Share News

గ్రేట్ దావోస్ డివోర్స్.. ట్రంప్ గ్రీన్‌లాండ్ ఎత్తుగడలకు ముగింపు పలకాలని మిత్రదేశాలు నిర్ణయం

ABN , Publish Date - Jan 21 , 2026 | 04:24 PM

దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక ఫోరం వార్షిక సమావేశంలో డెన్మార్క్ ఆర్కిటిక్ ఐలాండ్‌ విషయంలో ఐక్యంగా వ్యవహరించాలని అమెరికా మిత్రదేశాలు కీలక నిర్ణయం తీసుకున్నాయి.

గ్రేట్ దావోస్ డివోర్స్.. ట్రంప్ గ్రీన్‌లాండ్ ఎత్తుగడలకు ముగింపు పలకాలని మిత్రదేశాలు నిర్ణయం
Davos Annual meet

దావోస్: గ్రీన్‌లాండ్ విషయంలో అమెరికా అద్యక్షుడు ట్రంప్ పట్టువిడుపుల్లేని ధోరణి సాగిస్తున్నారు. తమకు మద్దతు ప్రకటించని మిత్రదేశాలపై సుంకాలతో విరుచుకుపడుతున్నారు. దారికి రాకుంటే మరిన్ని సుంకాలు విధిస్తామంటూ హెచ్చరిస్తున్నారు. దీనిపై డెన్మార్, యూరోపియన్ దేశాల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతుండగా, దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక ఫోరం వార్షిక సమావేశంలో డెన్మార్క్ ఆర్కిటిక్ ఐలాండ్‌ విషయంలో ఐక్యంగా వ్యవహరించాలని అమెరికా మిత్రదేశాలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. ట్రంప్ అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే ప్రపంచ రాజకీయ, ఆర్థిక వ్యవస్థలను తలకిందులు చేస్తుండటంపై మండిపడ్డాయి.


బలవంతపు చట్టానికి లొంగొద్దు

నిబంధలు లేని ప్రపంచంలోకి వెళ్తున్నామని ప్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్ ఈ సందర్భంగా విమర్శలు గుప్పించారు. సామాజ్రవాదం మళ్లీ పురుడుపోసుకుంటోందని ట్రంప్ గ్రీన్‌లాండ్ హెచ్చరికలపై వ్యాఖ్యానించారు. బలవంతపు చట్టానికి ఐరోపా సమాఖ్య (ఈయూ) లొంగకూడదన్నారు. అమెరికాకు వ్యతిరేకంగా ఈయూ తన యాటీ-కోఎర్షన్ ఇన్‌స్ట్రుమెంట్‌ను ఉపయోగించాల్సి వస్తుందనేది పిచ్చి ఆలోచన అన్నారు. 'మనం ఎక్కువ వృద్ధిని కోరుకుంటున్నాం. ప్రపంచంలో ఎక్కువ స్థిరత్వాన్ని కోరుకుంటున్నాం. బెదిరింపులకు బదులుగా గౌరవాన్ని, క్రూరత్వానికి బదులుగా చట్టబద్ధతను కోరుకుంటున్నాం' అని అన్నారు. దావోస్ సదస్సు కోసం ట్రంప్ స్విట్జర్లాండ్‌కు చేరుకోవడానికి ముందు మెక్రాన్ ఈ వ్యాఖ్యలు చేశారు. మెక్రాన్ ఈ సమావేశంలో సన్‌గ్లాసెస్‌తో పాల్గొనడం కూడా ఆసక్తికరమైంది. ట్రంప్‌కు ఏదైనా సందేశం ఇస్తున్నారా? అంటూ వరసు పోస్టులు రావడంపై ఆయన వెంటనే స్పందించారు. తనకు చిన్నపాటి కంటి సమస్య ఉందని వెల్లడించారు.


కాగా, యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సెలా వాన్ డెర్ లేయన్ సైతం తన ప్రసంగంలో నేరుగా ట్రంప్ పేరును ప్రస్తావించకుండానే ప్రపంచంలో వస్తున్న భారీ మార్పులకు ప్రతిస్పందించాల్సిన అవసరం ఉందన్నారు. మార్పుల వేగం, పరిణామం యూరప్‌లో స్వాతంత్ర్యంపై ఏకాభిప్రాయాన్ని పెంచిందని పేర్కొన్నారు. నూతన స్వతంత్ర యూరప్‌ను నిర్మించుకునేందుకు ఈ అవకాశాన్ని ఉపయోగించుకునే సమయం వచ్చిందన్నారు.


బెల్జియం ప్రధానమంత్రి బార్డ్ డి వెవర్ మాట్లాడుతూ, 27 సభ్య దేశాల ఐరోపా సమాఖ్య ఒక 'కూడలి' (Cross Roads)లో ఉందని, ఉక్రెయిన్ యుద్ధంలో అమెరికా మద్దతు, ట్రంప్‌ను శాంతింపచేసేందుకు ప్రయత్నించిన తర్వాత ఎదుర్కొన్ని అది దారుణ పరిస్థితి నుంచి ఎలా బయటపడాలో నిర్ణయించుకోవాలన్నారు. గ్రీన్‌లాండ్ విషయంలో సుంకాలు విధిస్తామంటూ ట్రంప్ చేస్తున్న బెదరింపులపై మాట్లాడుతూ.. 'సంతోషకరమైన సేవకుడిగా ఉండటం ఒక విషయం. దుర్భరమైన బానిసగా ఉండటం మరొకటి. ఇప్పుడు మీరు వెనక్కి తగ్గితే గౌరవాన్ని కోల్పోతారు. అందుకే మనం ఏకం కావాలి. మీరు లక్ష్మణ రేఖను దాటారని ట్రంప్‌కు చెప్పాలి. మనం కలిసికట్టుగా నిలబడతామా, విడిపోతామా' అని ఆయన ప్రశ్నించారు.


కెనడా ప్రధానమంత్రి మార్కె కార్నే మరింత ఘాటుగా స్పందించారు. అమెరికా సారథ్యంలోని ప్రపంచ పాలనా వ్యవస్థ ఒక విచ్ఛిన్నాన్ని ఎదుర్కొంటోందన్నారు. మనం పరివర్తనలో కాదు, విచ్ఛిన్నంలో ఉన్నామని పేర్కొన్నారు. అంతర్జాతీయ నియమాల ఆధారిత క్రమం కథ పాక్షికంగా అబద్ధమని మనకు తెలుసునని, బలవంతులు సౌకర్యవంతంగా ఉన్నప్పుడు తమను తాము మినహాయించుకుంటారని, బాధితుడు, నిందితుడి గుర్తింపును బట్టి వేర్వేరు కఠినత్వంతో చట్టాన్ని వర్తింపజేస్తారని అన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఆ దేశాలు సుంకాలను ఆయుధాలుగా వాడుతున్నాయి: కెనడా

ఇరాన్‌కు ట్రంప్ మళ్లీ వార్నింగ్.. కుట్ర చేశారో..

Updated Date - Jan 21 , 2026 | 04:55 PM