త్వరలో కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ!
ABN , Publish Date - Mar 28 , 2026 | 05:53 AM
త్వరలో కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరిగే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. ఈ అంశంపై ప్రభుత్వ పెద్దలు మల్లగుల్లాలు పడుతున్నారని విశ్వసనీయవర్గాలు తెలిపాయి.
కిషన్‌రెడ్డి, రామ్మోహన్‌లకు శాఖల మార్పు?
న్యూఢిల్లీ, మార్చి 27 (ఆంధ్రజ్యోతి): త్వరలో కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరిగే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. ఈ అంశంపై ప్రభుత్వ పెద్దలు మల్లగుల్లాలు పడుతున్నారని విశ్వసనీయవర్గాలు తెలిపాయి. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి.. కేంద్రమంత్రులు కిషన్‌రెడ్డి, రామ్మోహన్ నాయుడుకు శాఖ మార్పులు ఉండవచ్చునన్న చర్చ జరుగుతోంది. దివంగత నేత ఎర్రన్నాయుడు గతంలో నిర్వహించిన కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖను ఆయన కుమారుడు రామ్మోహన్ నాయుడుకు కేటాయించవచ్చునని అంటున్నారు. కమ్యూనికేషన్ల శాఖలో సహాయమంత్రిగా ఉన్న పెమ్మసాని చంద్రశేఖర్‌కు స్వతంత్ర హోదా లభించవచ్చునని భావిస్తున్నారు. లోక్‌సభ మాజీ స్పీకర్ జీఎంసీ బాలయోగి కుమారుడు హరీశ్ బాలయోగి, బీజేపీ ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరిలకు మంత్రివర్గంలో అవకాశం దక్కవచ్చునని ఊహాగానాలు వినపడుతున్నాయి. కేంద్ర పెట్రోలియం మంత్రి హర్దీప్ సింగ్ పురీతో పాటు పలువురు మంత్రులను పదవుల నుంచి తప్పిస్తారన్న అంచనాలున్నాయి. రాజ్యసభకు బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఎన్నికయినందున సీఎం పదవికి ఆయన ఏక్షణంలోనైనా రాజీనామా చేసే అవకాశం ఉంది. ఆయన స్థానంలో ప్రస్తుతం కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్న నిత్యానంద రాయ్‌ను నియమించవచ్చునని సమాచారం. నితీష్ కుమార్‌కు కేంద్రంలో క్యాబినెట్ మంత్రిగా అవకాశం కల్పించవచ్చంటున్నారు. గతంలో వాజపేయి మంత్రివర్గంలో నితీష్ నిర్వహించిన వ్యవసాయ శాఖను ఆయనకు కేటాయించే చాన్స్ ఉంది. ఏప్రిల్ మొదటి వారంలోగానీ, త్వరలో కొన్ని రాష్ట్రాల్లో జరిగే ఎన్నికల ప్రక్రియ తర్వాతగానీ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ ఉంటుందని భావిస్తున్నారు.
సమావేశాల పొడిగింపు
కీలక బిల్లుల ఆమోదం కోసం పార్లమెంటు సమావేశాలను పొడిగించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. షెడ్యూల్ ప్రకారమయితే ఏప్రిల్ 2న బడ్జెట్ సమావేశాలు ముగియాల్సి ఉంది. అనంతరం ప్రోరోగ్ చేసి వాయిదా వేస్తారు. అయితే ఈసారి అలాకాకుండా కొంతకాలం పాటు వాయిదా వేయాలని కేంద్రం భావిస్తోంది. తద్వారా ఎప్పుడైనా తిరిగి సమావేశాలను నిర్వహించేందుకు స్పీకర్‌కు అవకాశం ఉంటుంది. సాధ్యమైనంత త్వరలో పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలను నిర్వహించి మహిళా రిజర్వేషన్ బిల్లు, నియోజవర్గాల డీలిమిటేషన్ బిల్లును ఆమోదింప చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది.