Share News

గూగుల్ మ్యాప్స్‌కు నేనే ఫోన్ చేశా.. గల్ఫ్ ఆఫ్ మెక్సికో పేరు మార్పుపై ట్రంప్ వ్యాఖ్యలు..

ABN , Publish Date - Oct 15 , 2026 | 12:43 PM

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గల్ఫ్ ఆఫ్ మెక్సికో పేరును గల్ఫ్ ఆఫ్ అమెరికాగా మార్చాలని తాను స్వయంగా గూగుల్ మ్యాప్స్‌కు ఫోన్ చేసి కోరినట్లు వెల్లడించారు.

గూగుల్ మ్యాప్స్‌కు నేనే ఫోన్ చేశా.. గల్ఫ్ ఆఫ్ మెక్సికో పేరు మార్పుపై ట్రంప్ వ్యాఖ్యలు..
Donald Trump

ఇంటర్నెట్ డెస్క్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గల్ఫ్ ఆఫ్ మెక్సికో పేరును గల్ఫ్ ఆఫ్ అమెరికాగా మార్చాలని తాను స్వయంగా గూగుల్ మ్యాప్స్‌కు ఫోన్ చేసి కోరినట్లు వెల్లడించారు. తాను చెప్పినందుకే గూగుల్ ఆ మార్పు చేసిందని, తన పట్ల గౌరవంతోనే కంపెనీ తన మాట విందని ట్రంప్ పేర్కొన్నారు. అమెరికాలోని అరిజోనా రాష్ట్రంలో బుధవారం జరిగిన ఓ సభలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు (Donald Trump Google Maps).


అమెరికా ప్రభుత్వం అధికారిక భౌగోళిక పేర్ల డేటాబేస్‌లో గల్ఫ్ ఆఫ్ మెక్సికో పేరును గల్ఫ్ ఆఫ్ అమెరికాగా మార్చిన తర్వాత, తమ విధానం ప్రకారం గూగుల్ మ్యాప్స్‌లోనూ మార్పు చేసినట్లు గూగుల్ తెలిపింది. 2025 జనవరి 20న ట్రంప్ రెండోసారి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన రోజునే భౌగోళిక పేర్లను మార్చడానికి సంబంధించిన కార్యనిర్వాహక ఉత్తర్వుపై సంతకం చేశారు. అనంతరం అమెరికా అంతర్గత వ్యవహారాల శాఖ, భౌగోళిక పేర్ల బోర్డు, అమెరికా భూగర్భ సర్వే విభాగం ఈ మార్పును అధికారికంగా అమలు చేశాయి (Gulf of America).


కాగా, ఈ పేరు మార్పు ప్రపంచవ్యాప్తంగా ఒకే విధంగా అమలు కాలేదు (Trump Google call). అమెరికాలోని గూగుల్ మ్యాప్స్ వినియోగదారులకు గల్ఫ్ ఆఫ్ అమెరికా అనే పేరు కనిపిస్తుంది. మెక్సికోలో మాత్రం గల్ఫ్ ఆఫ్ మెక్సికో అనే పేరునే చూపిస్తారు. భారత్ సహా ఇతర దేశాల్లోని వినియోగదారులకు సాధారణంగా రెండు పేర్లూ కనిపిస్తాయి. గూగుల్ తన మ్యాప్స్‌లో ప్రాంతాల పేర్లను చూపించే విధానాన్ని వినియోగదారుడి ప్రాంతాన్ని బట్టి నిర్ణయిస్తుంది. ఈ విధానాన్ని గతంలోనూ వివాదాస్పద భౌగోళిక పేర్ల విషయంలో అనుసరించినట్లు సంస్థ వివరించింది.


ఇవి కూడా చదవండి..

చైనా విడిభాగాలతో హూతీల క్షిపణులు.. ఇజ్రాయెల్, సౌదీ అరేబియాకు ముప్పు తప్పదా..


మరికొంచెం తగ్గిన ధరలు.. ఈ రోజు మీ నగరంలో పసిడి ధరలు ఎలా ఉన్నాయంటే..

Updated Date - Oct 15 , 2026 | 12:49 PM