Share News

కీవ్‌పై రష్యా డ్రోన్ దాడి.. 27 మంది మృతి

ABN , Publish Date - Aug 29 , 2026 | 04:00 PM

ఉక్రెయిన్ రాజధాని కీవ్‌ శివారులో రష్యా డ్రోన్ దాడి తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. బుచా జిల్లాలోని ఓ గిడ్డంగిపై జరిగిన దాడిలో భారీగా మంటలు చెలరేగడంతో పాటు పేలుళ్లు సంభవించాయి. ఈ ఘటనలో 27 మంది మృతి చెందారు.

కీవ్‌పై రష్యా డ్రోన్ దాడి.. 27 మంది మృతి
Russia drone attack

ఇంటర్నెట్ డెస్క్: ఉక్రెయిన్ రాజధాని కీవ్‌ శివారులో రష్యా డ్రోన్ దాడి తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. బుచా జిల్లాలోని ఓ గిడ్డంగిపై జరిగిన దాడిలో భారీగా మంటలు చెలరేగడంతో పాటు పేలుళ్లు సంభవించాయి. ఈ ఘటనలో 27 మంది మృతి చెందారు. దాదాపు 42 మంది గాయపడినట్లు అధికారులు వెల్లడించారు. దాడి ప్రాంతం నుంచి వందలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ప్రాంతీయ గవర్నర్‌ టిముర్‌ తకాచెంకో శనివారం టెలిగ్రామ్‌ ద్వారా ఈ వివరాలను వెల్లడించారు. దాడి జరిగిన ప్రాంతం నుంచి 380 మందికి పైగా ప్రజలను తరలిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే 200 మందికి పైగా సురక్షిత ప్రాంతాలకు చేరుకున్నారని.. వారిలో చిన్నారులు కూడా ఉన్నారని చెప్పారు.


భారీగా పేలుళ్లు.. ఎగసిపడిన మంటలు

బుచా జిల్లాలోని మైలా గ్రామంలో శుక్రవారం రాత్రి 8 గంటల తర్వాత ఈ దాడి జరిగినట్లు అధికారులు తెలిపారు. డ్రోన్ దాడి అనంతరం గిడ్డంగిలో మంటలు చెలరేగాయని.. అవి పేలుళ్లతో మరింత తీవ్రంగా మారాయని గవర్నర్‌ పేర్కొన్నారు. దాడి అనంతరం గిడ్డంగిలో పేలుడు పదార్థాలను నిల్వ చేయడం చట్టబద్ధమేనా? అందుకు అవసరమైన అనుమతులు ఉన్నాయా? అనే అంశాలపై ఉక్రెయిన్‌ ప్రాసిక్యూటర్‌ కార్యాలయం దర్యాప్తు ప్రారంభించింది. పేలుడు పదార్థాలు, ఇతర ప్రమాదకర సామగ్రిని అక్కడ నిల్వ చేసేందుకు సంస్థకు అవసరమైన అనుమతులు, ప్రభుత్వ ఆమోదాలు ఉన్నాయా అనే విషయాన్ని కూడా పరిశీలించనున్నట్లు అధికారులు తెలిపారు.


ఆ తప్పులే మళ్లీ చేస్తున్నారు..

గత జులైలో కీవ్‌ సమీపంలోని విష్నేవ్‌లోని ఓ ఆయుధాల గిడ్డంగిపై జరిగిన ఘోర దాడిని ఉక్రెయిన్‌ ప్రధాని సెర్గీ కొరెట్‌స్కీ గుర్తుచేశారు. ఆ ఘటనలో ప్రభుత్వ రంగ సంస్థ భద్రతా నిబంధనలు పాటించలేదని దర్యాప్తులో తేలినట్లు తెలిపారు. ‘యుద్ధం ప్రారంభమై ఏళ్లు గడుస్తున్నా.. మళ్లీ చేసిన తప్పులు చేయడం నేరపూరిత నిర్లక్ష్యమే. బాధ్యులెవరైనా సరే కఠినంగా శిక్షించాలి. ఇలాంటి ఘటనలు మరోసారి జరగకుండా చర్యలు తీసుకోవాలి’ అని ఆయన పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

సీఎన్‌జీ ధరలకు మళ్లీ రెక్కలు.. కిలోకు రూ.3.89 పెంపు..

నేపాల్ వరదలు.. రోజుల తర్వాత దొరికిన చనిపోయారని అనుకున్న చిన్నారులు..

Updated Date - Aug 29 , 2026 | 04:12 PM