Share News

ఇరాన్‌పై యుద్ధం ముగిసినట్టే..

ABN , Publish Date - Nov 11 , 2026 | 03:44 AM

ఇరాన్‌పై యుద్ధం ఇక దాదాపుగా ముగిసినట్లేనని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ చెప్పారు.

ఇరాన్‌పై యుద్ధం ముగిసినట్టే..
trump

  • ఆ దేశ మిలిటరీని పూర్తిగా దెబ్బతీశాం.. అవసరమైతే మళ్లీ దాడులకు వెనుకాడబోం:

  • ట్రంప్‌ ప్రకటనతో 90 డాలర్లకు దిగివచ్చిన ముడి చమురు

వాషింగ్టన్‌/న్యూఢిల్లీ, నవంబరు 10: ఇరాన్‌పై యుద్ధం ఇక దాదాపుగా ముగిసినట్లేనని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ చెప్పారు. ఇకముందు ఇరాన్‌పై భారీ స్థాయిలో దాడులను తిరిగి ప్రారంభించే అవకాశం లేదని సంకేతాలు ఇచ్చారు. మధ్యంతర ఎన్నికల్లో ట్రంప్‌కు చెందిన రిపబ్లికన్‌ పార్టీ ఘోర పరాజయం పాలైన నేపథ్యంలో ట్రంప్‌ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. దీనితో పశ్చిమాసియాలో పరిస్థితులు చక్కబడతాయని, హోర్ముజ్‌ తెరుకుంటుందనే ఆశాభావం వ్యక్తమవుతోంది. చమురు ధరలు దిగివస్తున్నాయి. మంగళవారం బ్రెంట్‌ క్రూడ్‌ సుమారు మూడు శాతం పడిపోయి బ్యారెల్‌కు 90 డాలర్లకు చేరింది. అమెరికా, ఇరాన్‌ మధ్య శాంతిచర్చల కోసం మధ్యవర్తిత్వం చేస్తున్న ఖతార్‌ ప్రధాని షేక్‌ మహమ్మద్‌తో శ్వేతసౌధంలో భేటీ అయిన ట్రంప్‌ అనంతరం మీడియాతో మాట్లాడారు. ‘‘ఇరాన్‌ మిలిటరీని పూర్తిగా దెబ్బతీశాం. అణుశుద్ధి సామర్థ్యంలో 85శాతం ధ్వంసం చేశాం. ఇరాన్‌ ఇప్పుడు చర్చల కోసం మర్యాదగా మాట్లాడుతోంది. దీనితో యథాతథ స్థితి కొనసాగించాలని భావిస్తున్నాం. ఇరాన్‌ అణు కార్యక్రమంపై ఒప్పందం కుదిరి, హోర్ముజ్‌ జలసంధి తెరుచుకుంటే.. ఆ దేశంపై దాడులు చేసే అవకాశం తక్కువ. కానీ చర్చలు విఫలమైనా, పరిణామాలు మళ్లీ మొదటికి వచ్చినా.. మళ్లీ దాడులకు వెనుకాడబోం’’ అని ట్రంప్‌ పేర్కొన్నారు.

ప్రతిరోజూ ట్రంప్‌కు నెతన్యాహు ఫోన్‌

ఇజ్రాయెల్‌ ఎన్నికల్లో ప్రతికూల ఫలితాలు ఎదుర్కొన్న ఆ దేశ ప్రధాని నెతన్యాహు ఇరాన్‌పై మళ్లీ దాడులు చేసి, పరువు కాపాడుకోవాలని భావించారు. ఈ క్రమంలో ప్రతిరోజూ ట్రంప్‌కు ఫోన్‌ చేసి యుద్ధం మొదలుపెడదామా అని అడుగుతూ వచ్చారు. ముఖ్యంగా అమెరికా మధ్యంతర ఎన్నికల్లో రిపబ్లికన్లు ఓడిపోయిన తర్వాత దాడుల కోసం తీవ్రంగా ఒత్తిడి చేశారు.


కానీ ఎన్నికల ఫలితాలు, సలహాదారుల సూచనలు, గల్ఫ్‌లోని మిత్రదేశాల విజ్ఞప్తి మేరకు.. ఇరాన్‌పై దాడి వద్దని, దౌత్యపరిష్కారానికి ప్రయత్నిద్దామని ట్రంప్‌ స్పష్టం చేస్తూ వచ్చారు. శ్వేతసౌధంలోని కీలక అధికారులను ఉటంకిస్తూ.. ఫైనాన్షియల్‌ టైమ్స్‌ పత్రిక ఈ వివరాలు వెల్లడించింది.

7 షరతులకు అంగీకరిస్తేనే విరమణ: ఇరాన్‌

ఇరాన్‌పై ఇక ముందు దాడులు చేసే అవకాశం లేనట్లేనన్న ట్రంప్‌ వ్యాఖ్యలపై ఇరాన్‌ సుప్రీం నేషనల్‌ సెక్యూరిటీ కౌన్సిల్‌ చీఫ్‌ మొహ్సెన్‌ రెజాయి స్పందించారు. తమ ఏడు షరతులకు అమెరికా అంగీకరిస్తేనే యుద్ధ విరమణకు పశ్చిమాసియాలో ఉద్రిక్తతలకు ముగింపు పడుతుందని ప్రకటించారు. ఇరాన్‌పై యుద్ధంతో అమెరికా ప్రభుత్వంలో చీలికలు వచ్చాయని వ్యాఖ్యానించారు. పశ్చిమాసియాలో పరిణామాలు మారిపోయాయని, పరిస్థితి ఇకపై మునుపటిలా ఉండబోదని స్పష్టం చేశారు. ‘‘యుద్ధం ముగియాలంటే.. ఇరాన్‌తోపాటు హెజ్బొల్లా, హుతీలపైనా దాడులు నిలిపివేయాలి. హోర్ముజ్‌ బయట అమెరికా నౌకాదళ దిగ్బంధాన్ని వెంటనే ఎత్తివేయాలి. అన్ని సముద్ర రవాణా మార్గాలను పునరుద్ధరించాలి. ఇరాన్‌పై ఆర్థిక ఆంక్షలు ఎత్తివేయాలి. విదేశాల్లో స్తంభింపజేసిన ఇరాన్‌ ఆస్తులను విడుదల చేయాలి. ఇరాన్‌ అంతర్గత అంశాల్లో ఎలాంటి జోక్యం చేసుకోకూడదు. పశ్చిమాసియా నుంచి అమెరికా స్థావరాలను ఖాళీ చేయాలి’’ అని రెజాయి పేర్కొన్నారు.


అమెరికా రక్షణ మంత్రి పీట్‌ హెగ్సెత్‌పై అభిశంసన!

ఇరాన్‌తో యుద్ధం, ఇతర అంశాల్లో చట్టవిరుద్ధంగా వ్యవహరించారంటూ అమెరికా రక్షణ మంత్రి పీట్‌ హెగ్సెత్‌పై అభిశంసనకు ప్రయత్నం మొదలైంది. ప్రతిపక్ష డెమోక్రాట్లు కాకుండా సొంత రిపబ్లికన్‌ పార్టీకి చెందిన ఎంపీ థామస్‌ మాసీ ప్రతినిధుల సభలో ఈ తీర్మానం ప్రవేశపెట్టడం గమనార్హం. అమెరికా పార్లమెంటు కాంగ్రెస్‌ అనుమతి లేకుండా ఇరాన్‌పై యుద్ధం, కాంగ్రెస్‌ ఆదేశాలను పాటించకపోవడం, 60రోజుల యుద్ధ పరిమితిని ఉల్లంఘించడం, పౌరుల ప్రాణాల రక్షణలో నిర్లక్ష్యం కరీబియన్‌ సముద్రంలో పడవలపై దాడులు, వెనెజువెలా అధ్యక్షుడి అరెస్టు, యెమెన్‌పై దాడుల అంశాల్లో యుద్ధ అధికారాల చట్టాన్ని ఉల్లంఘించడం.. తదితర ఆరోపణలతో అభిశంసనకు తీర్మానం పెట్టారు. అయితే ప్రస్తుతం ప్రతినిధుల సభ, సెనేట్‌ రెండింటిలోనూ రిపబ్లికన్లకు మెజారిటీ ఉంది. మధ్యంతర ఎన్నికల్లో డెమోక్రాట్లు గెలిచినా.. వారు జనవరిలో బాధ్యతలు స్వీకరిస్తారు. ఈ లెక్కన తాజా అభిశంసన నెగ్గే అవకాశాలు దాదాపు లేవని నిపుణులు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి..

బంగ్లాదేశ్‌లో అడుగుపెడితే షేక్ హసీనాకు ఉరిశిక్ష అమలు తప్పదు!

దాడికి సిద్ధంగా ఉన్నాం.. ఇరాన్‌కు అమెరికా అధ్యక్షుడి వార్నింగ్..

Updated Date - Nov 11 , 2026 | 03:47 AM