ఇరాన్‌కు సూపర్‌సోనిక్ క్షిపణులు.. రష్యా రహస్య సాయం చేస్తోందా..
ABN , Publish Date - Sep 02 , 2026 | 09:49 PM
అమెరికా యుద్ధనౌకలు, విమాన వాహక నౌకలను లక్ష్యంగా చేసుకోగల సూపర్‌సోనిక్ క్రూయిజ్ క్షిపణుల అభివృద్ధిలో ఇరాన్‌కు రష్యా రహస్యంగా సహాయం చేస్తున్నట్లు 'ఫైనాన్షియల్ టైమ్స్' ఓ కథనాన్ని వెలువరించింది
ఇంటర్నెట్ డెస్క్: రష్యా, ఇరాన్ మధ్య సైనిక సహకారం మరింత లోతుగా సాగుతున్నట్లు తాజాగా వెలువడిన వార్త సంచలనం రేపుతోంది. అమెరికా యుద్ధనౌకలు, విమాన వాహక నౌకలను లక్ష్యంగా చేసుకోగల సూపర్‌సోనిక్ క్రూయిజ్ క్షిపణుల అభివృద్ధిలో ఇరాన్‌కు రష్యా రహస్యంగా సహాయం చేస్తున్నట్లు 'ఫైనాన్షియల్ టైమ్స్' ఓ కథనాన్ని వెలువరించింది (Russia Iran supersonic missiles).
ఈ రహస్య ప్రాజెక్టుకు సీ430ఎల్ అనే కోడ్‌నేమ్ పెట్టినట్లు సమాచారం. 2023లో ఈ కార్యక్రమం ప్రారంభమైనట్లు 'ఫైనాన్షియల్ టైమ్స్' పేర్కొంది. రష్యాకు చెందిన ప్రముఖ క్షిపణి నిపుణులు ఈ ప్రాజెక్టులో భాగస్వాములయ్యారని తెలిపింది. లీకైన పత్రాలు, ప్రయాణ రికార్డులు, సైనిక పేటెంట్ల ఆధారంగా రష్యా నుంచి ఇరాన్‌కు సాంకేతిక సహకారం అందుతున్నట్లు బయటపడిందని పేర్కొంది. ప్రధానంగా 'రామ్‌జెట్ ప్రొపల్షన్' సాంకేతికతను ఇరాన్‌తో రష్యా పంచుకున్నట్టు సమాచారం (Russia helping Iran missiles).
ఈ టెక్నాలజీని ఉపయోగించే క్షిపణులు శబ్ద వేగం కంటే పలురెట్లు అధిక వేగంతో ప్రయాణించగలవు. తక్కువ ఎత్తులో అధిక వేగంతో ప్రయాణించే క్షిపణులను గుర్తించి అడ్డుకోవడానికి ప్రత్యర్థి రక్షణ వ్యవస్థలకు చాలా తక్కువ సమయం మాత్రమే ఉంటుంది. అందుకే ఈ టెక్నాలజీ అమెరికా నౌకాదళానికి ఆందోళన కలిగించే అంశంగా మారుతోంది (Russia Iran military cooperation).
రష్యా సాంకేతిక సహకారంతో ఇరాన్ సూపర్‌సోనిక్ యాంటీ-షిప్ క్షిపణులను అభివృద్ధి చేయగలిగితే, పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో ఉన్న అమెరికా యుద్ధనౌకలకు కొత్త ముప్పు ఏర్పడే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. రిపోర్టుల ప్రకారం, ఇరాన్ ఇప్పటికే రామ్‌జెట్ ప్రొపల్షన్ (Ramjet technology) వ్యవస్థను తయారు చేసి పరీక్షించింది. అయితే, రష్యా సహకారంతో రూపొందిన సూపర్‌సోనిక్ క్రూయిజ్ క్షిపణులు ప్రస్తుతం ఇరాన్ సైనిక సేవల్లోకి ప్రవేశించినట్లు ఎలాంటి ఆధారాలూ లేవు.
ఈ వార్తలనూ చదవండి:
ఉక్రెయిన్‌పై రష్యా దాడిలో జగిత్యాల వాసి మృతి
వియన్నా మ్యూజియంలో భారీ దోపిడీ.. రూ.38 కోట్ల విలువైన వజ్రాల హారం చోరీ..