భారత్‌కు శుభాకాంక్షలు తెలిపిన డొనాల్డ్ ట్రంప్
ABN , Publish Date - Jan 26 , 2026 | 05:02 PM
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతదేశ ప్రజలకు 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. న్యూఢిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయం నుంచి ట్రంప్ పేరుతో ఈ సందేశం వచ్చింది.
ఇంటర్నెట్‌డెస్క్: భారత 77వ గణతంత్ర దినోత్సవం(Republic Day) సందర్భంగా ప్రపంచ దేశాల నుంచి శుభాకాంక్షలు సందేశాలు వెల్లువెత్తుతున్నాయి. చైనా, రష్యా, ఫ్రాన్స్, ఈయూ, ఇరాన్, నేపాల్, ఆస్ట్రేలియా, భూటాన్ తదితర దేశాల నుంచి ఇప్పటికే శుభాకాంక్షలకు సంబంధించిన సందేశాలొచ్చాయి. భారత్‌తో బంధాన్ని మరింత బలోపేతం చేసుకుంటామని ఈ సందర్భంగా ఆయా దేశాధినేతలు, మంత్రులు పేర్కొన్నారు. ఈ క్రమంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా భారత ప్రభుత్వానికి, దేశ ప్రజలకు 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. న్యూఢిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయం నుంచి ట్రంప్ పేరుతో ఈ సందేశం వచ్చింది. రెండు దేశాల మధ్య ఉమ్మడి అంశాలను హైలెట్ చేస్తూ, ఇరు దేశాలు వారి ప్రజాస్వామ్య సంప్రదాయాల ద్వారా ఐక్యంగా ఉన్నాయని ట్రంప్ చెప్పారు.
'77వ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నందున భారత ప్రభుత్వానికి, ప్రజలకు అమెరికా ప్రజల తరఫున నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. అమెరికా, భారత్ ప్రపంచంలోని పురాతనమైన అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాలుగా చారిత్రాత్మక బంధాన్ని పంచుకున్నాయి' అని ట్రంప్ పేర్కొన్నారు. ఈ సందేశంతో పాటు గతేడాది అమెరికా పర్యటనలో ప్రధాని మోదీ, డొనాల్డ్ ట్రంప్ కలిసిన ఫొటోలను న్యూఢిల్లీలోని యూఎస్ ఎంబసీ పంచుకుంది.
ఇటీవలి కాలంలో అమెరికా సుంకాల పెంపుతో ఇరు దేశాల మధ్య సంబంధాలు కాస్త సున్నితంగా మారిన సంగతి తెలిసిందే. రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేయడంతో 25 శాతం జరిమానా సహా కొన్ని భారతీయ వస్తువులపై 50 శాతం సుంకాలు విధించాలని అమెరికా నిర్ణయం తీసుకుంది. ఈ చర్య అన్యాయమని భారత విదేశాంగ శాఖ విమర్శించింది. దీనిపై అమెరికా స్పందిస్తూ.. తమ ఆర్థిక ప్రయోజనాలను కాపాడుకోవడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని తేల్చి చెప్పింది. ఇలా ఇరుదేశాల మధ్య దౌత్యపరమైన సంబంధాలు స్వల్పంగా దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలో ట్రంప్ స్వయంగా భారతదేశ ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలపడం గమనార్హం.
అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో కూడా భారత ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. 'ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం భారత్, ప్రపంచంలో పురాతన ప్రజాస్వామ్య దేశం యూఎస్‌ల మధ్య చరిత్రాత్మక సంబంధం కొనసాగుతోంది. రక్షణ, ఇంధనం వంటి అభివృద్ధి చెందుతున్న రంగాల్లో ఇరుదేశాల మధ్య సహకారం మంచి ఫలితాలను ఇస్తుందని ఆశిస్తున్నాం. రాబోయే రోజుల్లో ఉమ్మడి లక్ష్యాలను ముందుకు తీసుకెళ్లేందుకు ఎదురుచూస్తున్నాం’ అని ఆయన తెలిపారు.
ఇవి కూడా చదవండి..
మీ కళ్లు షార్ప్ అయితే.. ఈ ఫొటోలో దాక్కున్న ముగ్గురిని 10 సెకెన్లలో కనిపెట్టండి..
వార్నీ.. వాషింగ్ మెషిన్‌ను ఇలా కూడా వాడతారా.. గోధుమలను ఎలా ఆరబెడుతోందో చూడండి..