Share News

సముద్ర రవాణాను నిలిపివేసిన ఖతార్.. ఇరాన్‌పై ఒమన్‌ ఫైర్!

ABN , Publish Date - Jul 12 , 2026 | 08:59 PM

హోర్మూజ్ జలసంధి చుట్టూ హైటెన్షన్ పరిస్థితులు నెలకొనడంతో ప్రజా భద్రతను దృష్టిలో ఉంచుకుని ఖతార్‌ ప్రభుత్వం కీలక ప్రకటన విడుదల చేసింది. సముద్ర కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేయాలని ఆ దేశ వాణిజ్య నౌకల యాజమాన్యాలను ఆదేశించింది.

సముద్ర రవాణాను నిలిపివేసిన ఖతార్.. ఇరాన్‌పై ఒమన్‌ ఫైర్!
Qatar Suspends Maritime Operations

దోహా/మస్కట్, జులై 12: అమెరికా-ఇరాన్ దేశాల మధ్య దాడులు, ప్రతిదాడులతో పశ్చిమాసియాలో మళ్లీ యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హోర్మూజ్‌ జలసంధిని (Strait of Hormuz) ఇరాన్‌ మరోసారి మూసివేయడం, అంతర్జాతీయ నౌకలపై దాడులకు తెగబడుతుండటంతో గల్ఫ్ రీజియన్‌లో ఎప్పుడేం జరుగుతుందోనన్న తీవ్ర ఉత్కంఠ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో గల్ఫ్‌లోని ప్రముఖ దేశం ఖతార్‌ అత్యవసర నిర్ణయం తీసుకోగా, పొరుగు దేశం ఒమన్‌ సైతం ఇరాన్ వైఖరిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.


ఖతార్ కీలక నిర్ణయం.. నౌకల రాకపోకలు బంద్

హోర్మూజ్ జలసంధి చుట్టూ హైటెన్షన్ నెలకొనడంతో ప్రజా భద్రతను దృష్టిలో ఉంచుకుని ఖతార్‌ ప్రభుత్వం ఒక కీలక ప్రకటన విడుదల చేసింది. తమ పరిధిలోని సముద్ర కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేయాలని వాణిజ్య నౌకల యాజమాన్యాలను ఆదేశించింది. తదుపరి ఉత్తర్వులు వచ్చేంత వరకు వాణిజ్య నౌకలు, విహార నౌకలతో పాటు సాధారణ చేపల వేట బోట్లను కూడా రేవులకే పరిమితం చేయాలని స్పష్టం చేసింది.


దోహాపై క్షిపణుల దాడి.. అలర్ట్ అయిన ఖతార్

ఈ (ఆదివారం) ఉదయం ఖతార్‌ రాజధాని దోహా లక్ష్యంగా ఇరాన్‌ బాలిస్టిక్‌ క్షిపణులను ప్రయోగించింది. అయితే ఖతార్‌ ఎయిర్ డిఫెన్స్ (రక్షణ) వ్యవస్థ సకాలంలో స్పందించి వాటిలో కొన్నింటిని గగనతలంలోనే కూల్చివేసినట్లు సమాచారం. ఈ క్షిపణి శకలాలు పడటం వల్ల కొందరు పౌరులకు తీవ్ర గాయాలైనట్లు అక్కడి స్థానిక మీడియా వెల్లడించింది. ఈ దాడుల నేపథ్యంలో ఎలాంటి విపత్కర పరిస్థితులు ఎదురైనా, శత్రువులను సమర్థంగా తిప్పికొట్టేందుకు తమ సైనిక సేనలు పూర్తి సన్నద్ధంగా ఉన్నాయని ఖతార్ ప్రభుత్వం ప్రకటించింది.


ఇరాన్‌వి బాధ్యతారాహిత్యమైన చర్యలు: ఒమన్‌ ఆగ్రహం

మరోవైపు ఇరాన్‌ ప్రవర్తిస్తున్న తీరుపై ఒమన్‌ దేశం నిప్పులు చెరిగింది. అమెరికా సైనిక స్థావరాలపై దాడులు చేసే నెపంతో.. ఇరాన్ తమ భూభాగంపై బాంబులు ప్రయోగించడాన్ని ఒమన్ తీవ్రంగా తప్పుబట్టింది. ఈ విషయమై ఒమన్‌లోని ఇరాన్‌ రాయబారికి సోషల్‌ మీడియా వేదికగా తమ నిరసనను తెలియజేసింది.

'ఇరాన్‌ తీసుకుంటున్న బాధ్యతారాహిత్యమైన చర్యలపై ఒమన్‌ తీవ్ర విచారం వ్యక్తం చేస్తోంది. దేశ సార్వభౌమాధికారాన్ని గౌరవించడం, పొరుగు దేశాలతో సత్సంబంధాలు కలిగి ఉండటం, ఇతరుల అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోకపోవడం వంటి అంతర్జాతీయ నిబంధనలకు ప్రతి ఒక్కరూ కట్టుబడి ఉండటం అత్యంత అవసరం'. అని ఒమన్‌ ప్రభుత్వం అధికారిక ప్రకటన విడుదల చేసింది.

హోర్మూజ్‌ జలసంధి సంక్షోభంపై చర్చలు జరిపేందుకు ఇరాన్‌ విదేశాంగ మంత్రికి ఒమన్‌ ప్రభుత్వం ఆతిథ్యం ఇచ్చిన మరుసటి రోజే.. ఇరాన్, ఒమన్ భూభాగంపై దాడి చేయడం, దానికి ప్రతిగా ఒమన్ ఇంతటి ఘాటు ప్రకటన విడుదల చేయడం గమనార్హం.


Also Read:

ఫిరంగి కోసం పోరాటం

వాణిజ్య నౌకపై ఇరాన్ దాడి.. భారతీయుడి గల్లంతు

Updated Date - Jul 12 , 2026 | 09:12 PM