హోర్ముజ్‌లో అన్ని నౌకల్ని అడ్డుకోండి.. అమెరికా నౌకాదళాన్ని ఆదేశించిన ట్రంప్!
ABN , Publish Date - Apr 12 , 2026 | 07:38 PM
అమెరికా- ఇరాన్ మధ్య శాంతి చర్చలు విఫలం కావడంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. హోర్ముజ్ జలసంధిలోకి ప్రవేశించే అన్ని నౌకలను అడ్డుకోవాలని అమెరికా నౌకాదళాన్ని ఆయన ఆదేశించారు.
వాషింగ్టన్/ఇస్లామాబాద్: పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు మళ్లీ కమ్ముకున్నాయి. అమెరికా, ఇరాన్ మధ్య శాంతి చర్చలు విఫలం కావడంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా సంచలన నిర్ణయం తీసుకున్నారు. హోర్ముజ్ జలసంధి (Strait of Hormuz) లోకి ప్రవేశించే అన్ని నౌకలను అడ్డుకోవాలని అమెరికా నౌకాదళాన్ని (US Navy) ఆయన ఆదేశించారు.
పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్‌లో రెండు రోజుల పాటు జరిగిన శాంతి చర్చలు ఎటువంటి ఫలితం లేకుండా ముగిసిన సంగతి తెలిసిందే. అమెరికా ఉపాధ్యక్షుడు జె.డి. వాన్స్ చర్చల నుంచి నిష్క్రమించడంతో పరిస్థితి తీవ్రరూపం దాల్చింది. 'ఇరాన్ కావాలనే హోర్ముజ్ జలసంధిని తెరిచేందుకు నిరాకరించింది. వారి వైఖరి వల్ల ప్రపంచవ్యాప్తంగా బాధ, అశాంతి నెలకొన్నాయి' అని ట్రంప్ తన 'ట్రూత్ సోషల్' ఖాతాలో మండిపడ్డారు.
ట్రంప్ తాజా ఆదేశాల ప్రకారం అమెరికా నౌకాదళం ఇకపై హోర్ముజ్ జలసంధిలోకి వెళ్లే సముద్ర రాకపోకలను నియంత్రించే అవకాశం ఉంది. అంతర్జాతీయ జలాల్లో ప్రయాణిస్తూ, ఇరాన్‌కు 'ట్రాన్సిట్ టోల్' (పన్నులు) చెల్లించే ఏ నౌకనైనా అమెరికా మిలిటరీ అడ్డుకునే యత్నం చేయనుంది. అరేబియా సముద్రంలో ఇప్పటికే సిద్ధంగా ఉన్న USS గెరాల్డ్ ఫోర్డ్, USS అబ్రహం లింకన్ విమాన వాహక నౌకలు ఈ దిగ్బంధనంలో కీలక పాత్ర పోషిస్తాయా అన్నది తేలాల్సి ఉంది.
మరోవైపు ఇరాన్ విదేశాంగ శాఖ ప్రతినిధి ఎస్మాయిల్ బాకాయీ ఈ పరిణామాలపై స్పందించారు. అమెరికా పెడుతున్న 'అహేతుకమైన డిమాండ్ల' వల్లే చర్చలు ఆగిపోయాయని ఆయన ఆరోపించారు. దేశ ప్రయోజనాల కోసం దౌత్యంతో పాటు ఏ రకమైన సాధనాలనైనా ఉపయోగిస్తామని స్పష్టం చేశారు. యుద్ధ నష్టపరిహారం, ఆంక్షల తొలగింపు వంటి విషయాల్లో తాము రాజీపడే ప్రసక్తే లేదని ఇరాన్ తేల్చిచెప్పింది.
హోర్ముజ్ జలసంధి అనేది ప్రపంచ చమురు సరఫరాలో దాదాపు 20 శాతం వాటా కలిగిన అత్యంత కీలకమైన మార్గం. ఇక్కడ అమెరికా విధిస్తున్న దిగ్బంధనం వల్ల ముడి చమురు ధరలు ఆకాశాన్ని తాకే ప్రమాదం ఉంది. ఇప్పటికే చమురు ధరలు బ్యారెల్‌కు 110 డాలర్ల దిశగా పరుగులు తీస్తున్నాయి. ట్రంప్ తీసుకున్న ఈ కఠిన నిర్ణయం ఇరాన్‌ను ఆర్థికంగా దెబ్బతీయడమే లక్ష్యంగా కనిపిస్తోంది. అయితే, ఇరాన్ కూడా వెనక్కి తగ్గకపోవడంతో గల్ఫ్ ప్రాంతంలో ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న ఆందోళన ప్రపంచ దేశాల్లో వ్యక్తమవుతోంది.
ఇవి కూడా చదవండి
ఇజ్రాయెల్‌కు తుర్కియే వార్నింగ్.. దాడి చేయటం మా కర్తవ్యం..
చైనాకు ట్రంప్ వార్నింగ్.. స్పందించిన ఎంబసీ..