ఏప్రిల్ 1 నుంచి పెట్రోల్ ఎగుమతులపై రష్యా నిషేధం
ABN , Publish Date - Mar 28 , 2026 | 08:38 AM
ప్రపంచ ఇంధన మార్కెట్‌లో కీలక పరిణామం చోటుచేసుకుంది. రష్యా ప్రభుత్వం ఏప్రిల్ 1, 2026 నుంచి పెట్రోల్ (Gasoline) ఎగుమతులపై పూర్తిస్థాయి నిషేధాన్ని విధిస్తున్నట్లు ప్రకటించింది.
ఆంధ్రజ్యోతి, మార్చి 28: ప్రపంచ ఇంధన మార్కెట్‌లో కీలక పరిణామం చోటుచేసుకుంది. రష్యా ప్రభుత్వం ఏప్రిల్ 1 నుంచి పెట్రోల్ (Gasoline) ఎగుమతులపై పూర్తిస్థాయి నిషేధాన్ని విధిస్తున్నట్లు ప్రకటించింది. పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతల వల్ల అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరలు హెచ్చుతగ్గులకు లోనవుతున్న నేపథ్యంలో.. తమ దేశీయ అవసరాలకు ప్రాధాన్యత ఇచ్చేందుకు రష్యా ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.
రష్యా ఉప ప్రధాని అలెగ్జాండర్ నోవాక్ (Alexander Novak) నేతృత్వంలో జరిగిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. అంతర్జాతీయంగా చమురు ధరలు పెరుగుతున్నప్పటికీ, రష్యాలోని సామాన్య ప్రజలపై ఆ ప్రభావం పడకుండా దేశీయ పెట్రోల్ ధరలను స్థిరీకరించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆయన ప్రకటించారు. రష్యా అంతర్గత మార్కెట్‌కు నిరంతరాయంగా ఇంధన సరఫరా జరిగేలా చూడటం.. రానున్న వ్యవసాయ సీజన్‌లో ప్రారంభమయ్యే సాగు పనుల కోసం రైతులకు ఇంధన కొరత లేకుండా చేయడం దీని ఉద్దేశ్యంగా చెప్పుకొచ్చారు. ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య యుద్ధం వల్ల అంతర్జాతీయ చమురు సరఫరా వ్యవస్థలో అస్థిరత ఏర్పడటం కూడా దీనికి ఒక కారణమని ఉప ప్రధాని పేర్కొన్నారు.
రష్యా ఇంధన మంత్రిత్వ శాఖ నివేదిక ప్రకారం, ప్రస్తుతం రష్యాలో పెట్రోల్, డీజిల్ నిల్వలు తగినంతగా ఉన్నాయి. చమురు శుద్ధి కర్మాగారాలు పూర్తి సామర్థ్యంతో పనిచేస్తున్నాయి. మార్చి 2025 నాటి ఉత్పత్తి స్థాయిలతో పోలిస్తే ప్రస్తుతం దేశీయ సరఫరా నిలకడగా ఉంది. ఈ నిషేధం ప్రధానంగా పెట్రోల్ ఉత్పత్తిదారులు, ఎగుమతిదారులకు వర్తిస్తుంది. గతంలో కేవలం ట్రేడర్లపై ఉన్న పరిమితులను ఇప్పుడు తయారీ కంపెనీలకు కూడా విస్తరించారు.
ప్రపంచంలోని అతిపెద్ద చమురు ఉత్పత్తిదారులలో రష్యా ఒకటి. రష్యా తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ఐరోపా, ఆసియాలోని కొన్ని దేశాల్లో పెట్రోల్ ధరలు పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అయితే, రష్యా తన మిత్రదేశాలకు, అంతర్-ప్రభుత్వ ఒప్పందాల ప్రకారం చేసే సరఫరాలకు ఈ నిషేధం నుంచి మినహాయింపు ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఈ వార్తలు కూడా చదవండి:
త్వరలో కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ!
Read Latest Telangana News and National News