బంగ్లాదేశ్ 'విఫల దేశం'.. హసీనా కుమారుడు సంచలన కామెంట్స్!
ABN , Publish Date - Aug 05 , 2026 | 09:15 PM
బంగ్లాదేశ్ మరో పాకిస్థాన్‌గా మారబోతుందంటూ ఆ దేశ ప్రధాని షేక్ హసీనా కుమారుడు సాజీబ్ వాజెద్ సంచలన కామెంట్స్ చేశాడు. బంగ్లా నుంచి ఉగ్రవాదులు భారత్‌లోకి చొరబడే అవకాశం ఉందని అతడు ఆరోపించాడు.
ఇంటర్నెట్ డెస్క్: బంగ్లాదేశ్ విఫలమైన దేశం కాదు విఫల దేశంగా మారిందంటూ ఆ దేశ మాజీ ప్రధాని, అవామీ లీగ్ అధ్యక్షురాలు షేక్ హసీనా కుమారుడు సాజీబ్ వాజెద్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఇవాళ(బుధవారం) న్యూఢిల్లీలోని సౌత్ ఏషియా ఫారిన్ కరస్పాండెంట్స్ క్లబ్‌లో జరిగిన మీడియా సమావేశంలో వాజెద్ కీలక ప్రసంగం చేశాడు. బంగ్లాదేశ్‌లో అవామీ లీగ్ ప్రభుత్వం దిగిపోయిన తర్వాత తమ దేశంలో ప్రజాస్వామ్యం అణచివేయబడుతోందని, రాజకీయంగా వివక్ష కొనసాగుతోందని అతడు మండిపడ్డాడు.
బంగ్లాదేశ్‌లో తలెత్తిన తాజా పరిణామాలు భారత్‌కు దీర్ఘకాలిక ముప్పుగా పరిణమిస్తాయని సాజీబ్ వాజెద్ హెచ్చరించాడు. తూర్పు సరిహద్దుల్లో బంగ్లాదేశ్ రూపంలో భారత్‌కు 'మరో పాకిస్థాన్' తయారైందని సాజీబ్ ఆందోళన వ్యక్తం చేశాడు. అవామీ లీగ్ హయాంలో జైళ్లలో పెట్టిన వందలాది మంది ఉగ్రవాదులను ప్రస్తుత పాలకులు విడుదల చేశారని తెలిపాడు. 'హిజ్బ్ ఉత్-తహ్రీర్' వంటి తీవ్రవాద సంస్థలు ప్రస్తుతం బంగ్లాదేశ్‌లో బహిరంగంగా కార్యకలాపాలు సాగిస్తున్నాయని అతడు ఆరోపించాడు.
ఇదే పరిస్థితి కొనసాగితే భవిష్యత్తులో ప్రపంచానికి బంగ్లాదేశ్ ఉగ్రవాద కేంద్రంగా మారుతుందని సాజీబ్ హెచ్చరించాడు. అలాగే, ఈ కార్యక్రమానికి కవరేజ్ ఇవ్వకుండా ప్రధాన మీడియా సంస్థలు, వార్తాపత్రికలపై ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు తీవ్ర ఒత్తిడి తెచ్చాయని వాజెద్ విమర్శించారు.
ఈ కార్యక్రమంలో బంగ్లా మాజీ ప్రధాని షేక్ హసీనా కూడా వీడియో లింక్ ద్వారా ప్రసంగించారు. 2024 జూలై-ఆగస్టు నెలల్లో జరిగిన అల్లర్ల గురించి కీలక విషయాలను ప్రస్తావించారు. రెండేళ్ల క్రితం జరిగిన నిరసనలు శాంతియుత విద్యార్థి ఉద్యమాలు కావని, ప్రభుత్వాన్ని కూలదోయాలనే కుట్రతో కొందరు ఉద్దేశపూర్వకంగా హింసాత్మక రాజకీయ అస్త్రంగా మార్చిన ఆందోళనలని హసీనా స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి:
ఫిట్‌నెస్ ఐకాన్‌గా విరాట్ కోహ్లీ.. మార్పు వెనుక అసలు స్టోరీ ఇదే!
వన్డే ప్రపంచకప్-2027 క్వాలిఫైయర్ షెడ్యూల్ ఖరారు..