Share News

8 యుద్ధాలను ఆపాం.. దావోస్‌లో ట్రంప్ పాతపాట

ABN , Publish Date - Jan 21 , 2026 | 09:10 PM

స్విట్జర్లాండ్‌లోని దావోస్ వేదికగా జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో బుధవారంనాడు ట్రంప్ పాల్గొని ప్రసంగించారు. భారత్-పాక్‌ మధ్య గత ఏడాది జరిగిన ఘర్షణలతో సహా 8 యుద్ధాలను తాను అడ్డుకున్నానని మరోసారి ఆయన తెలిపారు.

8 యుద్ధాలను ఆపాం.. దావోస్‌లో ట్రంప్ పాతపాట
Donald Trump

దావోస్: తన ఏడాది పాలనలో అనేక యుద్ధాలను ఆపానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) మరోసారి ప్రకటించుకున్నారు. స్విట్జర్లాండ్‌లోని దావోస్ (Davos) వేదికగా జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక (WEF) సదస్సులో బుధవారంనాడు ఆయన పాల్గొని ప్రసంగించారు. భారత్-పాక్‌ మధ్య గత ఏడాది జరిగిన ఘర్షణలతో సహా 8 యుద్ధాలను తాను అడ్డుకున్నానని ఆయన తెలిపారు.


గ్రీన్‌లాండ్‌పై అల్టిమేటం

దావోస్ వేదికగా గ్రీన్‌లాండ్‌పై ట్రంప్ అల్టిమేటం ఇచ్చారు. గ్రీన్‌లాండ్ తమకు అవసరమన్నారు. అది భూమి కాదని, భారీ మంచు ఫలకం అని, వ్యూహాత్మక కారణాల పరంగా అమెరికా, చైనా, రష్యా మధ్య ఉందని చెప్పారు. 'గ్రీన్‌లాండ్ మా భూభాగం. దాన్ని మేము కావాలనుకుంటున్నాం. కానీ దానిని స్వాధీనం చేసుకునేందుకు బలం ఉపయోగించం' అని ట్రంప్ అన్నారు. అదే సమయంలో ఆయన బెదిరింపు తరహాలో మాట్లాడారు. 'మీరు అవునని చెబితే అందుకు మేము అభినందిస్తాం. లేదని చెబితే దాన్ని కూడా మేము గుర్తుంచుకుంటాం' అని సమావేశానికి హాజరైన ప్రపంచ నేతలను ఉద్దేశించి ట్రంప్ వ్యాఖ్యానించారు. గ్రీన్‌లాండ్, డెన్మార్ ప్రజల పట్ల తనకు అపార గౌరవం ఉందని, అమెరికా మినహా గ్రీన్‌లాండ్‌ను రక్షించగలిగిన దేశం మరొకటి లేదని అన్నారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత దానిని డెన్మార్‌కు తెలివితక్కువగా అప్పగించామని అన్నారు.


రెండో ప్రపంచ యుద్ధ సమయంలో ఆరు గంటలపాటు జర్మనీ అధీనంలోకి డెన్మార్క్ వెళ్లిందని, అప్పుడు అమెరికా డెన్మార్క్‌కు సాయపడిందని ట్రంప్ గుర్తుచేశారు. 'ఎంతో కష్టం, వ్యయంతో మా బలగాలను పంపాం. డెన్మార్క్ కోసం గ్రీన్‌లాండ్‌లో మా బేస్‌లు ఏర్పాటు చేశాం. దానిని కాపాడేందుకు పోరాడాం' అని చెప్పారు. యుద్ధం తర్వాత గ్రీన్‌లాండ్‌ను డెన్మార్క్‌కు తిరిగి ఇచ్చామని చెప్పారు. ఇది మా తెలివితక్కువతనం కాదా? కానీ ఇప్పుడు వారికి కృతజ్ఞత లేకుండా పోతోందని డెన్మార్క్‌పై విమర్శలు గుప్పించారు.


ఇవి కూడా చదవండి..

యూరప్ సరైన దిశలో వెళ్లడం లేదు.. దావోస్‌ ప్రపంచ ఆర్థిక ఫోరంలో ట్రంప్

గ్రేట్ దావోస్ డివోర్స్.. ట్రంప్ గ్రీన్‌లాండ్ ఎత్తుగడలకు ముగింపు పలకాలని మిత్రదేశాలు నిర్ణయం

Updated Date - Jan 21 , 2026 | 09:19 PM