Share News

ఇరాన్‌కు చైనా ఆయుధాలు ఇస్తే తీవ్ర నిరాశ చెందుతా: ట్రంప్

ABN , Publish Date - Jul 30 , 2026 | 06:24 AM

ఇరాన్‌కు చైనా ఆయుధాలను విక్రయిస్తే తాను తీవ్ర నిరాశకు గురవుతానని అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. జిన్‌పింగ్ గతంలో తనకు స్వయంగా హామీ ఇచ్చారని, ఆ మాటపై నిలబడతారని ఆశిస్తున్నట్లు చెప్పారు.

ఇరాన్‌కు చైనా ఆయుధాలు ఇస్తే తీవ్ర నిరాశ చెందుతా: ట్రంప్
Trump Warns China Against Arming Iran

వాషింగ్టన్ డీసీ, జులై 30: ఇరాన్‌కు చైనా ఆయుధాలను విక్రయిస్తే తాను తీవ్ర నిరాశకు గురవుతానని అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. ఇరాన్‌కు ఎలాంటి సైనిక ఆయుధాలు సరఫరా చేయబోమని చైనా అధ్యక్షుడు షి జిన్‌పింగ్ గతంలో తనకు స్వయంగా హామీ ఇచ్చారని, ఆ మాటపై ఆయన నిలబడతారని ఆశిస్తున్నట్లు చెప్పారు.

ఓవల్ ఆఫీస్‌లో విలేకరులతో మాట్లాడిన సందర్భంలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. రాబోయే కొన్ని వారాల్లో ఇరాన్, చైనా నుంచి దాదాపు 400 భుజాలపై ఉంచి ప్రయోగించే క్షిపణులను (Shoulder-fired missiles) అందుకోనుందనే వార్తల ఆధారంగా విలేకరులు ప్రశ్నించగా ట్రంప్ పై విధంగా స్పందించారు.

'ఇది నిజంగా ఆశ్చర్యపరిచే విషయమే అవుతుంది. ఇరాన్‌కు ఆయుధాలు ఇవ్వబోమని షి జిన్‌పింగ్ నాకు చాలా స్పష్టంగా చెప్పారు. ఒకవేళ అలా చేస్తే నేను తీవ్రంగా నిరాశ చెందుతానని కూడా ఆయనకు తెలుసు' అని ట్రంప్ పేర్కొన్నారు.


ఇటీవల సీఎన్‌ఎన్ (CNN) ప్రచురించిన ఇంటెలిజెన్స్ నివేదిక ప్రకారం, విదేశీ మిత్రదేశాల సహకారంతో తన వైమానిక రక్షణ వ్యవస్థలను బలోపేతం చేసుకునేందుకు ఇరాన్ ప్రయత్నిస్తోందని, చైనా కూడా కొత్త ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌లను పంపేందుకు సిద్ధమవుతోందని తెలిపింది. అయితే దీనిపై ట్రంప్ స్పందిస్తూ, చైనా, రష్యాలు ఇరాన్‌కు ఆయుధాలు విక్రయించవద్దని గతంలోనే హెచ్చరించినట్లు గుర్తుచేశారు.

తన 'ట్రూత్ సోషల్' (Truth Social) సోషల్ మీడియా వేదికగా స్పందించిన ట్రంప్.. చైనా, రష్యాలు ప్రస్తుతం ఇరాన్‌కు ఎలాంటి సైనిక సహాయం అందించడం లేదని తాను భావిస్తున్నట్లు తెలిపారు. 'ఒకవేళ వారు ఆ పని చేస్తే అది వారికి చాలా చెడు పరిణామాలకు దారితీస్తుంది. అది ఎంతమాత్రం వారి ప్రయోజనాలకు అనుకూలమైనది కాదు' అని ట్రంప్ పేర్కొన్నారు.


జిన్‌పింగ్, పుతిన్ హామీల పైనే నమ్మకం

గత మే నెలలో బీజింగ్‌లో జరిగిన సమావేశంలో, ఏ పరిస్థితిలోనూ ఇరాన్‌కు ఆయుధాలు ఇవ్వబోమని షి జిన్‌పింగ్ స్పష్టమైన హామీ ఇచ్చారని ట్రంప్ తెలిపారు. 'మా మధ్య ఉన్న సంబంధాల దృష్ట్యా నేను ఆయన మాటను నమ్ముతున్నాను' అని ట్రంప్ చెప్పారు.

అలాగే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కూడా ఇదే తరహా హామీ ఇచ్చారని ట్రంప్ వెల్లడించారు. ఉక్రెయిన్ తో యుద్ధం జరుగుతున్నప్పటికీ, అమెరికా ఆయుధ విధానాన్ని పుతిన్ అర్థం చేసుకున్నారని తెలిపారు. 'నేను నేరుగా ఉక్రెయిన్‌కు ఆయుధాలు అమ్మను, కేవలం నాటో (NATO) దేశాలకే విక్రయిస్తాను. వారు పూర్తి ధర చెల్లించి కొనుగోలు చేస్తారు. ఆ తర్వాత ఆ ఆయుధాలను వారు ఎలా పంపిణీ చేస్తారో నాకు తెలియదు' అని పుతిన్‌కి చెప్పినట్టు ట్రంప్ గుర్తుచేసుకున్నారు. ఇద్దరు అగ్రనాయకుల వ్యక్తిగత హామీలపైనే తాను ఆధారపడుతున్నానని స్పష్టం చేస్తూ, 'వారు నన్ను నిరాశపరుస్తారని నేను అనుకోవడం లేదు' అని ట్రంప్ ఈ అంశాన్ని ముగించారు.


ఇవి కూడా చదవండి

కాళేశ్వరం నుంచి నీటి చుక్క వాడకుండా అత్యధిక ధాన్యం పండించిన తెలంగాణ: ఉత్తమ్

ప్రజల భద్రతతోపాటు వన్యప్రాణుల సంరక్షణే లక్ష్యం: పవన్ కల్యాణ్

Updated Date - Jul 30 , 2026 | 07:06 AM