Share News

న్యూయార్క్‌ అటార్నీ బరిలో తెలుగు మహిళ సరిత కోమటిరెడ్డి

ABN , Publish Date - Nov 03 , 2026 | 05:14 AM

అమెరికా చట్టసభ కాంగ్రెస్‌కు నేడు మిడ్‌-టర్మ్‌ ఎన్నికలు జరగనున్నాయి. అధ్యక్షుడు ట్రంప్‌ పాలనకు రెఫరెండంగా భావిస్తున్న ఈ ఎన్నికల్లో భారతీయ అమెరికన్ల ప్రాబల్యంపై కూడా ఉత్కంఠ నెలకొంది.

న్యూయార్క్‌ అటార్నీ బరిలో  తెలుగు మహిళ సరిత కోమటిరెడ్డి
saritha

  • కృష్ణమోహన్‌ దాసరి

  • డాలస్‌ నుంచి ఆంధ్రజ్యోతి ప్రత్యేక ప్రతినిధి

అమెరికా చట్టసభ కాంగ్రెస్‌కు నేడు మిడ్‌-టర్మ్‌ ఎన్నికలు జరగనున్నాయి. అధ్యక్షుడు ట్రంప్‌ పాలనకు రెఫరెండంగా భావిస్తున్న ఈ ఎన్నికల్లో భారతీయ అమెరికన్ల ప్రాబల్యంపై కూడా ఉత్కంఠ నెలకొంది. అమెరికా కాంగ్రెస్‌లోని ప్రతినిధుల సభలో ఉన్న మొత్తం 435 సీట్లకు, సెనేట్‌లోని 35 స్థానాలతోపాటు 36రాష్ట్రాల గవర్నర్ల పదవులకు ఎన్నికలు జరగనున్నాయి. వీటితోపాటు దేశంలో 50 రాష్ట్రాలుండగా.. వాటిలో 46 రాష్ట్రాల చట్టసభలకు కూడా మంగళవారమే ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికల్లో పోటీచేస్తున్న భార త సంతతి అమెరికన్ల సంఖ్య కూడా గణనీయంగానే ఉంది. కొన్నిచోట్ల ప్రధాన ప్రత్యర్థులిద్దరూ భారతీయ అమెరికన్లే కావడం విశేషం. ఈ మధ్యంతర ఎన్నికల్లో ప్రతిపక్ష డెమోక్రాట్లే విజయం సాధిస్తారని సర్వేలు చెప్తున్నాయి. ఇరాన్‌తో యుద్ధం ప్రారంభమైన తర్వాత అమెరికాలో చమురు, నిత్యావసరాల ధరలు భారీగా పెరగటం సామాన్య ప్రజల్లో రిపబ్లికన్లపై ఆగ్ర హం పెంచింది. ఈ పరిణామాలను పక్కన పెడితే అమెరికా జనాభాలో గణనీయంగా ఉన్న భారతీయ అమెరికన్లు ఈ ఎన్నికలను ఎలా చూస్తున్నారనేది కీలకం. సాధారణంగా భారత సంతతివారు డెమోక్రాట్లకు అనుకూలంగా ఉంటారు. అయితే, కొన్నేళ్లుగా ఈ పరిస్థితి మారుతోంది. డెమోక్రాట్లకు మద్దతిచ్చేవారి సంఖ్య తగ్గుతోంది


బరిలో భారతీయత

అమెరికాలో ప్రతిసారీ ఎన్నికల్లో భారతీయ మూలాలున్నవారు పోటీ చేస్తూనే ఉంటారు. ఈసారి కూడా ట్రంప్‌ మద్దతుతో ఒహాయో గవర్నర్‌ బరిలో నిలిచిన వివేక్‌ రామస్వామి అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. అమీ ఆక్టన్‌తో తలపడుతున్న ఆయన గత అధ్యక్ష ఎన్నికల ప్రచార సమయంలోనే జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు. ఈ ఎన్నికల్లో భారత సంతతికి చెందిన డెమోక్రాట్‌ నాయకులు నలుగురు మళ్లీ బరిలో నిలిచారు. కాలిఫోర్నియా నుంచి రో ఖన్నా, అమీ బేరా, వాషింగ్టన్‌ నుంచి ప్రమీలా జయపాల్‌, వర్జీనియా నుంచి సుహాస్‌ సుబ్రమణ్యం పోటీ చేస్తున్నారు. వీరిలో ఇద్దరికి రిపబ్లికన్‌ ప్రత్యర్థులు కూడా భారత సంతతివారే. రో ఖన్నాతో రితేష్‌ టాండన్‌, ప్రమీలా జయపాల్‌తో నిరవ్‌ సేథ్‌ పోటీపడుతున్నారు. అరిజోనాలో డెమోక్రాటిక్‌ అభ్యర్థి అమీష్‌ షా, రిపబ్లికన్‌ జే ఫీలీ మధ్య పోటీ ఉంది. ఫ్లోరిడా 22వకాంగ్రెస్‌ నియోజకవర్గంలో డెమోక్రాట్‌ అభ్యర్థిగా పియా దండియా, రిపబ్లికన్‌ పార్టీకి చెందిన కేసీ అస్కర్‌తో తలపడుతున్నారు. సంఖ్యాపరంగా భారతీయులు అత్యధికంగా ఉండే రెండో రాష్ట్రం టెక్సాస్‌. యావత్‌ అమెరికాలోని భారత సంతతిలో 12శాతంఇక్కడేఉన్నారు. అయితే, ఈ రాష్ట్రంలో బరిలో ఉన్న భారతీయ సంతతి వారు ఇద్దరే. న్యూయార్క్‌ అటార్నీ జనరల్‌ పదవికి రిపబ్లికన్‌ అభ్యర్థిగా సరిత కోమటిరెడ్డి, మేరీల్యాండ్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ గా డెమోక్రాట్‌ పార్టీ టికెట్‌పై అరుణా మిల్లర్‌, లాస్‌ ఏంజెలిస్‌ మేయర్‌ పదవికి నిత్యా రామన్‌, మైనే గవర్నర్‌ పదవికి డెమోక్రాట్ల తరఫున నీరవ్‌ షా తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. సరిత తల్లిదండ్రులు డాక్టర్‌ హనుమంతరెడ్డి, డాక్టర్‌ గీత తెలంగాణలోని కరీంనగర్‌ జిల్లా నుంచి 1980వ దశకంలో అమెరికాకు వలస వెళ్లారు. అయితే, జనాభా పరంగా అమెరికాలో నివసిస్తున్న భారత సంతతి వ్యక్తులు ఎక్కువే అయినప్పటికీ.. వారిలో ఓటుహక్కు ఉన్నవారి సంఖ్య పరిమితమే.


ప్రతి సీటూ కీలకమే

ప్రస్తుతం దిగువ సభ(హౌస్‌ ఆఫ్‌ రిప్రజెంటేటివ్‌)లో రిపబ్లికన్లకు 218, డెమోక్రాట్లకు 214 స్థానాలు ఉన్నాయి. ఒక స్వతంత్ర సభ్యుడు రిపబ్లికన్లకు మద్దతిస్తున్నారు. రెండు సీట్లు ఖాళీగా ఉన్నాయి. సభలో మెజారిటీ మార్కు 218. రిపబ్లికన్లకు బొటాబొటి మెజారిటీయే ఉంది. ఈ ఎన్నికల్లో డెమోక్రాట్లు ఇప్పుడున్న సీట్లకు మరో నాలుగు అధికంగా గెలుచుకున్నా.. సభ వారి చేతుల్లోకి వస్తుంది. కుక్‌ పొలిటికల్‌ రిపోర్టు అంచనా ప్రకారం ఈ ఎన్నికల్లో డెమోక్రాట్లకు 222 సీట్లలో, రిపబ్లికన్లకు 195 స్థానాల్లో స్పష్టమైన మొగ్గు ఉంది. 100 స్థానాలున్న ఎగువ సభ సెనేట్‌లో ప్రస్తుతం అధికార రిపబ్లికన్లకు 53 సీట్లు ఉండగా, డెమోక్రాట్లకు 47 ఉన్నాయి. వీటిలో ప్రస్తుతం 35 సీట్లకు ఎన్నికలు జరుగుతున్నాయి. దిగువ సభలోని మొత్తం 435 సీట్లకు రెండేళ్లకోసారి ఎన్నికలు జరుగుతాయి. సెనేట్‌లో మాత్రం రెండేళ్లకోసారి మూడింట రెండొంతుల సీట్లకే ఎన్నికలు జరుగుతాయి. ఈ ఎన్నికల్లో డెమోక్రాట్లు సెనెట్‌లో ఇప్పుడున్నవాటికి 4సీట్లు అధికంగా గెలిస్తే ఈ సభ కూడా వారి వశం అవుతుంది. అప్పుడు ట్రంప్‌ దూకుడుకు కళ్లెం వేసే అవకాశం లభిస్తుంది. అమెరికాలో ప్రస్తుతం 22 కోట్ల మంది ఓటర్లున్నారు.

ఈ వార్తలు కూడా చదవండి..

లైంగిక వేధింపుల కేసు.. జేఎన్‌యూ ప్రొఫెసర్ తొలగింపుపై స్టే

ఢిల్లీలో గ్రీన్ క్రాకర్స్ కాల్చేందుకు సుప్రీంకోర్టు అనుమతి

Updated Date - Nov 03 , 2026 | 06:18 AM