్‌తో దౌత్యపరమైన చర్చలపై ఇరువురు నేతలు మాట్లాడుకున్నట్లు సమాచారం.

పుతిన్, ట్రంప్ ఫోన్ కాల్‌లో కీలక చర్చలు.. అమెరికాకు రష్యా డీజిల్ సరఫరాపై ప్రతిపాదన
Trump Putin Russia Diesel Supply

Trump Putin Russia Diesel Supply: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ శుక్రవారం రాత్రి సుమారు గంటన్నరపాటు సుదీర్ఘంగా టెలిఫోన్‌లో మాట్లాడుకున్నారు. ఈ సంభాషణలో అమెరికాకు రష్యా నుంచి చమురు (డీజిల్) సరఫరాతో పాటు, ఉక్రెయిన్ సంక్షోభం, ఇరాన్ దౌత్యపరమైన అంశాలపై ఇరువురు నేతలు చర్చించినట్లు రష్యా విదేశాంగ మంత్రిత్వ శాఖ, అధ్యక్ష కార్యాలయ సహాయకుడు యూరి ఉషాకోవ్ వెల్లడించారు.


అమెరికాకు రష్యా నుంచి భారీగా పెట్రోలియం ఉత్పత్తులు, డీజిల్ సరఫరా కానుండటం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై సానుకూల ప్రభావాన్ని చూపుతుందని పుతిన్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. అమెరికాకు రష్యా నుంచి పెద్ద ఎత్తున డీజిల్ దిగుమతులు జరగనున్నాయని, దీనివల్ల అమెరికన్లకు (ముఖ్యంగా రైతులు, ట్రక్కర్లు, పశుపోషకులకు) ఇంధన ధరలు రికార్డు స్థాయిలో తగ్గుతాయని ట్రంప్ వైట్‌హౌస్ వెలుపల మీడియాతో తెలిపిన సంగతి తెలిసిందే.


ట్రంప్ సోషల్ మీడియా పోస్ట్ (Truth Social)

రష్యా నుంచి తక్షణమే 3 లక్షల టన్నులకు పైగా డీజిల్ ఇంధనం వస్తుందని, నవంబర్‌లో మరో 5 లక్షల టన్నులు, ఆ తర్వాత వెంటనే 10 లక్షల టన్నులు, రిఫైనరీల పరిస్థితి మేరకు మరో 30 లక్షల టన్నుల డీజిల్ అందుబాటులోకి వస్తుందని ట్రంప్ వెల్లడించారు. హార్ముజ్ జలసంధిపై తమ పూర్తి నియంత్రణ, రష్యన్ ఇంధన ఒప్పందం కలసి అమెరికాలో డీజిల్ ధరలను వేగంగా తగ్గిస్తాయని ఆయన పేర్కొన్నారు.


ఉక్రెయిన్ వివాదం

ఉక్రెయిన్‌లోని కీలక పరిణామాలు, రష్యా ముందుకు వెళ్లకుండా ఉక్రెయిన్ జరుపుతున్న దాడుల వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని పుతిన్ స్పష్టం చేశారు. రష్యా సైనిక చర్యల లక్ష్యాలు మారలేదని, అయితే శాంతియుత దౌత్య పరిష్కారానికి తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఉక్రేనియన్ డ్రోన్ దాడుల కారణంగా త్రిపాక్షిక చర్చల పునరుద్ధరణ ఆలస్యమైందని, త్వరలోనే దీనిపై తగిన నిర్ణయం తీసుకుంటామని రష్యా పేర్కొంది.


ఇరాన్ దౌత్యం

ఇరాన్‌పై దౌత్య మార్గాలు ఇంకా మూసుకుపోలేదని, టెహ్రాన్‌తో ఒప్పందం కుదుర్చుకోవడం సాధ్యమేనని పుతిన్ అభిప్రాయపడ్డారు. అమెరికా ఖతార్ ద్వారా ఇరాన్‌తో పరోక్ష సంప్రదింపులు జరుపుతున్న విషయాన్ని పుతిన్ ప్రస్తావించగా, ట్రంప్ దానిని అంగీకరించి.. ఇరాన్ అంశంపై రష్యా చొరవను స్వాగతించారు.


జన్మదిన శుభాకాంక్షలు

ట్రంప్ స్వయంగా పుతిన్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఉక్రెయిన్ సంఘర్షణలో వేరైన కుటుంబాలను, పిల్లలను తిరిగి కలపడంలో అమెరికా ప్రథమ మహిళ మెలానియా ట్రంప్ చేస్తున్న మానవతా సేవలను పుతిన్ ఈ సందర్బంలో ప్రత్యేకంగా అభినందించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

స్థిరంగా బంగారం, వెండి ధరలు..

ఎంప్లాయిమెంట్‌ ఎక్స్చేంజ్‌ సర్వీస్‌ రూల్స్‌లో సవరణలు

Updated Date - Oct 10 , 2026 | 09:22 AM