Share News

రేపు ఇరాన్‌తో దోహాలో చర్చలు: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్

ABN , Publish Date - Jun 29 , 2026 | 07:19 PM

హోర్ముజ్ జలసంధి విషయంలో ఇరుపక్షాల మధ్య ఇటీవల జరిగిన సైనిక ఉద్రిక్తతల వేళ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆసక్తికర ప్రకటన చేశారు. అమెరికాతో సమావేశం కావాలని ఇరాన్ అభ్యర్థించిందని, రేపు దోహాలో టెహ్రాన్‌తో చర్చలు జరుగుతాయని చెప్పారు.

రేపు ఇరాన్‌తో దోహాలో చర్చలు: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్
Trump Says US-Iran Talks to Be Held in Doha Despite Tehran's Denial

వాషింగ్టన్ డీసీ (అమెరికా), జూన్ 29: హోర్ముజ్ జలసంధి విషయంలో ఇరుపక్షాల మధ్య ఇటీవల జరిగిన సైనిక ఉద్రిక్తతల వేళ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆసక్తికర ప్రకటన చేశారు. అమెరికాతో సమావేశం కావాలని ఇరాన్ అభ్యర్థించిందని, రేపు దోహాలో టెహ్రాన్‌తో చర్చలు జరుగుతాయని చెప్పారు. అయితే, మరోవైపు, ఈ వారం ఎలాంటి సాంకేతిక సమావేశాలు షెడ్యూల్ చేయలేదని ఇరాన్ అధికారులు చెబుతున్నారు.Trump.jpgతన సోషల్ మీడియా మాధ్యమం ట్రూత్ సోషల్‌లో ట్రంప్ ఈ విషయాన్ని వెల్లడించారు.'ఇరాన్ ఒక సమావేశాన్ని అభ్యర్థించింది. అది రేపు దోహాలో జరుగుతుంది' అని మాత్రమే ట్రంప్ తన పోస్ట్ లో పేర్కొన్నారు. అంతర్జాతీయ వార్తా కథనాల ప్రకారం, వ్యూహాత్మక జలమార్గం హోర్ముజ్ జలసంధి గుండా జరిగే సముద్ర రవాణాపై నియంత్రణ కోసం ఇరుపక్షాలు కొత్తగా దాడులు చేసుకున్న నేపథ్యంలో ఈ వివాదాన్ని పరిష్కరించుకోవడానికి ఖతార్‌లో ఈ సమావేశం జరగనుందని వెల్లడించాయి. రేపు (మంగళవారం) జరగనున్న సమావేశాన్ని అమెరికా అధికారులు కూడా ధృవీకరించారు.


అయితే, సాంకేతిక చర్చలు తక్షణమే ప్రారంభం కానున్నాయని సూచిస్తున్న నివేదికలను ఇరాన్ అధికారులు తోసిపుచ్చారు. ఇరాన్ ప్రభుత్వ ప్రసార సంస్థ, ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ బ్రాడ్‌కాస్టింగ్ (IRIB) ప్రకారం, పశ్చిమాసియాలో సంఘర్షణను అంతం చేసే లక్ష్యంతో కుదిరిన 14-సూత్రాల అవగాహన ఒప్పందం (Memorandum of Understanding) పరిధిలో ఈ వారం ఎలాంటి సాంకేతిక వర్కింగ్ గ్రూప్ సమావేశాలు షెడ్యూల్ చేయలేదని ఇరాన్ న్యాయ, అంతర్జాతీయ వ్యవహారాల ఉప విదేశాంగ మంత్రి కాజెమ్ గరీబాబాది తెలిపారు.

శాంతి చర్చలకు మధ్యవర్తిత్వం వహిస్తున్న ఖతార్‌తో సాధారణ సంప్రదింపులు ఎప్పుడూ జరుగుతుంటాయని, అయితే దోహాలో ఇప్పుడే సాంకేతిక స్థాయి చర్చలు ప్రారంభమవుతున్నాయంటూ వస్తున్న మీడియా నివేదికలలో ఎలాంటి నిజం లేదని ఆయన పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో రేపు దోహాలో అమెరికా, ఇరాన్ మధ్య చర్చలు జరుగుతాయా, లేదా అన్న అంశంలో సందిగ్ధత నెలకొంది.


ఈ వార్తలనూ చదవండి:

జైపుర్‌లో విషాదం.. గోడ కూలడంతో ముగ్గురు కార్మికుల మృతి

గ్రామాల అభివృద్ధే వికసిత్ భారత్‌కు పునాది: శివరాజ్‌సింగ్

Updated Date - Jun 29 , 2026 | 08:43 PM