నేపాల్ వరదలు.. రోజుల తర్వాత దొరికిన చనిపోయారని అనుకున్న చిన్నారులు..
ABN , Publish Date - Aug 29 , 2026 | 11:10 AM
నేపాల్‌లో ఇటీవల సంభవించిన భారీ వరదలకు 580 మంది మృతిచెందగా, సుమారు 2,500 మంది గల్లంతయ్యారు. ఇదే సమయంలో ఓ తల్లి తన ఇద్దరు కుమారులు చనిపోయారని భావించి గుండెలు పగిలేలా రోదించింది. రోజుల తర్వాత వారిద్దరూ ప్రాణాలతోనే ఉన్నారని తెలుసుకుని ఊపిరి పీల్చుకుంది.
ఖాఠ్మాండూ: నేపాల్‌లో ఇటీవల సంభవించిన భారీ వరదలకు 580 మంది మృతిచెందగా, సుమారు 2,500 మంది గల్లంతయ్యారు. ఎంతో మంది నిరాశ్రయులయ్యారు. ఎన్నో కుటుంబాలు తమ వారిని కోల్పోయి కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నాయి. ఇదే సమయంలో ఓ తల్లి తన ఇద్దరు కుమారులు చనిపోయారని భావించి గుండెలు పగిలేలా రోదించింది. రోజుల తర్వాత వారిద్దరూ ప్రాణాలతోనే ఉన్నారని తెలుసుకుని ఊపిరి పీల్చుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వార్త ఇప్పుడు పలువురిని కంటతడి పెట్టిస్తోంది.
రాసువా జిల్లాకు చెందిన మట్టి మాయా తమాంగ్ (28) అనే మహిళకు ఇద్దరు కుమారులు ఉన్నారు. వారిలో పెద్దవాడు జోయల్ ఘలే (8). బుధవారం ఉదయం వారిద్దరూ పాఠశాలకు వెళ్లగా.. కొద్దిసేపటికే భారీ శబ్దం వినిపించడంతో ఇంటి నుంచి బయటకు వచ్చిన తమాంగ్‌కు భయానక దృశ్యం కనిపించింది. వరద నీరు, బురద, రాళ్లు భారీగా ప్రవహిస్తూ ఆ ప్రాంతాన్ని ముంచెత్తాయి. ఇదే క్రమంలో పాఠశాల భవనాన్నీ వరద నీరు ధ్వంసం చేసింది. పిల్లలు వరదల్లో కొట్టుకుపోయి ఉంటారని భావించిన తమాంగ్.. వారిని వెతుక్కుంటూ పలు సహాయక శిబిరాలు తిరిగింది. అయినా వారి ఆచూకీ మాత్రం ఎక్కడా దొరకలేదు. దీంతో కుమారులిద్దరూ చనిపోయారని భావించి గుండెలు పగిలేలా రోదించింది.
అయితే చిన్నారి జోయల్ ప్రాణాలతో బయటపడ్డాడు. వరద సమయంలో ఓ స్నేహితుడితో కలిసి పాఠశాల నుంచి అడవిలోకి పారిపోయాడు. వరద నీటి నుంచి తప్పించుకునేందుకు చెట్టు ఎక్కాడు. ఈ క్రమంలో అతని కాలు విరిగి తీవ్రంగా గాయపడ్డాడు. చేతులు, ముఖానికీ గాయాలయ్యాయి. గురువారం నాడు బాలుడిని గుర్తించిన పోలీసులు.. నువాకోట్ జిల్లాలోని 15 పడకల చక్ర దేవ్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం ఖాఠ్మాండూ ఆస్పత్రికి తరలించారు. అయితే, ఓ జర్నలిస్టు సహాయంతో జోయల్ ఆచూకీని తమాంగ్ గుర్తించింది. వెంటనే ఆస్పత్రికి చేరుకుని కుమారుడిని కలుసుకుంది.
జోయల్‌ను చూసే వరకూ అతను బతికే ఉన్నాడన్న విషయాన్ని తమాంగ్ నమ్మలేకపోయింది. ఒక్కసారిగా కుమారుడిని చూసి కన్నీరుమున్నీరుగా విలపించింది. అప్పటికే చిన్న కుమారుడు కూడా దొరకడంతో కథ సుఖాంతమైంది.
ఈ వార్తలు కూడా చదవండి
సీఎన్‌జీ ధరలకు మళ్లీ రెక్కలు.. కిలోకు రూ.3.89 పెంపు..
నేపాల్‌కు పొంచి ఉన్న మరో ప్రమాదం.. కొత్తగా రెండు హిమ సరస్సుల గుర్తింపు..