ఆ దేశాలు సుంకాలను ఆయుధాలుగా వాడుతున్నాయి: కెనడా
ABN , Publish Date - Jan 21 , 2026 | 03:12 PM
ప్రపంచం మార్పువైపు కాకుండా చిలీకల వైపు వెళ్తోందంటూ కెనడా ప్రధాని మార్క్ కార్నీ సంచలన కామెంట్స్ చేశారు. దావోస్‌లో జరుగుతోన్న ప్రపంచ ఆర్థిక సదస్సులో కార్నీ పాల్గొన్నారు. ఈ సదస్సులో పరోక్షంగా అమెరికాపై కార్నీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇంటర్నెట్ డెస్క్: ప్రపంచం మార్పువైపు కాకుండా చిలీకల వైపు వెళ్తోందంటూ కెనడా ప్రధాని మార్క్ కార్నీ సంచలన కామెంట్స్ చేశారు. దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సులో కార్నీ(Mark Carney) పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు దేశాల విషయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్(US President Donald Trump) ప్రవర్తిస్తున్న తీరు, ఆయన విధిస్తున్న సుంకాలపై కార్నీ పరోక్ష విమర్శలు చేశారు.
ఒకప్పుడు భాగస్వామ్య శ్రేయస్సు కోసం దేశాల మధ్య చేసుకున్న ఆర్థిక ఒప్పందాలను.. బలంగా ఉన్నవారు ఇప్పుడు ఆయుధంగా ఉపయోగించుకుంటున్నారని కార్నీ అన్నారు. బలవంతులు తమ సొంత లాభాల కోసం నిర్ణయాలు తీసుకుంటూ.. అసమానమైన వాణిజ్య నియమాలను అమలుచేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంతకాలం భౌగోళిక పరిస్థితులు, ప్రపంచ దేశాలతో భాగస్వామ్యాలు మాత్రమే దేశాభివృద్ధికి, భద్రతకు హామీ ఇస్తాయని నమ్మేవాళ్లమని.. కానీ అవి ప్రస్తుతం నిజం కాదని కార్నీ అన్నారు.
ప్రపంచ దేశాలు ఒక దేశంపైన ఆధారపడితే ఎటువంటి సమస్యలు వస్తాయో ఇటీవల తలెత్తిన ఆర్థిక, ఇంధన, భౌగోళిక, రాజకీయ సంక్షోభాలే నిదర్శనమని కార్నీ వెల్లడించారు. ముఖ్యంగా ప్రపంచంలోని కొన్ని ప్రధాన శక్తులు.. సుంకాలు, ఆర్థిక వ్యవస్థలు, వాణిజ్య సరఫరా వంటివాటిని ఆయుధంగా ఉపయోగించుకుని ఇతర దేశాలపై ఒత్తిడి తెచ్చి.. బెదిరింపులకు పాల్పడుతున్నాయని తెలిపారు. కెనడా కూడా అనేక చిక్కులు ఎదుర్కొంటోందని గుర్తు చేశారు.
ఇక నుంచైనా ఇతర దేశాలపై ఆధారపడకుండా స్వదేశీ సామర్థ్యాలను బలోపేతం చేసుకునే దిశగా నిర్ణయాలు తీసుకుంటామని తెలిపారు కార్నీ. ప్రపంచ వాణిజ్య సంస్థ, యూఎన్‌వో వంటి పలు ప్రపంచ సంస్థలు బలహీనపడ్డాయన్నారు. అందుకే దేశాలు మరింత స్వతంత్రంగా పని చేయవలసి వస్తుందన్నారు. ఒకే ఆలోచన కలిగిన దేశాలు భాగస్వాములుగా మారి.. సౌకర్యవంతమైన విధానాలను నిర్మించుకోవాలని ప్రపంచ దేశాలకు కెనడా ప్రధాని పిలుపునిచ్చారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఇరాన్‌కు ట్రంప్ మళ్లీ వార్నింగ్.. కుట్ర చేశారో..
పోటాపోటీగా పెరుగుతున్న బంగారం, వెండి ధరలు..