Share News

మార్కెట్‌కు చమురు మంట

ABN , Publish Date - Mar 28 , 2026 | 04:10 AM

పశ్చిమాసియాలో యుద్ధం ఇప్పట్లో ముగిసే అవకాశాలు కన్పించకపోవడంతో ముడి చమురు ధరలు మళ్లీ ఎగబాకాయి. బ్రెంట్‌ క్రూడాయిల్‌ బ్యారెల్‌ ఒక దశలో 110 డాలర్లు దాటేసింది.

మార్కెట్‌కు చమురు మంట

  • మళ్లీ కుప్పకూలిన స్టాక్‌ సూచీలు

  • సెన్సెక్స్‌ 1,690 పాయింట్లు పతనం

  • 74,000 దిగువకు జారిన సూచీ

  • 23,000 స్థాయిని కోల్పోయిన నిఫ్టీ

  • రూ.9 లక్షల కోట్ల సంపద ఆవిరి

ముంబై: పశ్చిమాసియాలో యుద్ధం ఇప్పట్లో ముగిసే అవకాశాలు కన్పించకపోవడంతో ముడి చమురు ధరలు మళ్లీ ఎగబాకాయి. బ్రెంట్‌ క్రూడాయిల్‌ బ్యారెల్‌ ఒక దశలో 110 డాలర్లు దాటేసింది. వార్‌, క్రూడ్‌ షాక్‌లతో పాటు రూపాయి కొత్త కనిష్ఠానికి పతనం, విదేశీ సంస్థాగత పెట్టుబడుల నిరవధిక ఉపసంహరణ, మార్కెట్‌ దిగ్గజాలైన రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ షేర్ల భారీ క్షీణత కారణంగా భారత ఈక్విటీ సూచీలు మరోసారి కుప్పకూలాయి. సెన్సెక్స్‌ శుక్రవారం ఒక దశలో 1,739.04 పాయింట్లు నష్టపోయింది. చివరికి సూచీ 1,690.23 పాయింట్ల (2.25 శాతం) తగ్గుదలతో 73,583.22 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 486.85 పాయింట్ల (2.09 శాతం) నష్టంతో 22,819.60 వద్ద ముగిసింది. ఈక్విటీ వర్గాల సంపదగా భావించే బీఎ్‌సఈ నమోదిత కంపెనీల మొత్తం మార్కెట్‌ విలువ రూ.8.86 లక్షల కోట్లు తగ్గి రూ.422.15 లక్షల కోట్లకు (4.46 లక్షల కోట్ల డాలర్లు) పడిపోయింది.

  • సెన్సెక్స్‌లోని 30 నమోదిత కంపెనీల్లో 26 నష్టపోయాయి. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, ఇండిగో, బజాజ్‌ ఫైనాన్స్‌ షేర్లు 4 శాతానికి పైగా పతనమై సూచీ టాప్‌ లూజర్లుగా మిగిలాయి. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ 3.26 శాతం క్షీణించింది.

  • బీఎస్ఈలోని మిడ్‌క్యాప్‌ సెలెక్ట్‌ సూచీ 2.12 శాతం, స్మాల్‌క్యాప్‌ సెలెక్ట్‌ ఇండెక్స్‌ 1.77 శాతం నష్టపోయాయి. రంగాలవారీ సూచీలన్నీ నేలచూపులు చూశాయి. పీఎస్‌యూ బ్యాంక్‌ అత్యధికంగా 3.88 శాతం నష్టపోగా.. రియల్టీ 3.10 శాతం తగ్గింది. సర్వీసెస్‌, ఆటో, బ్యాంకెక్స్‌, ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌, కన్స్యూమర్‌ డ్యూరబుల్స్‌ సూచీలు 2 శాతానికి పైగా తగ్గాయి.

  • బీఎస్ఈలో 4,501 కంపెనీల షేర్లు ట్రేడవగా.. 3,615 నష్టపోయాయి. అందులో 906 సంస్థల షేర్లు ఏడాది కనిష్ఠానికి జారుకున్నాయి. 10 లోయర్‌ సర్క్యూట్‌ను తాకాయి.

  • విదేశీ సంస్థాగత ఇన్వెస్టరుల(ఎఫ్‌ఐఐ) నికరంగా రూ.4,367.30 కోట్ల విక్రయాలు చేపట్టగా.. దేశీయ సంస్థాగత పెట్టుబడిదారులు (డీఐఐ) రూ.3,566.15 కోట్ల నికర కొనుగోళ్లు జరిపారు.

  • ఆసియాలోని ఇతర మార్కెట్ల విషయానికొస్తే, జపాన్‌ నిక్కీ సూచీ 0.43 శాతం నష్టపోగా.. హాంకాంగ్‌కు చెందిన హాంగ్‌సెంగ్‌, చైనాకు చెందిన షాంఘై సూచీలు 0.63 శాతం వరకు లాభపడ్డాయి. యూరప్‌, అమెరికా మార్కెట్లూ నష్టాల్లోనే కొనసాగాయి.


గట్టెక్కిన సాయి పేరెంటరల్స్‌ ఐపీఓ

హైదరాబాద్‌ ఫార్మా కంపెనీ సాయి పేరెంటరల్స్‌ ఐపీఓ మొత్తానికి గట్టెక్కింది. శుక్రవారంతో ముగిసిన ఈ ఇష్యూకు కేవలం 1.05 రెట్ల బిడ్లు దక్కాయి. రిటైల్‌ ఇన్వెస్టర్ల నుంచి స్పందన పేలవంగా ఉంది. వీరి నుంచి 12 శాతం సబ్‌స్ర్కిప్షన్‌ మాత్రమే లభించింది.

రిలయన్స్‌కు రూ.87,014 కోట్ల లాస్‌

ప్రపంచంలో అతిపెద్ద చమురు రిఫైనరీ కలిగిన రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ (ఆర్‌ఐఎల్‌) షేరు బీఎస్ఈలో 4.55 శాతం క్షీణించి రూ.1,348.25 వద్దకు జారుకుంది. దాంతో కంపెనీ మార్కెట్‌ విలువ ఒక్కరోజే రూ.87,014 కోట్లు తగ్గి రూ.18.25 లక్షల కోట్లకు పడిపోయింది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు, ముడి చమురు ధరలు మళ్లీ ఎగబాకడంతో పాటు దేశీయంగా ఇంధన లభ్యతను పెంచేందుకు ప్రభుత్వం డీజిల్‌, విమాన ఇంధనం ఎగుమతులపై విండ్‌ ఫాల్‌ గెయిన్‌ ట్యాక్స్‌ను పునఃప్రవేశపెట్టడం ఇందుకు కారణమైంది. ముడి చమురు ధరల పెరుగుదలతో ఇంధన కంపెనీల మార్జిన్లకు ఇప్పటికే భారీ గండి పడింది. విండ్‌ఫాల్‌ గెయిన్‌ ట్యాక్స్‌తో ఇంధన కంపెనీల ఆదాయం మరింత తగ్గనున్న నేపథ్యంలో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేర్లలో ఇన్వెస్టర్లు పెద్దఎత్తున అమ్మకాలకు పాల్పడ్డారని మార్కెట్‌ వర్గాలు తెలిపాయి.

సిల్వర్‌ రూ.11,000 డౌన్‌

దేశీయంగా విలువైన లోహాలు ధరలు మళ్లీ తగ్గాయి. ఢిల్లీ మార్కెట్లో కిలో వెండి ఏకంగా రూ.11,250 తగ్గుదలతో రూ.2.30 లక్షలకు జారుకుంది. 10 గ్రాముల మేలిమి బంగారం రేటు రూ.1,900 తగ్గి రూ.1,47,800కు దిగివచ్చింది. అంతర్జాతీయ మార్కెట్లో వీటి ధరలు కాస్త తగ్గుముఖం పట్టడం ఇందుకు కారణమైంది. ఔన్స్‌ (31.10 గ్రాములు) గోల్డ్‌ ఒక దశలో 4,416 డాలర్లు, సిల్వర్‌ 68 డాలర్ల స్థాయిలో ట్రేడయ్యాయి.

భారీగా తగ్గిన ఫారెక్స్‌ నిల్వలు

ఈ నెల 20తో ముగిసిన వారంలో విదేశీ మారకం (ఫారెక్స్‌) నిల్వలు 1,141 కోట్ల డాలర్లు తగ్గి 69,834.6 కోట్ల డాలర్లకు పరిమితమైనట్లు ఆర్‌బీఐ శుక్రవారం వెల్లడించింది. అంతక్రితం వారంలోనూ ఫారెక్స్‌ నిల్వలు 705 కోట్ల డాలర్ల మేర తగ్గి 70,975 కోట్ల డాలర్ల స్థాయికి పరిమితం కాగా.. సమీక్షా వారంలో 70,000 కోట్ల డాలర్ల దిగువకు జారుకున్నాయి.

Updated Date - Mar 28 , 2026 | 04:10 AM