సుడాన్‌లో ఘోర ప్రమాదం.. బంగారు గని కూలి 60 మంది మృతి
ABN , Publish Date - Sep 16 , 2026 | 05:40 PM
సూడాన్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. వెస్టె కొర్దోఫ్యాన్ ప్రాంతంలోని ఓ బంగారు గని కుప్పకూలడంతో సుమారు 60 మంది మృతి చెందారు. మరికొందరు శిథిలాల కింద చిక్కుకున్నట్లు సమాచారం.
ఇంటర్నెట్ డెస్క్: సూడాన్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. వెస్టె కొర్దోఫ్యాన్ ప్రాంతంలోని ఓ బంగారు గని కుప్పకూలడంతో సుమారు 60 మంది మృతి చెందారు. మరికొందరు శిథిలాల కింద చిక్కుకున్నట్లు సమాచారం. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఎల్-నుహుద్ పట్టణానికి సమీపంలోని అల్-జరా బంగారు గనిలో మంగళవారం ఒక్కసారిగా గని సొరంగాలు కూలాయి. బుధవారం ఉదయానికి 60 మృతదేహాలను వెలికితీసినట్లు అక్కడి గని కార్మికులు తెలిపారు.
ప్రమాదం జరిగిన వెంటనే తోటి కార్మికులు సహాయక చర్యలు చేపట్టారు. రాత్రంతా సాధారణ పనిముట్లతోనే శిథిలాలను తొలగిస్తూ మృతదేహాలు, ప్రాణాలతో ఉన్నవారి కోసం గాలించారు. అయితే గని లోపల భారీగా మట్టి, రాళ్లు పేరుకుపోవడంతో సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. ‘ఇంకా ఎంతమంది లోపల చిక్కుకున్నారో తెలియదు. మృతదేహాలు లేదా ప్రాణాలతో ఉన్నవారిని బయటకు తీసేందుకు అందరం తీవ్రంగా ప్రయత్నిస్తున్నాం. కానీ మా వల్ల అవ్వడం లేదు. రాళ్లు, మట్టిని తొలగించేందుకు భారీ యంత్రాలు అవసరం’ అని ప్రమాదం నుంచి బయటపడిన కార్మికుడు ఖైర్ అల్ సయ్యద్ జబారా తెలిపాడు. మరో కార్మికుడు అల్-అమీన్ సులేమాన్ మాట్లాడుతూ.. గనిలోని సొరంగాలు ఒకదానికొకటి చాలా దగ్గరగా ఉన్నాయని చెప్పాడు. ఒక సొరంగం కూలితే పక్కనున్నవి కూడా కూలిపోయే ప్రమాదం ఉంటుందని వివరించాడు. ఇదే కారణంగా వరుసగా సొరంగాలు కూలిపోయాయని తెలిపాడు.
యుద్ధం.. ఉపాధి కోల్పోయిన ప్రజలు
సూడాన్‌లో 2023 ఏప్రిల్‌లో సైన్యం, పారామిలటరీ ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్ (RSF) మధ్య యుద్ధం ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ పోరాటానికి ఇరువర్గాలకు బంగారు పరిశ్రమ కూడా ప్రధాన ఆదాయ వనరుగా మారింది. యుద్ధం కారణంగా దేశ ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింది. ఉపాధి అవకాశాలు తగ్గిపోవడంతో పెద్ద సంఖ్యలో ప్రజలు ప్రమాదకరం అని తెలిసినా బంగారం తవ్వకాల వైపు మళ్లుతున్నారు. అధికారిక అనుమతులు లేని ప్రాంతాల్లో తవ్వకాలు సాగిస్తున్నారు. ఇప్పటికే సూడాన్ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. దాదాపు 2 కోట్ల మంది ప్రజలు ఆహార కొరతతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు అంచనా. ఈ పరిస్థితుల్లో బంగారు గనిలో చోటుచేసుకున్న ప్రమాదం మరింత విషాదాన్ని నింపింది.
ఇవి కూడా చదవండి:
యూఎస్ ఓపెన్ ఫైనల్‌లో రాకెట్ బద్దలు.. సబలెంకాకు భారీ జరిమానా
తిరగబెట్టిన గాయం.. ఆసియా క్రీడలకూ వరుణ్ చక్రవర్తి దూరం